శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి  చిన్నకథలు
వడ్లగింజలు
"రాజద్వారే,  రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు. వేదోక్తం పరిపూర్ణమా__" 
       మెల్లిగా అడుగులు వేస్తూ, ద్వారంలోనుంచే యిలాగ ఆశీర్వచనం ప్రారంభించాడు తంగిరాల శంకరప్ప;  కాని, దివాన్జీ కెదురుగానూ గుమ్మానికొక పక్కగానూ నుంచొనివున్న ఠాణేదారు, మాట సగంలోనే గభీమని అడ్డంవచ్చి  "ఫొ ఫొ మళ్ళీ యిక్కడికి వచ్చావూ?"  అంటూ గుండెలమీద చెయ్యివేసి అతణ్ణి ఆపుచేసి ' ఏయ్, యెవరోయ్ జవాన్లూ?"  అని ద్వారం కేసి చూస్తూ కరుగ్గా పిలిచాడు.
     "చిత్తం బాబయ్యా, మేమడ్డుపెడుతూనే వుండగా, జలగలాగా జారి లోపలికి వచ్చేస్తున్నారండి."  అంటూ యిద్దరు జవాన్లు వచ్చి శంకరప్పకి రెండువైపులా నుంచున్నారు.
     "చాల్చాలు, దయచెయ్యండి, దయచెయ్యండి" అంటూ మరో జవాను వెనకపాటుగావచ్చి, వీపుమీద వేళ్ళాడుతూవున్న అంగాస్త్రపుకొంగులు పట్టుకున్నాడు.
"దివాన్జీవారుండగా మధ్యమీరు---ఎవరయ్యా?" అంటూ శంకరప్ప విడిపించుకోపోయాడు.  జవాను పట్టుకి అంగాస్త్రం చిరిగిపోతుందా   అన్నంత     
బింకంగా కూడా ముందుకి రాబోయాడు కాని "చాల్చాలు, వూరుకో యీపాటికి, దరిద్రపు అంగాస్త్రం గుడ్డా నువ్వూ --- యింకా చూస్తావేమోయ్?" అని అతగాణ్ణి జవాన్లమీదికి గెంటేశాడు ఠాణేదారు.
     "నీమూలాన మాక్కూడా మాట వస్తోంది, మంచివాడ వే రా రావయ్యా"  అంటూ జవాన్లు శంకరప్ప రెక్కలు పట్టుకున్నారు.
     "నేను డబ్బుకోసం రాలేదు"  అని శంకరప్ప మళ్ళీ యేదోచెప్పబోయాడు;  కాని "డబ్బక్కర్లేకపోతే మరి యీవేషాలన్నీ యేమిటి?  వీధిలోకి పడగెంటక, యింకా చూస్తారేమిటోయ్?"  అని ఠాణేదారు జవాన్లమీద కళ్ళెర్రచేశాడు.
     ఠాణేదారు తొందరపెట్టడమూ, సర్వాధికారి అయిన దివాన్జీ యిదేమీ గమనించక పోవడమూ --- దీంతో జవాన్లకి
చాలా దిలాసా వచ్చింది. వెంటనే వాళ్ళు పొదివి పట్టుకుని, శంకరప్పని వీధిలోకి లాక్కుపోయారు.
     అయినా లోపలికి రావాలని శంకరప్ప గింజుకోవడం మానలేదు.  వెర్రి ఆవేశంతో అతనొక్కక్క వూపు వూపినప్పుడు, తట్టుకోలేక, జవాన్లు ముందుకీ వెనక్కీ వోక్కొక్క వూపువూగిపోసాగారు.
     యిదంతా తెలుసుకోడాని కప్పటికి తెరిపయింది దివాన్జీకి.
చేతిలోవున్న కాగితం పక్కన వుంచి, మరో కాగితం అందుకుని "యేమిటా అల్లరి?"  అని నిదానంగా
అడిగాడతను.
     "ఎవరో పిచ్చి బ్రాహ్మడు మహాప్రభూ!  ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరీ చేస్తున్నాడండి."
      'ఒకరూపాయి చేతిలో పెట్టి పొమ్మనలేకపోయావా?"
     "డబ్బక్కర్లేదు టండి."
     "మరేం కావాలిట?"
     "చెప్పలేదండి."
     "అడిగావా నువ్వు?"
     "లే---ద్---"
      చేతులు నులుపుకుంటూ యిలా నసికాడు ఠాణేదారు.
     వీధిలో జవాన్ల కట్టుళ్ళలోవుండి, యిదంతా వింటూనేవున్న శంకరప్ప  "వొక్కక్షణం మాట్టాడ్డంతప్ప మరేమీ అక్కర్లేదని చెప్పవయ్యా" అని కేకేశాడు.
     "చెప్పవయ్యా?"  అని పళ్ళు బిగించి, పెదవులుమాత్రం కదుపుతూ శంకరప్పమీద నిప్పులు కురిశేశాడు ఠాణేదారు. ఆ ఏకవచన ప్రయోగం గుండెల్లో కసుక్కున కైజారు గుచ్చుకున్నంత బాధ పెట్టిం దతనికి.
     ఏకవచనప్రయోగం అంటే నౌకరీలో వుండే వారి నాలుక యెంతయినా నేర్పు చూపించగలదు;  కాని చెవులు మాత్రం ఓర్పు కనపరచలేవు.
      "ఒక అంగాస్త్రపుగుడ్డ కట్టుకుని, మరొక అంగాస్త్రపు గుడ్డ కప్పుకుని దరిద్రం వోడుకుంటూ---"
      "అయితే?"
     "పిచ్చి బ్రాహ్మడు మహాప్రభూ!"
     "బేడీలు వున్నాయా?"
     "లేవండి"
     "గుడ్డలు మాసీ చిరిగీ వున్నాయా?"
     "లే వండి"
     "చింపిరి తలా?"
     "కాదండి."
      "మరి నీఆగడం అంతా యెందుకోయ్?"  అన్నట్టు మొగం వంచుకుని, సులోచనాలపై నుంచి కొంచెం చురుగ్గా
చూస్తూ వుండగా "నేను కార్యార్ధిని గాని, పిచ్చివాణ్ణి కాను మహాప్రభూ!"  అని శంకరప్ప గట్టిగా కేక వేశాడు.
      ఠాణేదారు గుండెలు కొట్టుకున్నాయి;  కాని కళ్ళు శంకరప్పమీద మళ్ళీ నిప్పులు కక్కాయి.
     చికిలికళ్ళు కాగితంమీదకి తిప్పుకుని "యెదటికి రప్పిచు" అన్నాడు దివాన్జీ.
     కంఠం నొక్కుకుపోయి ఠాణేదారుకి మాట రాలేదు.  చూపులుమాత్రం వీధికేసి మళ్ళాయి.  ఆయింగితం కనిపెట్టి,
జవాన్లు, శంకరప్పని తెచ్చి దివాన్జీ యెదట విడిచిపెట్టారు.
     దివాన్జీ యెగాదిగా చూశాడు.  ఉన్మాద లక్షణాలు కనపడక పోవడమే కాదు, శంకరప్ప మొగంమీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది.
     మొదట దివాన్జీ కళ్ళు జిగజిగ లాడిపోయాయి;   కాని తరవాత అంతలో అధికారదర్పం పొంగి మనస్సు బిరుసెక్కిపోయింది.  దాంతో కొరకొర లాడుతూ "యెవరయ్యా మీరు?"  అని ప్రశ్నించాడు.
     "మా యింటిపేరు తంగిరాలవారు. నాపేరు శంకరప్ప. నేను తణుకునుంచి వచ్చానండి."
     "ఏమిటి పని?"
     "మహారాజులుంగారి దర్శనం చేసుకుందామని వచ్చాను."
      దివాన్జీ కళ్ళు చిమ చిమ లాడి పోయాయి. పెదవులు అప్రయత్నంగా కదిలాయి.  "ఏమిటీ?  ఈ వేషంతోటే?"  అనేమాటలు నాలుక చివర గభీమని జారిపోయాయి.
      "చిత్తం చిత్తం, ఒక విద్యలో నేను చక్రవర్తిని.  విద్వత్తవున్న చోట వేషం అక్కర్లేదండి"  అని వూగీసలాడుతూ
శంకరప్ప బదులు చెప్పాడు.
     "ఏ విద్యలో నీ చక్రవర్తిత్వం?"
     "చదరంగంలో."
     దివాన్జీ సీత్కారం చేశాడు.  అతని మొగంమీద వెటకారం పొటమరించి వుంది. 
     పరోక్షంమాట యేమయినా, ప్రత్యక్షంలో, మొదట కూచోమనకపోవడమూ, తరవాత తన సహజ వేషాన్ని నిరసించడమూ, ఆపైని యేకవచన ప్రయోగమూ, చివర కిదీనీ. దీంతో శంకరప్పలో ధౌర్త్యం అంకురించింది.
     "చదరంగం అంటే లోకసామాన్యానికి లోపల కర్రముక్కలూ, పైని లక్కపూతా మాత్రమే కనపడతాయి;
కాని తెలిసినవారికి అందులో చతురంగబసంయొక్క నిజస్వరూపం గోచరిస్తుంది.  యుద్ధరంగంలో అహమికతో యెదురుకున్న యిద్దరు చక్రవర్తుల చావు బతుకుల సంరంభంకూడా ప్రత్యక్షంగా కనబడుతుంది."
     "గొప్పవాఖ్యానమే"  అని నిరసించాడు దివాన్జీ 
     "ధన్యోహమ్"  అని వెటకారంగా చూశాడు శంకరప్ప.  వెనకపాటున వచ్చి, మెడమీద చెయ్యివేసి నొక్కిపట్టిన
ట్టయింది దివాన్జీకి.  మాట తొణకలేదు.
     "బ్రాహ్మలే కాదు, తురకలు, రెడ్లు, తెలగాలు, వెలమలు ---  చివరికి క్షత్రియులు కూడా యెక్కడా నా ఆట కట్ట
కలిగినవారు లేకపోయారు."
     "అ --- బ్బా!...అలాగేం?"
     "ఆత్మస్తుతి మంచిది కాదు కాని --- ఒక్కొక్కప్పుడు ---ఒక్కొక్కచోట అదే చాలా అవసరం అవుతూ వుంటుంది.
ఇంతకీ;  శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగా రంటే చదరంగం ఆటలో నిధి అని దిగ్దంతులు ఘోషపెడుతూ వుండడంవల్ల వొక్కమాటు ---  ఒక్కఆట వారితో ఆడాలని ---" 
      "అంతేనా కోరిక?"
      "అంతే.  అక్షరాలా అంత మాత్రమే." 
     "అయితే శీఘ్రంగా వెళ్ళవచ్చు."
     "అదేమీ?"
     "సాధ్యం కాదు కనక."
     "ఏమీ?  ఎందుకు కాదూ?"
     "మనమేమిటి,  వీడితో మాట్టాడం యేమిటి!" అని దివాన్జీకి అభిజాత్యంతోచింది;  కాని "చదరంగం ఆడకూడదని
నిశ్చయించుకున్నారు ప్రభువు"  అని మాట జారి వచ్చేసింది.
     "ఎంచేతో?"
     "తగిన వుజ్జీ దొరక్క... చివరకి ఆట కట్టడంమాట దేవుడెరుగును, నాలుగైదు యెత్తులయినా పొంకంగా వెయ్యగల
వాడు కనబడలేదు పృధివిమీద."
     "విపులా చ పృధ్వీ!"
     దివాన్జీ వులిక్కిపడ్డాడు;  కాని అలాంటిదేమీ లేనట్టు నటిస్తూ, అందుకు నిదర్శనంగా పృధివిమాట జారవిడచి
"కళ్ళుతెరవని కుర్రకుంకలతో ఆ టేమిటని దాంతో నిరాశ చేసుకున్నారు మహారాజులుంగారు" అన్నాడు.
     "నాతో ఆడిచూడకుండానే?" అనిముదలకించాడు శంకరప్ప.
     దివాన్జీ  వుగ్రుడైనాడు.  నిప్పులు కక్కుతూనే చూశాడు;  కాని శంకరప్ప గుండెలమీద తర్జనీ నిర్దేశం యింకా గుండెల మీదేవుంది.  కళ్ళింకా నిలవతీసి అడుగుతూనే వున్నాయి.
     తల యెగరవేసుకుంటూ "నువ్వేం ఆకాశంమీద నుంచి వూడిపడ్డావా?" అని నిరసనగా అడిగాడు దివాన్జీ.
     "ఇంకా పైనుంచే అనే చెప్పవచ్చు" నని దానికి శంకరప్ప నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు.
     "అబ్బో!"
     "ఆశ్చర్యం అక్కర్లేదు.  చదరంగం ఆడి తంగిరాల శంకరప్పని జయించగలవాడు చతుర్దశభువనాల్లోనూ లేడు."
     "మహా కోస్తావే?"
     "కత్తి చేతిలో వున్నప్పుడు కొయ్యకపోవడం యేమీ?"
     "బతకతలుచుకోలేదూ" అని కరుగ్గా అడిగాడు దివాన్జీ.
     అదీమాట. అసలైనమాట అది. మళ్ళీ చెబుతున్నాను.  చదరంగం ఆటలో నేను గొప్ప విద్వాంసుణ్ణి;  కాని నావిద్వత్తకి వినియోగం కనబడలేదు. అంటే ఆవిద్యకీ నాకూ అనుకూల్యం పొసగలేదు.  ఇక బతికేం ప్రయోజనమూ?  ఈవుద్దేశంతోటే యిక్కడికి వచ్చాను. ఇది చివరి ప్రయత్నం. నాచావుబతుకు లిక్కడ తేలిపోవాలి."
     దివాన్జీ యెర్రగా చూశాడు.
     "ఏతావాతా: మొండిపట్టు పట్టి ఆటలో కూచుని వోడిపోతే, మహారాజులుంగారు, వచ్చినవాడి తల కొట్టించి కోట
కొమ్మలకు కట్టిచడానికి శపథం పట్టారని తెలుసు. తప్పకపోతే అందుకు సిద్ధపడే వచ్చేశాను."
     "అంత సాహసం యేమీ? పెళ్ళయిందా?"
     "ఇంటావిడ కాపరమే చేస్తోంది."
     దివాన్జీకి హఠాత్తుగా జాలి కలిగింది.
     "కలో గంజో తాగుతూ పెళ్ళామనీ, పిల్లలనీ యేదో నలుగురి తో బాటుగా వుండక, యీ దుస్సాహసం యేమయ్యా నీకు?"
     "మంచి ప్రశ్నే; కాని దీనికి సర్వత్రా చెలామణి లేదు."
     "అంటే?"
     "అంటేనా?...... విద్యల్లో వుండుకున్న రుచి అలాంటిది. అది అందరికీ అందేదికాదు.  విద్వత్త వుంటే తిండి
అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, గుడ్డ కూడా---"
     "పెళ్ళామో?"
     "శాస్త్రం చెప్పిన తరవాయిగా వుంది.  నిద్రాహారాలే అక్కర్లేక పోయాక యిక పెళ్ళామెందుకూ?  అయితే, 
ప్రాఙ్ఞత రాకముందే నాకు పెళ్ళయిపోయింది.  ఇంటావిడ రావడమూ, చదరంగం వ్యసనం హెచ్చిపోవడమూ వొక్క
మాటే---"
     "డబ్బు సంపాదించుకు రమ్మని యింటావిడ తరిమి కొట్టిందన్నమాట."
     "ఇంటావిడ అయిన ప్రతిస్త్రీకీ ఆ అధికారం వున్నదే కాదూ?  ప్రతి మొగాడి యింటావిడా ఆ అధికారం చెలా
యించుకుంటూనే వుంది కాదూ?  ఏవంచ - నావిషయంలో కూడా అది కొంతలేకపోలేదు.  తమరు - బాగానే కనిపెట్టారు;
కాని వున్నదంతా అలాగే వుండిపోయింది."
     ఇది విని దివాన్జీ రుష్టుడూ అయినాడు, లజ్జితుడూ అయినాడు. కాని యీరెండింటి కలుపుతో చివరికి అభావదశకి వచ్చి "యింకా యేమిటీ" అన్నాడు.
     "ప్రతీ దినమూ యెవరో వొకరు వస్తూవుండడమూ, నాలుగో యెత్తు వెయ్యలేక చల్లగా జారుకుంటూ వుండడమూ -ఇక్కడ మహారాజులుంగారికీ, అక్కడ నాకూ వొక్కలాగే ---"
     "ఆ దురుసు పోలిక యేమిటయ్యా?"
     "సత్యం వొక్కొక్కప్పుడు దురుసుగానే వుంటుందండి"
     దివాన్జీ తెల్లపోయాడు.
     "సత్యం యెదట యెలాంటివాళ్ళూ వొక్క అంతస్తులోనే ఉంటారు. పోనీ, తగిన వుజ్జీ దొరక్క యిక్కడ మహా
రాజులుంగారికీ విసుపే వచ్చింది.  అక్కడ నాకూ విసుపే వచ్చింది. దీన్ని తమ రేమంటారు?"
     "నీ ఆట లెక్ఖేమిటయ్యా?"
     "సెబాస్!  చాలా రోజులకి వినపడిం దీమాట;  కాని ప్రస్తుతం యీమాట అనతగినవారొక్క మహారాజులుంగారే.
ఇక తమరా! వారి దర్శనం తమ చేతిలో వుంది."
     దివాన్జీ మొగం ధుమధుమ లాడిపోయింది. "సరే ఆలోచిస్తాం వెళ్ళు" అని నిరసనభావం కనపరచి అతను మొగం
వంచుకున్నాడు.
     "నేను కట్టుకోవడానికి గుడ్డకూడా లేనివాణ్ణని ప్రత్యక్షమే.  అయితే, నా ప్రజ్ఞ చూపించాలనే కాని నాకు మరేమీ ఆశ లేదు. మరో కోరిక యెంతమాత్రమూ లేదు.  ఈ విషయంలో సంకోచం యెంతమాత్రమూ అక్కర్లేదు."
     "మంచిమాటే."
     "నేనోడిపోతే నాతల తీసుకోడానిక్కూడూ నా అభ్యంతరం లేదు."
     "అదెలాగా తప్పనిదే."
     అవ్యధానంగా "తథాస్తు" అని, "యిక నీ అభ్యంతరం యేమిటీ?" అన్నట్టు చురుగ్గా చూసి, డంగయిపోయి దివాన్జీ
మాట్లాడలేకపోగా "తెలుసుకోగలిగితే అదీ ఒక గౌరవమే" అని టొకాయించాడు శంకరప్ప.
     "ఇంకేం, పరిపూర్ణజ్ఞానం కలిగిం దన్నమాటే."
     "చాలామంది పెద్దలున్నూ యిలాగే శెలవిప్పించారు."
     దివాన్జీ తేరి చూశాడు. నిజంగా అత నీమర్మాఘాతానికి తాళుకోలేకపోయాడు. తన పాండిత్యమూ, తన ఐశ్వర్యమూ, తన పదవీ --- యివన్నీ వొక గోచిపాతరాయుడి యెదట గుడ్డి గవ్వకయినా మారకపోవడం అతనికి చిన్నతనం అనిపించింది.
     ఏమీ పాలుపోక యెదటికి చూశా డతను. ఠాణేదారు కనపడ్డాడు. చేతులు కుట్టుకుని వినయంగానే నుంచుని వున్నాడు;
కాని దివాన్జీకి అతని నొసలు మాత్రం "నేను చెబితే విన్నావా?" అని దెప్పుతున్నట్టు కనపడింది.
     "ఛా" అనుకుని ద్వారంకేసి చూశాడు.  ఒకజవాను కనపడ్డాడు.  అతను కూడా వొదిగి వొదిగే నుంచుని వున్నాడు;  కాని కళ్ళుమాత్రం "మమ్మల్ని గదిమినట్టు కాదు బాబయ్యా" +అని వెక్కిరిస్తున్నట్టున్నాయి. 
     చిరాకు పుట్టింది. అప్రయత్నంగా కిందకి చూశాడు.  చేతిలో కాగితం వుంది.  బేగీరావుటపాలో పలివెల ఠాణాకి
వెళ్ళవలసిన కాగితం అది.  ఒక్కమాటు మనస్సు గజిబిజి  అయిపోయింది.  ఎక్కడ లేని తొందరా పుట్టింది.  అది కుడిచేతిని వొణికించేసింది.  చేతిలోవున్న కాగితం వూపేసింది.  మాటలోకూడా కొచెం తడబాటు కనబడింది.
     "ఠాణేదా---ర్"
     "చిత్తం చిత్తం" 
     "ఇది అంచె పరుగులమీద వెళ్ళాలి"
     "చిత్తం" అంటూ  ఠాణేదారది దోయిలించి పుచ్చుకుని "మరి యీ చదరంగం సేనాపతి మాట యే మాలో
చించా?" రన్నట్టొకమాటు కనుబొమ్మలెగరవేసి, చివరికి మీరూమీరూ తంటాలు పడండి, నాకేంబాబూ?" అన్న
ట్టొక చిరునవ్వు మొలిపించి, మెల్లిగా తిరిగి, గబగబా వీధికేసి బయలుదేరాడు.
     శంకరప్పతో మాట్టాడ్డం దివాన్జీ కిష్టంలేదు.
     ఇంత సేపు మాట్టాడినందుకే అతను చాలా పశ్చాత్తాపపడ్డాడు.  "ఆదిలో యిప్పుడు మాట్టాడ్డానికి వీలులేదని పంపేసి వుంటే, ఈ యిబ్బంది కలిగివుండకపోవు" నని పిసుక్కున్నాడు.  అయితే, యిప్పుడయినా తొరగా పంపెయ్యడానికేం?  కాని యేమనీ పంపెయ్యడం?
     మాట్టాడవలసినవారు తన యెదుట మరెవరూ లేరన్నట్టు నటిస్తూ, అతనొక కాగితం తీశాడు. ఒకటి రెండు బంతులు చదివాడు;  కాని దృష్టి దానిమీద నిలవలేదు.
     ఒకమాటు ఈవైపు కాగితాలు సద్దాడు. మరోమాటు ఆవైపు కాగితాలు సద్దాడు; కాని "బొత్తి సరిగానే వుందే,
యెందు కీ పాట్లూ?" అని యెవరో అడిగినట్టయి అది వొదులుకున్నాడు.
     పొడుముకాయ కాలికిందకి దొర్లిపోయి వుంది. అది తీసి "అనవసరం" అనుకుంటూనే వొక్క పట్టు పీల్చాడు.  చర్రుమని నసాళం అంటి చురుకు పుట్టింది.  "ఫో ఫో" అనేద్దామనుకున్నాడు;  గాని ప్రతిష్ట పీకింది.
     అమాంతంగా పెట్టె మూత తెరిచాడు.  ఎడమవైపు అరలోబత్తాయి చాకూ, కంఠాణీ కనపడ్డాయి.  దేనికోసమో వెతుకుతున్న ట్టొకమా టవి పైకితీసి పట్టుకుని మళ్ళీ పడేశాడు.  ఎదటి అరలో బాతు కలం కనపడింది.  అది బండగా రాస్తున్నట్టు జ్ఞాపకం వచ్చి "చెక్కుదాం" అనుకుంటూ పైకితీసి, అంతలో "ఛా, యింతమంది నౌకర్లుండగా మనం చెక్కడంయేమిటి?" అనుకుని యథాస్థానంలో వుంచేశాడు.  కుడివైపుచిన్న అరలో విడిడబ్బు లున్నాయి.  అవొకమాటు గలగల్లాడించాడు.  మూత అరలో వొక కాగితం వేలాడుతోంది.  అదితీశాడు;  కాని యింతకు ముందే జవాబు రాసేసిన కాగితం అది.  మళ్ళీ అది అక్కడ దాచేసి, గభీమని పెట్టెమూత వేసేశాడు.
     వొడిలోవున్న తాళాలగుత్తి పక్కని పడేశాడు.   పక్కని వున్న పొడుముకాయ రొంటిని పెట్టుకున్నాడు.  సిరాబుడ్డి కొంచెం జరిపాడు.  అటువున్న యిసకడబ్బీ యిటు పెట్టాడు.
     చివరికి మరేమీ విలాసాలు తోచక, వొకమాటు మెడగోక్కుని హఠాత్తుగా యేదో జ్ఞాపకం వచ్చినట్టు మొగం
పైకేత్తాడు.
     కాని, యెన్ని చేసినా మొగం పైకెత్తాటప్పటికి శంకరప్పే కనపడ్డాడు.
     "ఇది వూరికే కదిలే ఘటం కాదయ్యోయ్" అన్నట్టు పెంకిచూపులు చూస్తున్నట్టుకూడా కనపడ్డాడు శంకరప్ప.
     దివాన్జీకి అభిమానం ముంచుకు వచ్చింది. "ఛా!"  ఈదరిద్రుడి కోసం యిన్ని తికమక లేమి టని శౌర్యంకూడా  వచ్చింది.  మీదపడి మొట్టాలన్నంత ఆవేశమున్నూ వచ్చింది; కాని తన పదవీ, తన తాహతూ, తన అంతస్తూ స్మరించుకుని ఆ వేశం అసహ్యభావంగా మార్చుకున్నాడు.
     దీంతో "మహారాజులుంగారికి కావలసిన మనిషి" అనే జ్ఞానం కూడా లేకుండా, శంకరప్పని చుర చుర చూస్తూ "నీకు కాదూ చెప్పడం?  ఇక దయచెయ్యి"  అంటూ చెండుకున్నాడు.
     "దయచెయ్యిడం అంటే యేమంత కష్టమైనదికాదు.  దానికింతసేపక్కర్లేదు;  కాని నాకేమి చెప్పినట్టూ!"  అని 
ముదలకించాడు శంకరప్ప.
     "ఆలోచిస్తాం వెళ్ళు"
     "వెళ్ళి?"
     "వెళ్ళడమే. తూర్పుగా తిరిగి దణ్ణంపెట్టి పడమరగా తిరిగి అడుగు పెట్టడమే"
     "ప్చ్" అంటూ తల యెగరవేసుకున్నాడు శంకరప్ప.
     దాంతో అతిక్రుద్ధుడయిపోయి "ఏయ్ జవాన్లు" అని దురుసుగా పిలిచాడు దివాన్జీ.
     ఎప్పు డెప్పు డని కనిపెట్టుకుని వున్న ఠాణేదారు పొడిచి తొందరపెట్టగా, జవాన్లు వెంటనే వూచల్లాగ మీద పడి,
శంకరప్పని వీధిలో యెత్తి కుదేశారు.
     ఇదంతా అయినతర్వాత, తాను  దివాన్జీకి కనపడకుండా వుండే టట్టు చూసుకుని శంకరప్పకేసి వురిమిచూస్తూ, యెదురొ మ్మెగరవేసుకుంటూ మీసంమీద చెయ్యి వేసు కున్నాడు ఠాణేదారు.
     "ఏంజరిగింది నాయనా?" అని ఆత్రంగా అడిగింది పేదరాసి పెద్దమ్మ.
     "వ్యవహారం అంతా తల్లకిందు లయి పోయింది పెద్దమ్మా"అంటూ చతికిలబడ్డాడు శంకరప్ప.  బసకి వచ్చాడు; కాని యెలా రాగలిగిందీ అత నెరగడు.  ఈమాట చెప్పాడు, అయితే యేమి మాట్టాడిందీ అతనికి గుర్తులేదు. మాట ముగిస్తూ తల రెండుకాళ్ళమీదకీ వాల్చుకున్నాడు.  నిట్టూరుస్తూ రెండు చేతులూ తలకి చుట్ట వేసుకున్నాడు.
     నిరాశా, వుడుకుమోత్తనమూ, దు---ఖమూ అతనిశరీరంలో ప్రతీఅణుమాత్రభాగంలోనూ నిండి చిప్పిలి పోతూవున్నాయి.
     ఇదంతా చూశాటప్పటికి పెద్దమ్మ హృదయంలో స్తబ్ధమయిపోయి వుండిన మాతృత్వం అంతా వొక్కమాటుగా
జాగృతం అయిపోయింది. దాంతో ఆమె కడుపు తరుక్కుపోయింది.  వెంటనే తానున్నూ చతికిలబడి, వొకచేత్తో వీపు
నిమురుతూ, రెండోచేత్తో చేతులు తప్పించి అతని మొగం తన బుజంమీదికి తీసుకుని "ఏంనాయనా?  ఏంతండ్రీ?" అంటూ అతణ్ణి దగ్గిరగా తీసుకుంది.
     ఇది అతనిలో శైశవమౌగ్ధ్యం అంకితం చేసింది.  ముప్ఫయ్యేళ్ళ శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయాడు.
ఒక్కక్షణం --- వొక్కటేక్షణం దుర్దమం అయిన ప్రాపంచికవృత్తం అంతా మరిచిపోయి మళ్ళీ నిర్వికారావస్థ అనుభ
వించాడతను.
     తరవాత ఆమె గుచ్చిగుచ్చీ, వొత్తి వొత్తీ అడిగింది.  అతను ఆదినుంచీ ప్రతి అక్షరమూ వివరంగా చెప్పాడు.
     ఈచెప్పడంవల్లనే అతనుకొంత తేలికపడ్డాడు.  పెద్దమ్మ ప్రశ్నల ధోరణివల్ల పూర్తిగా మామూలు మనిషే అయి
పోయాడు.
     "అప్పుడామె ముందుమాట యే మాలోచించావు నాయనా?" అని లాలిస్తూ అడిగింది.
     "మహారాజుతో యెలాగయినా వొక్క ఆట---"
     "స్స్! ముందుమాట అడుగుతున్నాను నేను"
     "నా కర్థం కాలేదు"
     "మరి దివాన్జీతో దురుసుగా యెందుకు మాట్లాడావూ?"
     "ఆ పెద్దమనిషి మొదటే హేళనలోకి దిగాడు.  అది వరకే ఠాణేదారు, జవాన్లచేత గెంటించడం నన్ను రెచ్చకొట్టి
వుంది.  సరే, ఠాణేదారు తన యింటిదగ్గర ఆడిన మాటలు నా ప్రవృత్తినే మార్చేసి వుంచాయి"
     "ఈ వుద్యోగస్థులు తమ తాహ తేమిటో, తమ బతుకెలాంటిదో తెలుసుకు మసులుకోరు"
     "పొగరు మోత్తనం కాకపోతే, నన్నింత అవమాన పరచవలసిన అగత్యం యేమిటి చెప్పు"
     "నీమాట అలా వుంచు.  చదరంగం ఆడగలవాడు దొరక్క మహారాజు మతిపోయి వున్నాడు"
     "అంతవరకూ వచ్చింది చూశావా?"
     "దివాన్జీకి అది తెలుసు.  తల యిచ్చెయ్యడానికిక్కూడా సిద్ధపడి నువ్వు వచ్చినపుడు మూర్ఖుడు కాకపోతే ఈదివాన్జీ---"
     "మూర్ఖుడే కాదు, మూఢుడు కూడాను"
     "అబ్బ!... చివరికి ఫలం?"
     "నాప్రజ్ఞ---"
     "దిబ్బా దిరుగుండమూనూ"
     అంత జాలిలోనూ ఆమె యిలా విసుక్కుంది.
     "విద్వాంసుల మంటూ వచ్చేవాళ్ళని చాలామందిని చూశాను;  కాని అందరూ యిలాగే లౌక్యం సుతరామూ
లేక, యింగితజ్ఞానం అసలే లేక---"
     "అసలే మతిపోయి వున్నాను.  నువ్వు పుండుమీద కారంచల్లుతావా పెద్దమ్మా?"
     ఇలా అంటూ అత నామె రెండుచేతులూ పట్టుకున్నాడు.దాంతో మనస్సుకరిగి ఆమె ధోరణి మార్చింది.
     "అయితే, మరి విను.  దివాన్జీ తలబిరుసుతనంవల్ల మహారాజుకి తగినవాడితో ఆడే యోగం తప్పిపోయింది"
     "అక్షరాలానూ"
     "పిచికిమీద బ్రహ్మాస్త్రంవేసి మహా కులుకుతున్నాడు;గాని దివాన్జీ చేసింది స్వామిద్రోహం"
     "ఈసంగతి మహారాజుకి తెలిస్తే బాగుండును"
     "అన్నావూ?  అయితే అది నీ చేవను బట్టి వుంటుంది"
     శంకరప్ప వులిక్కిపడి "అంటే?" అన్నాడు.
     "అంటే ఏముందీ  ఇప్పటిదాకా రాజదర్శనానికి నువ్వు తిప్పలుపడ్డావు.  ఇక నీదర్శనంకోసం రాజే తిప్పలుపడాలి"
     "సెబాస్!  ఎంత మంచిమాటా! అది అలా జరిగితే యెంత దర్జాగా వుంటుందీ?"
     శంకరప్ప మనస్సేమో వురకలే వేసింది;  కాని "తొందరపడకు" అని బుద్ధి నిలేసింది.  పరాభవఖిన్న మయిపోయి వుండడంవల్ల ఆ బుద్ధి కింకా నైశిత్యం అలవడి వుండలేదు.
     "ఎప్పుడయినా అది సంభవిస్తుందా?" అని సందేహించాడతను.
     "చెప్పాను కాదూ?  అది నీ చేవను బట్టి వుంటుంది"
     "తూర్పూ పడమరా నాకేమీ బోధపడ్డంలేదు.  అంత యోగమే పడితే ఆటలో మహారాజుని కియిక్కు మనిపించడంతప్ప నావల్ల మరేమీ కాదు.  నీళ్ళముంచినా పాల ముంచినా---పెద్దమ్మా, నేను నీ కొడుకుని"
     ఇలా అంటూ అత నామె పాదాలు పట్టుకున్నాడు.
     ఆచేతులు దూరంగా తీసేస్తూ, తన పాదాలు ముడుచుకుంటూ "ఇంత వెర్రిబాగుల నాయనవు, చదరంగంలో నీకంతనేర్పెలా వచ్చిందోయ్?" అంటూ జాలిపడింది పెద్దమ్మ.
     ఆమెకళ్ళు ఆనందబష్పాలతో దొప్పదోగిపోయాయి.
     "దాని కంతకీ కారణం యీశ్వరానుగ్రహం. అయినా నాప్రజ్ఞకంతకూ నీఅనుగ్రహమే ఆధారం"
     ఒక్కమాటు పైకిచూసి "పెద్దాపురప్పట్నం అంతాయెప్పుడైనా చూశావా?" అని అడిగింది పెద్దమ్మ.
     "లేదు.  నీయల్లూ ఠాణేదారు కొంపా, దివాన్జీ లోగిలీ తప్ప నేను మరేమీ యెరగను"
     "అయితే విసుపులేకుండా ముందు పట్నంఅంతా తిరుగు"
     "తిరిగి?"
     "పెద్దమనిషి ననుకునే ప్రతివాడి యింటోనూ దశావతారీ ఆటో, చదరంగపెత్తులో నడుస్తూనే వుంటాయి"
     "ఆఁ, అదా?  బోధపడుతోంది"
     "చాలామంది వేశ్యలున్నూ వాటిల్లో నిధులున్నారు"
     "బాగుంది"
     "నీకు పిలుపు అక్కర్లేదు.  ఆటకి అడ్డుపడు"
     "అడ్డుపడడంతో కుదురుతుందా?  శంకరప్ప ఉన్నంత కాలమూ యీవూళ్ళో యెలాంటివాళ్ళూ కూడా చదరంగం
అంటే హడలిపోతూ వుండవలసిందే"
     ఈమాట చాలా దృఢంగా అన్నా డతను.  పోంగిపోతూ అన్నాడు.  గర్వంతో అన్నాడు.  టొకాయిస్తూ అన్నాడు.
     "ఇంకేం?  నీవల్ల అంతపని జరిగితే, యిక నీకు అసాధ్యం అంటే యేమి వుంటుంది?  మర్నాడే యీసంగతి రాజుకి---"
     "వొక్ఖదెబ్బని" అంటూ యెగిసిపడి కూచున్నా డతను.
     "మొదట, నిన్ను గెంటించిన ఠాణేదారే వస్తాడు.  నువ్వు వెళ్ళకపోతే దివాన్జీ వస్తాడు.  అక్కడికీ నువ్వులొంగక
పోతే తరవాత రాజే మన యింటికి స్వయంగా వస్తాడు"
     "మనయింటి" కన్నమాట శంకరప్పకి వెనకాల యెంతో బలగం వున్నదన్నంత దిటవు కలిగించింది. "రాజే మనయింటికి  స్వయంగా వస్తా" డనేమాట అతన్ని చక్రవర్తిని చేసేసింది.
     "సెబాస్" అంటూ గభీమని లేచి నుంచున్నాడతను.
     పెద్దమ్మ కూడా లేచి "యిప్పు డెక్కడికీ?" అంటూ చెయ్యి పట్టుకుంది.
     "పట్నంలోకి"
     "వోక్కక్షణం వోపిక పట్టు, వంట అయి---"
     "తొందర లేదు.  నా కిప్పు డాకలీ దప్పికా యేమీ తెలవడం లేదు.  ఒక్కణ్ణనా కాళ్ళమీద పడేటట్టు చేసుకుంటే
గాని నాకు నోటికి ముద్దపోదు.  క్షణం, ఎంతోసేపా?"
     వాకట్లోనుంచి గుమ్మంలోకి వొక్కటే వురక.  అక్కణ్ణుంచి వీధిలోకి వొక్కటే అంగ.
     ఎడాపెడా చూసుకుంటూ శంకరప్ప సందు మళ్ళాటప్పటి కొక పెద్ద భవంతి కనబడింది.  మండువా వాకట్లోనుంచి చదరంగానికి సంబంధిచిన ఘర్షణకూడా వినవచ్చింది.
     పెద్దాపురం ప్రవేశించాక, యీ రెండురోజుల్లోనూ అతనికిదే చదరంగవ్యావృత్తి.  అంచేత ఆఘర్షణ వినేటప్పటి కతనికి తొందర పుట్టింది.
     లేడిపిల్లమీదకి పెద్దపులిలాగ వొక్క దూకుదూకాడు.
     లోపల యిద్దరు బ్రాహ్మణయువకులు చదరంగం ఆడుతున్నారు.  వారి కిద్దరికీ చెరో సలహాదారూ దగ్గిరగా కూచునివున్నారు.  కాని వారిలో యెవరూ శంకరప్పని కూచోమనలేదు.  పలకరించనూ లేదు.  చూడనే లేదు.
     అతనుకూడా వారిని పలకరించలేదు.
     ఒక్కమాటు నలుగురి మొగాలూ చూశాడు.  ఒక్క మాటు బలమున్నూ చూశాడు.  తరవాత అతికష్టంమీద
మనస్సు బిగపట్టుకుంటూ, స్తంభాని కానుకు నుంచున్నాడు.అరగడియ గడిచింది; కాని యెత్తు పడలేదు.
     బలం అంతా అతిసూక్ష్మంగా పరిశీలించడం, ఏదో,యెత్తు తోచి గభీమని చెయ్యిచాపడం, అంతట్లో యెదటి
బలంలో యేదో జంతువు ప్రతికూలంగా కనబడి, నరాలుకుంగిపోగా, చెయ్యివెనక్కి తీసేసుకోడం, తరవాత ఆవేగం
మళ్ళించుకోలేక కూనిరాగం తీస్తూ వూగిసలాడడం, లేకపోతే ఛా అంటూ అట్ట తేలేటట్టు తొడ చరుచుకోడం, అదీ 
కాకపోతే, వెనకటి యెత్తుల్లోవొకటి తప్పుగా పడి విషమించిందని పశ్చాత్తాప పడడం యెత్తు వెయ్యవలసిన యువకు
లీస్థితిలో వున్నారు.
     ఎదరిబలంలోవున్న లోటుపాట్లన్నీ బాగా కనిపెడుతూవుండడం, ఎత్తువెయ్యడాని కెదటి ఆటకాడు చెయ్యిచాపినప్పుడల్లా గుండెలు పీచు పీచు మనిపించుకోడం, ఉన్నగోడు కూడా చెడుతుందని వాళ్ళు యెత్తు మానుక్కూచుంటే, పెదవులు విరవడం --- కనుబొమ్మ లెగరవెయ్యడం --- వోరచూపులు చూసుకోవడం, ప్రతిపక్షు లీస్థితిలో వున్నారు.  ఇంకొక అరగడియ గడిచింది.
     శంకరప్ప విసిగిపోయాడు.
     "ఏమండీ యెత్తువెయ్యరేం?" అని సరసంగానే అడిగాడతను; కాని ఆటకా డిది వినిపించుకోలేదు.  సలహాదారు
మాత్రం మొదట మిడుతూ మిడుతూ చూసి, తరవాత "నీ కెందుకయ్యా మాగొడవ?" అని కొంచెం విసుక్కున్నాడు.
     "మీగొడవ నాకెందుకూ? ఆట గొడవ అడుగుతున్నాను నేను.  ఎంతకీ యెత్తు పడదేం?" అని శంకరప్ప మళ్ళీ అడిగాడు.  ఈమాటు అతను బుద్ధిపూర్వకంగానే కొంచెం పెంకితనం కనపరిచాడు.
     సలహాదారా పెంకితనం గమనించకపోలేదు. అయితే, అతని తల యింకా బిరుసెక్కి పోలేదు.  నిజానికత నింకా
సాధకావస్థలోనే వున్నాడు.  పైగా, ఇందాకా వేషాన్నిబట్టి బికారిగా కనపడ్డ శంకరప్ప, ముఖవర్చస్సును బట్టి
యిప్పుడు అసాధ్యుడుగా కనిపించాడు.  అదేదో చూడాలనిఆపేక్ష కలిగిం దతనికి.  దాంతో ఆ నిర్లక్ష్యం పోయింది.
     "నాలుగ్ఘళ్ళ పొద్దెక్కేటప్పటికి ఆట యీస్థితికి వచ్చింది.ఎత్తు వేశామంటే, మాఆట పైసలా, సరియైన యెత్తు తోచక
మేమూరుకోగా తమకి వంతురాక మావాళ్ళూరుకున్నారు" అని వెంటనే సాదరంగా చెప్పాడతను.
     "ఇంతమంది --- యింతసేపు --- ఏమండీ, యిందులో యేం వుందీ?" అని నిస్సాకారంగా అడిగాడు శంకరప్ప.
ఆటకాడి కిది కొట్టినంత పని చేసింది.  వెంటనే బుస్సుమంటూ కోడెతాచు పడగ యెత్తేటట్టు మొగం పైకెత్తి
     "చదరంగం అంటే యేమిటో నీ కేమయినా తెలుసా?"అని దురుసుగా అడిగాడతను.
     "దొరికా" మనుకున్నాడు శంకరప్ప.
     ఆటకాడి మొగంమీద చక్కని వర్చస్సు కనపడింది శంకరప్పకి.  "సత్తావుంది; కాని సంస్కారం చాలదు.  చికిలీ
చేస్తే, చంద్రహాసం అవుతాడు.  ఇతగాణ్ణి భృత్యుణ్ణి చేసుకు తీరాలి" అని అతను నిశ్చయించుకున్నాడు.  దాంతో, అతణ్ణి రెచ్చకొట్టి తనకి అవకాశం కలిగించుకోదలచి "నాకూతెలుసు.  ఆమాటకి వస్తే నాకే తెలుసు" అని వొత్తిచెప్పాడు.
     ఆటకాడు గతుక్కుమన్నాడు. 
     శంకరప్ప అది కనిపెట్టి "అలాచూస్తే యేమవుతుందీ? వారి ఆట నేను కట్టేస్తాను మీరు తప్పుకోండి.  లేకపోతే
మీచేత కట్టిస్తాను నేను చెప్పినట్టెత్తు వెయ్యండి.  చేత నయితే, మీ యిష్టంవచ్చిన పరీక్ష చేసుకోవచ్చు, నేను సిద్ధం" అని టొకాయించాడు.
ఆవేషంచూసి ఆటకాడు మొగం మళ్ళించుకున్నాడు; గాని తన సలహాదారు వుబలాటం గుర్తించి "యీ పిడుగు
వీడిమీద పడిపోనీ" అని నిశ్చయించుకున్నాడు. 
     ప్రతిపక్షి, వయస్సుకీ అనుభవానికీ కూడా ఆ నలుగురిలోనూ పెద్ద.  ఒకపాటి ఆటకాడు కూడానూ.  "జన్మాని కల్లా శివరాత్రి" అన్నట్టు గతసంవత్సరం, యెవరూ దొరకని సమయంలో మహారాజుతో వొకనాడు రెండాటలు వేసివున్నాడతను.  తన కారులో అలాంటి అదృష్టం పట్టినవాడు తానొక్కడే కావడంవల్ల, చదరంగం బల్లదగ్గిరికి వచ్చాటప్పుడు చాలా బిర్రుగా వుంటూ వుంటాడు.  మహారాజులుంగారి నడకగూడా కొంచెం కనపరుస్తాడు.  ఆట ప్రారంభం అయినాక అంగన్యాస కరన్యాసాలు కూడా వింతగా చేస్తూవుంటాడు.
     మాటధోరణిలో వున్న పెంకితనం చూడగా శంకరప్పఆట చూడాలని అతనికీ సరదాగానే వుంది;  కాని "గోచిపాతరాయుణ్ణి మనతో సమానంగా కూచోనివ్వడమా!" అని అభిజాత్యం తోచింది.
     ఆటగాళ్ళందరూ మొగ మొగాలు చూసుకున్నారు.
     "ఏమంటావోయ్?"
     "ఈయెత్తు కానివ్వరాదుటోయ్!"
     "మనిషి మారేటప్పు డిది కొత్త ఆటే అనుకోవచ్చు కాదుటోయ్!"
     "ఇంతవరకూ వచ్చాక మనిషి మారడం యేమిటి కావలిస్తే సలహా పుచ్చుకోవోయ్"
     ఉత్సాహాతిరేకంవల్ల, ఆటకాడు "సలహా పుచ్చుకో" అన్నమాట ఆంతర్యం గ్రహించలేదు.  దీనికి సాయం, సలహా
దారు, తాను జరిగి "అలా జరుగు" అని కూడా అన్నాడు. అంచేత "మరి కూచోవయ్యా" అని జరుగుతూ శంకరప్పని
పిలిచా డతను.
     కాని శంకరప్ప కూచోలేదు.  స్తంభం కూడా విడిచిపెట్టలేదు.  ప్రతిపక్షి వుద్దేశం అతను గ్రహించేశాడు.  దాంతో
"నాతాహతూ నీ తాహతూ చూద్దువుగాని" అని మనస్సులో అనుకుని "మీరు లేవనక్కర్లేదు.  లేవనేవద్దు.  నేనిలా
నుంచునే వుంటాను.  మీ సరసని కూచోడానికి నేనెంతవాణ్ణీ?" అన్నాడు మెల్లిగా.
     ప్రతిపక్షి తృప్తిపడ్డాడు.
     "అయితే సలహా చెప్పు" అని బల్లకేసి తిరిగా డాటగాడు.
     "ఎన్ని యెత్తుల్లో ఆట కట్ట మంటారు?"
     "సొరకాయలు నరుకుతున్నావే!"
     ఆట కా డిలా అంటూ చాలా హేళన కనపరిచాడు;  కాని, సమయం గుర్తించి శంకరప్ప దాన్నిలెక్ఖచెయ్యలేదు.
     "నరకడాని కంత తేలికయిన వస్తువు మరేదీ లేదనితరవాత మీకే తెలుస్తుంది,  యెత్తులమాట చెప్పండి ముందు"
     "అయితే నువ్వే చెప్పు"  
     "అయితే వినండి --- ముందు నేనో యెత్తు వేస్తాను, అంటే చెబుతాను.  తరవాత వారువేస్తారు.  మళ్ళీ నే నింకో యెత్తు చెబుతాను"
     ప్రతిపక్షి వులుకూ పులుకూ చూశాడు.  ఆటకాడు "కోతలు" అనుకుంటూ చూశాడు.  ఆటకాడి సలహాదారు
     "తరవాతా?" అన్నాడు.
     "బలం కలిపివెయ్యడమే"
     ప్రతిపక్షి వురిమిచూశాడు.  ఆటకాడు "మరికానియ్యి" అని చెయ్యిచాపాడు.  సలహాదార్లిద్దరూ చకితు లయినారు.
     "మీ నల్లగదిశకటు వారి గుర్రంముందు వెయ్యండి" అన్నాడు శంకరప్ప.
     "ఓస్" అనిపించింది ఆటకాడికి.  ఈ యెత్తు అతని కిదివరకి పదిమార్లు తోచింది.  సలహాదారుకి తొమ్మిది మాట్లయినా తోచింది;  కాని ధైర్యమూ, సాహసమూ కూడా కలక్క వా రూరుకున్నారు.  ఈయెత్తే శంకరప్ప చెప్పడంతో వారికి విశేషం కనపడలేదు;  కాని అతను మూడెత్తులతో ఆఖ రంటున్నాడు.  ఇది తలచుకుని "వే - శా - ను" అంటూ చెప్పినట్టు చేశాడు ఆటకాడు. 
     ప్రతిపక్షి కీ యెత్తులో యేదో కిటుకుందని తోచింది.  ఆటకాడే స్వయంగా యిది వేసి వుంటే, చూపుల్లో అధమం
రెండుమూడు రసాలయినా వొప్పించివుండు నతడు.
     ఇప్పుడతని కెత్తు తోచలేదు.
     ఇప్పటిదాకా అత నుపయోగించిన నిర్లక్ష్యభావం అంతా యిప్పుడాటకాడికి సంక్రమించింది.  దాల్లో కొంత 
వొడిసి కొట్టేసి "చూస్తావేమిటోయ్?" అంటూ నిలవదీసి అడిగాడు సలహాదారు.
     "ఆలోచించుకో నియ్యవోయ్! ఇదంతా మీప్రజ్ఞే అన్నట్టెగిసిపడుతున్నా వేమిటి!"
     "తొందరపడకు కావలసినంత సే పాలోచించుకో.  బాగా నిదానించి మరీ యెత్తువెయ్యి" అన్నా డాటకాడు.
     "వోస్! ఏమి ఔదార్యంరా? ... అయితే, మరి, గుర్రం యిక్కడవే - శాను"
     "ఆబంటుతో మీరు తోసిరా జనండీ"
     "తోసి రాజు రా"
     "ఆట కట్టు అని కూడా ---"
     "ఆట క - ట్టురా"
     "ఆటకాడు సందేహిస్తూ అనగా "జంకెందుకోయ్?" అని గదిమాడు సలహాదారు.
     ఆటకాడు "భేష్" అన్నట్టుమాత్రం చూడగా సలహాదారు పొంగిపోయి "యేవూరు మహానుభావా మీదీ?" అంటూ 
గభీమని లేచి శంకరప్ప చేతులు పట్టుకున్నాడు. 
     శంకరప్పకి, చెవిలో "వొకడు" అని వినిపించినట్టయింది.
     "నన్ను చూశారా?  నావేషం కనపడుతోందా? పొట్ట చేత్తోపుచ్చుకు వచ్చాను.  అన్నివూళ్ళూ నావే?"
     "పేరు?"
     "తంగిరాల శంకరప్ప"
     ఆటకాడి మనస్సు గుబగుబ లాడిపోయింది
     ఉత్సాహం అణుచుకోలేక "ఏమిరా ఆట కట్టిందని వొప్పుకుంటావా యెత్తు వేస్తావా?' అని దురుసుగా అడిగాడతను.
     "చే --- బ్తా .... ఈగుర్రంతో యీబంటు ---"
     "తెరిచి రాజవుతుందోయ్"
     "అయితే, రాజు నిక్కడ వేశాను"
     ఇలా అంటూ యెత్తువేసి, ప్రత్యర్థి "నీకు దిక్కున్నచోట చెప్పుకో" అన్నట్టు చూడగా ఆటకాడు తెల్లపోయి శంకరప్ప కేసి చూశాడు.
     "ఏం, మూడెత్తుల్లో కట్టలేక పోయాననా అలా చూస్తున్నారు? తప్పే, అపరాధిని క్షమించండి, ఏంచెయ్యనూ మరీ?
ఇంకొక్కయెత్తు --- ఎర్రగది శక టుందే మీది, దాంతో వారి రాజుని ---"
   సగంలో అందుకుని "వోరి, శకటింటో వేశావురా రాజునీ" అని సలహాదారు సింహనాదం చేశాడు.
     "అరే, అరే" అంటూ ఆటకాడు ఆశ్ఛర్యపడ్డాడు.
     ప్రతిపక్షి ముందు నాలుక కరుచుకున్నాడు.  తరవాత తన రాజుని తేసి చేత్తో పట్టు కున్నాడు.  ఎక్కడ వేదామన్నాస్థలం కనపడలేదతనికి.
మతి పోయింది.  చివరికి "హూ" అంటూ బలం అంతా కలిపేసి కాళ్ళు చాపేసి రెండు తొడలూ గోక్కుంటూ గోడకి
చేరబడి పోయాడు.
     ఆటకాడు వుబ్బెత్తుగా లేచి, గభీమని శంకరప్పను కౌగిలించుకుని "మహానుభావా! ఎవరో సామాన్యులని మిమ్మల్నిహేళన చేశాను.  ఏకవచన ప్రయోగమున్నూ చేశాను.  అపరాధిని.  నన్ను క్షమించా" లని బతిమాలాడు.
     అందుకు శంకరప్ప మీరేమీ కిచపడనక్కర్లేదు.  మొదట మీరనుకున్న ట్టిప్పటికీ నేను సామాన్యుణ్ణే.  ఇక 
యేక వచన ప్రయోగమా?  ఈస్థితిలో నాకు అదికూడా గౌరవాస్పదమే.  చిన్నమ్మ కొడుకులు మీరు.  ఎవరి 
నేమనడానికయినా అర్హులు.  నన్ను మీరు "నువ్వన్నందుకు నాకే విచారం లేనప్పు డిక మీకెందుకూ?" అంటూ
తేల్చేశాడు.
     "అయ్యా యీపూట మీరు భోజనానికి మాయింటికి దయచెయ్యాలి" అని ఆహ్వానించాడు సలహాదారు.
     "అలా కాదు.  ఈపూట మాయింటికీ, రాత్రి మీ యింటికీ వస్తారు" అని సలహాదారుకీ సద్దిచెప్పి "మరి దయచెయ్యండి" అని శంకరప్ప చెయ్యి పట్టుకున్నాడు ఆటకాడు.
     శంకరప్ప ముందు చెయ్యి విడిపించు కున్నాడు.
     "మహానుభావా! మీరుభయులూ నన్ను క్షమించాలి.  మీ అనుగ్రహానికి చాలా సంతోషం.  నేనింతలో యీవూరు
విడిచివెళ్ళను.  ఎన్నేసి పూటలు మీ యిళ్ళల్లో భోజనం చెయ్యాలో అప్పుడే అయిందా?  ఇప్పటికి నన్ను 
విడిచిపెట్టండి.  కారణం తరవాత మనవి చేసుకుంటాను"
     "మీ బస యెక్కడ?"
     "పెద్దమ్మ యింట్లో"
     "భోజనం చెయ్యగానే దయచెయ్యగలరా?"
     "వల్లకాదంటే భోజనమే మానెయ్యగలను"
     "అక్కర్లే దక్కర్లేదు.  ఇతట్లో మేముకూడా భోజనం చేసి వస్తాము.  మిమ్మల్నొకచోటికి తీసుకువెడతాం.  మీరు 
వారితో --- ఇప్పుడెందుకు లెండి, తరవాత మాట్టాడుకుందాం.  పెద్దమ్మ యింటి వెనకాలే మాయిల్లు పదండి"
     ముగ్గురూ బయలుదేరారు.
     రామశాస్త్రీ, యాజులూ వెంటరావడం చూసి పెద్దమ్మ "అప్పుడే పిట్టల్ని కొట్టినట్టున్నాడు నాయన" అనుకుంది.
     ఆమాటా ఈమాటా చెబుతూ వొక్కక్షణం కూచుని "భోజనం కాగానే వచ్చేస్తాం" అంటూ శాస్త్రీ, యాజులూ  వెళ్ళి పోయారు.
జరిగిందంతావిని "యిదీ పద్ధతి" అని మెచ్చుకుంటూ దగ్గిర కూచుని కబుర్లు చెబుతూ శంకరప్పకి సుష్టుగా భోజనం
పెట్టించిది పెద్దమ్మ.
     "ఇదిగో, భీమసేనరావుగారే.  ఎప్పడు దయచేశా రేమిటి వూళ్ళోకి?"
     "కాస్సేపు మాట్లాడకండి,  శాస్తుల్లుగారూ!  నా ఆట కట్టితీరతానని వొట్టు పెట్టుకున్నారు పంతులుగారు"
     "ఎప్పుడు వేశా రండియెత్తు?"
     "పొద్దున్న"
     తమరేనా?
     "అవును"
     "చిత్తం అంటూ  శాస్త్రి రాజు దగ్గిరగా కూచుంటూ తన ముందు కూచో మని చోటు చూపించాడు:  కాని శంకరప్ప
కూచోలేదు.  అదిచూసి యాజులుకూడా నుంచునే వుండి పోయాడు"
     ముగ్గురూ బలం పరిశీలించారు.
     శాస్త్రీ, శంకరప్పా చిరునవ్వు నవ్వుకున్నారు.
     అరగడియ గడిచినా చలనం లేకపోవడం చూసి, కళ్ళతో పొడిచి యాజులు రెచ్చగొట్టగా,  శాస్త్రి "పంతులుగారూ" అంటూ అందుకున్నాడు.
     "కోపంవచ్చినా సరే నామనవి చిత్తగించాలి తమరు"
     "ఒక్కక్షణం తమ రూరుకోగూడదూ?"
     "ఊరుకోనేవచ్చు.  ఊరుకో లేకా కాదు.  ఆట కట్టించుకున్నా కట్టినా వేంకటపతిరాజుగారితో యెత్తువెయ్యగలవారు మన జట్టులో తమరొక్కరే;  కాని యిలా చూడండీ,  వీరు - తంగిరాల శంకరప్పగారులెండి వీరి పేరు.  వీరి నొక్కయెత్తు వెయ్యనివ్వండి.  లేకపోతే తమరే వేయించండి వీరి సలహా పుచ్చుకుని"
     "అయ్యా, దయచెయ్యండి" అంటూ శంకరప్పకు తహజీమిచ్చాడు రాజు.
     "చిత్తం.  చిత్తం నుంచునివుంటే బలం బాగా కనబడుతోంది సెలవిప్పించండి" అని సవినయంగా కోరాడు శంకరప్ప.
     రాజు "తమ చిత్తం" అనగా శాస్త్రికూడా చెప్పాడు కాని శంకరప్ప కూచోలేదు.
     "అంత సమర్థులా వారు?... అనడిగాడు పంతులు.
     "సందేహ మేం  మూడంత్తుల్లో ఆట కట్టేస్తారు"
     "అబ్బా ఏవూరయ్యా మీదీ?"
     పంతులు ప్రశ్నలో అహమికా, తేలిక భావమూ వుండడం గుర్తించి,  "మా బ్రహ్మిగాళ్ళకి నోరు సరిగా తిరగదు చిత్తగించారా?" అన్నట్టు మొదట రాజుకేసి చిరునవ్వు నవ్వుతూ చూసి "చిత్తం చిత్తం, నాకేవూరూ లేదండి.  చెట్టుమీది పక్షిని" అని చివరికి పంతులుకి బదులు చెప్పాడు శంకరప్ప.
     "పక్షులు చదరంగం ఆడతాయా?"
     "ఏమి ఆడకా? ఆహార నిద్రాభయమైధునాది - చిత్తగించారూ? పక్షులు మనుష్యులు చేసే పనులన్నీ చేస్తాయి.  అయితే, యెత్తు వెయ్యడానికి మాత్రం పూటలికి పూటలు రోజులకి రోజులూ గడిపెయ్యవు"
     ఈ మర్మాఘాతానికి వ్యగ్రు డయిపోయి "అలాగేం? అయితే యేదీ కాయ కదుపూ చూద్దాం" అంటూ మూతి బిడాయించుకుని పక్కకి వొత్తిగిల్లాడు పంతులు.
     "నన్ను పరీక్ష చెయ్యాలని వుంటే నువ్వు తప్పుకుంటే యేమవుతుందీ?"
     "మరేం చెయ్యాలీ?"
     "అలాకూచుని రాజుగారికి సలహాచెప్పాలి.  లేకపోతే వారిని తప్పుకో మని నువ్వే ఆడాలి"
     "పాండిత్యం వొలికించేస్తున్నావే! ఏదీ మరి కానియ్యి"
     ఉభయల మర్యాదాతిక్రమణమూ గుర్తించి రాజూ, శాస్త్రీ చాలా ఆందోళన పడ్డారు కాని యింకా ముదిరితే అప్పుడు చూసుకో వచ్చునని వూరుకున్నారు.
     పంతులు రాజు పక్కకి వెళ్ళాడు.  పంతులు స్థానంలో యాజుల్ని కూచోబెట్టాడు శంకరప్ప.
     శాస్త్రీ, యాజులూ పైకి బింకంగానే వున్నారు;  కాని యింతా చేసి చివరకి శంకరప్ప వోడిపోతాడేమో అని బిట బిటలాడి పోసాగారు.
     అప్పుడు "సెలవా?" అంటూ ముందు రాజు అనుజ్ఞ పుచ్చుకుని, తరవాత "మన రాజుని వొక్కగది వెనక్కి తప్పించండి" అని యాజుల్ని ఆజ్ఞాపించాడు శంకరప్ప.
     వెంటనే "తమరు తోసిరాజనండి రాజుగారూ!" అని పంతులు పురమాయించాడు.
     "మనరాజుని ఆబంటుకడ్డువెయ్యండి యాజులుగారూ!"
     పంతులుకూడా యిలాగే ఆజ్ఞాపించాడు కాని రాజందుకంగీకరించలేదు.
     ఇద్దరికీ చర్చ ప్రారంభమయింది.  "ముందు మనరాజు వునికిగట్టిచెసుకోవా" లంటాడు రాజు.  "ఎదటివారికి గుక్కతిరక్కుండా మళ్ళీమళ్ళీరా" జనా లంటాడు పంతులు.
     ఇద్దరూ వొక్కనిమిషం ఆలోచించారు.  అప్పుడుకూడా పంతు లామాటే అన్నాడు.  "అయితే, యీ ఆటతో నాకు సంబంధంలేదు, మీరు కానివ్వండి" అని రాజు తప్పుకున్నాడు.
     వెంటనే ద్విగుణితోత్సాహంతో "తెరచి రాజు" అన్నాడు పంతులు, పక్కకి జరిగి.
     "మన నల్లశకటు అడ్డుపడెయ్యండి" అన్నాడు శంకరప్ప.
     "నేను మీశకటుని కొట్టేశాను."
     "మీరేం చేస్తారు యాజులుగారూ?"
     "నేను వారి రాజుని కొట్టేశాను."
     పంతులు నాలుక తెగ్గరుచుకున్నాడు - చివరికి నోరు కుట్టేసుకున్నాడు.
     తరవాత శాస్త్రీ, యాజులూ బలవంతపెట్టగా, రాజు స్వయంగా శంకరప్పతో వొకఆట వేశాడు.  అది ముగిశాటప్పటికి చీకటిపడింది.  అయినా రాజే వోడిపోయాడు.  శంకరప్ప వెంటవెంటనే యెత్తు వేస్తూ రాగా, రాజు గడియా రెండు గడియలూ ఆలోచించిగాని యెత్తు వెయ్యలేకపోతూ వచ్చాడు.
     అందరూ లేచారు.
     "రేపొకమాటు దయచెయ్యండి" అని రాజు ఆహ్వానించగా "చిత్తం చిత్తం, తప్పకుండా దర్శనం చేసుకుంటా"      నంటూ శంకరప్ప సెలవు పుచ్చుకున్నాడు.
తరవాత రాజుతో లోగుమ్మందాకావెళ్ళి "యిదంతా తెలివే అంటారా తమరు?" అని అడిగాడు పంతులు.
     "కాకేమీ?"
     "ఎప్పటికీ కాదు"
     "ఎంచేతా?"
     "అలాగా.  ఉచ్చిష్ణగణపతి వుపాసనవుంది ఆబ్రాహ్మడికి"
     "తమ రెలా కనిపెట్టారూ?"
     "ఆవేషం చిత్తగించారా?"
     "సింగినాదం కాదూ?  మహారాజులుంగారి మనమెలా వుంటామో ఆలోచించారా?"
     బుర్ర వంచుకుని మెట్లు దిగి "మరి సెలవు" అని మెల్లిగా జారాడు పంతులు.
     "వేంకటపతి రాజుగారితోటే ఆడావా?  రెండాటలూ వారే వోడిపోయారా?  ఇంకేం?  మొదటే యీదారి తొక్కవలసిందోయి నాయనా!  ఆదిక్కుమాలిన ఠాణేదారెక్కడ దాపరించాడోయి నీప్రాణానికీ" అని శంకరప్ప వీపునిమురుతూ పెద్దమ్మ చాలా నొచ్చుకుని చాలా మెచ్చుకుంది.
     అది చూసి "ఠాణేదా రేమిటి శంకరప్పగారూ?" అన్నాడు శాస్త్రి.
     "ఆయన చదరంగం ఆడలేడే" అన్నాడు యాజులు.
     దీనిమీద "చెప్పనా మాననా?" అన్నట్టు శంకరప్ప తనకేసి చూడ్డంతోటే పెద్దమ్మ అందుకుని "అది వేరే గొడవ నాయనా! ఇప్పటిది కూడా కాదులెండి.  నా నాయనికి భోజనాని కాలస్యం అయిపోతుంది, యిప్పటికి మీరు వెళ్ళండి.  వెర్రితండ్రికి నిద్ర తక్కువయితే జబ్బుచేస్తుంది, మరి రాకండేం?" అని తొందరపెట్టి వారిని పంపేసి "నీళ్ళు కాగాయి పద స్నానం చెయ్యి.  వొసే, రామసోదెమ్మా! నీళ్ళు తొలపడం అయిందా, యింకా తరవాయేనా?" అని అడుగూతూ రెక్కపట్టుకుని శంకరప్పని నూతిపెరట్లోకి తీసుకెళ్ళింది.
     నాలుగ్ఘళ్ళ పొద్దెక్కింది.
     "మీకోసం చూస్తున్నా" నంటూ లేచి నుంచున్నాడు శంకరప్ప. 
     "రైతులు శిస్తులు తెచ్చారు.  లెక్కలు పరిష్కారం చేసుకుని వారిని పంపేశాటప్పటి కీవేళ అయింది.  మావాడుకూడా కొంచెం పని తగిలి పెందరాడే రాలేక పోయాడు.  ఇంతకీ మనం వెళ్ళవలసినచోట పొద్దు పొడిచాటప్పటికే ఆట మొదలయిందని కబురువచ్చింది, మరి బయలు దేరండి"  అంటూ శాస్త్రి కవాచీ బల్లమీద కూచున్నాడు.
     "సరే, వారిని బయలుదేర మంటూనే నువ్వు తిష్ఠవేస్తావేమిటోయ్" అని ముదలకించాడు యాజులు.
     ఒక్క నిమిషం సరాగాలు వెళ్ళిపోయాయి.
     దండెంమీద ఆరి వున్న అంగాస్త్రం తీసి కప్పుకుని శంకరప్ప అడుగు వేశాడు.
     "నా నాయన్ని పెందరాడే తీసుకురండి నాయనా! వేళతప్పి భోజనం చెయ్యడం మీకు మాత్రం మంచిదా?" అని అడుగూతూ వారిని కొంజా దాటించి వీధి అరుగుమీద చతికిలబడింది పెద్దమ్మ.
     వొకచోట, వొకబుగ్గమీసాల క్షత్రియుడొక తురకాయనతో చదరంగం ఆడుతూ "దయచెయ్యండి శాస్త్రులుగారూ!" అని పిలిచాడు.
మరో చోట ఒక తెలగా, ఒక వైశ్యుడూ, ఒక బ్రాహ్మడూ, దశావతారీ రంగుబూజు ఆడుతున్నారు.  వారిలో బ్రాహ్మడు "అది నారాయణం వేద్దాం రావోయ్" అని పిలిచాడు.

     ఇంకో చోట "మా భీమరాజు అసాధ్యపు యెత్తు వేశాడండోయ్! మీరు వస్తేగాని మాట తక్కేటట్టు లేదు.  సమయానికి దేవుడులాగ కనపడ్డారు, రావాలి, మరి తప్పదు" అని ఒక పంతులు కేకేశాడు.
     మరికొందరున్నూ పిలిచారు.  కాని  శాస్త్రి ఆగలేదు.  
     "చాలా తొందరపనిమీద వెడుతున్నానండి"  "ఇప్పుడుకాదోయ్"  "ఆపనిమీదే ఒకచోటికి వెడుతున్నాను.  ఇప్పుడు రాలేను.  మరోలాగ అనుకోకండేం?" అని వారికి చెబుతూ అతను ముందుకి సాగూతూ వచ్చాడు.
     వెళ్ళి వెళ్ళి వారొక బ్రాహ్మడి యింట్లో ప్రవేశించారు.
     అప్పటికప్పుడే అరవైయేళ్ళ ఆబ్రాహ్మడు ఒక రాచకుమారుడితో చదరంగం ఆడుతున్నాడు.
     ఆట చాలా బిర్రుగావుంది.  ఇద్దరూ ప్రాణాలు వొడ్డినంత కసిగా యెత్తులు వేస్తున్నారు.
     ఓమాత్రాన తేలేటట్టులేదు;  గాని క్షత్రియుడి ఆట కొంచెం లొగసానుగా మాత్రం వుంది.
     వీరు ముగ్గురూ చూస్తూ నుంచున్నారు.
      శాస్త్రీ, యాజులూ తమకి తామే కూచున్నారు;  గాని శంకరప్ప గోడకి చేరబడి నుంచునే వుండిపోయాడు.
     ఒక్క గడియ గడిచాక శంకరప్ప యిక వోపికపట్టలేక  శాస్త్రి కేసి చూశాడు.   శాస్త్రి రాజుకేసి తిరిగి యేదో అనబోయాడు;  కాని సరిగా ఈసమయంలో, ఆవృద్ధబ్రాహ్మడు అతి టెక్కుగా గోడకి చేరబడి "కృష్ణంరాజుగారూ! తమ యిష్టంవచ్చినవారి సలహాపుచ్చుకోండి, మరేమయినా చేసుకోండి.  ఈపూటమాత్రం తమరు సరిగా యెత్తు వెయ్యగలిగితే, నా గర్వపరిహారానికి తమ రెలాంటి శిక్ష విధించినా వొప్పుకుంటా" నంటూ మూతిబిగింసుకున్నాడు.
     వచ్చినవారిలో, యాజులు, సత్రకాయరకం అనీ,  శాస్త్రి ఆటకాడే అయినా తనయెదట కూచోడానికే జంకుతాడనీ అతనికి బాగా తెలుసు.  శంకరప్పని అతగా డిదివర కెప్పుడూ చూడలేదు.  కాకపోయినా, ఆవేషాన్నిబట్టి అతనొక మనిషిగానే తోచలేదు ముసలాడికి.
     అంచేతనే యీ బింకం అతనికి.
     ముసలాడు నిజంగా అసాధ్యుడు.  దూర్వాసుల ఆదివరాహమూర్తి అని అతని పేరు.  సరాసరీ మహారాజులుంగారితో చదరంగం ఆడే గ్రామస్థులు నలుగురైదుగురిలోనూ అతనొకడు.  
     వారిలో వయస్సుకీ, నేర్పుకీ కొంచెం పెద్దకూడానూ.
     అయితే, మూర్తి ఆట జన్మాని కొక్క మాటయినా కట్టాలని కృష్ణంరాజు కెన్నాళ్ళనుంచో వుబలాటం.  ఈమాట మీద "ఇవాళ కట్టితీరా" లని పట్టుదల కలిగిం దతనికి.
     కాని యేమీ పాలుపోలేదు.
     వచ్చినవారి సాయం పుచ్చుకుందామా అంటే  శాస్త్రీ, యాజులూ తనకే తీసికట్టు.
     అతని కళ్ళు అప్రయత్నంగా శంకరప్పకేసి మళ్ళాయి.
     "మనకెందుకూ?" అనుకుంటూనే "యేవూరు తమది?" అనేశా డతను.
     "మీరూరుకోండి" అన్నట్టు శంకరప్పకేసి చూసి "కృష్ణంరాజుగారూ! వూరూపేరూ అడగవద్దు,  వారిసలహా మాత్రంపుచ్చుకోండి.  తాతగారిని మూడోయెత్తు వెయ్యనివ్వరు వారు" అని  శాస్త్రి బదులుచెప్పాడు.
     అది విని మూర్తి వెటకారంగా చిరునవ్వు నవ్వి పైగా సకిలించాడు.  దాంతో రాజుకి పొడిచినంత పనయింది.
      శాస్త్రీ, యాజులూ కూడా కసిపెంచుకున్నారు.
     రాజు శంకరప్ప కేసిచూశాడు.  ఆచూపులో "సలహా చెప్పవలసిం" దన్న ప్రార్థన లేకపోలేదు;  కాని శంకరప్ప చూసీ చూడన ట్టూరుకున్నాడు.
     "అడగం" డన్నాడు మళ్ళీ  శాస్త్రి.  "సందేహించకండి రాజుగారూ" అని యాజులు కూడా చెప్పాడు.  రాజునోరారా అడక్కపోయినందు వల్లనే శంకరప్ప వూరుకున్నాడని వారు గ్రహించేశారు.
     ఈసలహాలు, యీతటపటాయింపులూ, యీబింకమూ చూసి "కాపరం కడతేరినట్టే" అన్నట్టువెకిలి చూపు చూశాడు మూర్తి.
     అది కృష్ణంరాజు గాయం రేపింది.
     "చూస్తారేమండీ?" అన్నట్టు వురుముతూ చూశారు శాస్త్రీ, యాజులూనూ.
     ఊరుకోక అదిచూసి మూర్తి శిర కంపం చేశాడు.
     "ఏమండీ, నాకు సలహా సెల విప్పిస్తారా?"
     "తప్పకుండా మనవి చేసుకుంటాను"
     "ఇలా దయచెయ్యండి"
     "వద్దువద్దు తమరు జరగనక్కర్లేదు"
     ఇలా అని శంకరప్ప, మొదట శాస్త్రి యాజులు గార్ల కేసి గంభీరంగా చూశాడు.  తరవాత మళ్ళీ వొకమాటు బలం చూశాడు. పిమ్మట "మీ కేమీ భయంలే" దన్నట్టు రాజుకేసి నిదానంగా చూశాడు.  చివరికి మొగం వంచుకుని దూరంగా వెళ్ళి కూచున్నాడు.
ఎలాచూసినా అక్కడికి బలమే కాదు, బల్లా కనపడదు.
     శాస్త్రికీ, యాజులికీ యిదేమీ అర్థం కాలేదు.
     మూర్తి బింకంగానే వున్నాడు;  కాని అతనికిన్నీ యిది బోధపడలేదు.  రాజు కనుబొమ్మలు ముడిపడ్డాయి.
     "ఏం, అలా వెళ్ళీ కూచున్నారేం" అనడిగా డతను.
     "దగ్గర కూచుని ఆడటానికి తాతగారి ఆటలో యేమంత పసవుందీ?  నేనిక్కణ్ణుంచే మనవి చేసుకుంటాను, తమరు యెత్తు వేయించండి" అన్నాడు శంకరప్ప.
     శాస్త్రీ, యాజులూ యిది మూర్తికి తగిన జవాబని సంతోషించారు.
     "ఇదేదో వుద్దండపిడుగులా వుంది" అనుకుని రాజు దిటవు తెచ్చుకున్నాడు.
     మూర్తి వారిపోకడ లన్నీ కీగంట చూసి, శంకరప్పకేసి గు - ర్ - రు మంటూ చూశాడు.
     ఒక్క నిమిషం యెవరూ అధరస్పందం చెయ్యలేదు.
     "రాజుగారూ! కుడివైపువున్న మన యేనుగుని వారి శకటు దగ్గిరగా వేయించండి" అని చెప్పాడు శంకరప్ప కాని రాజుకది యిష్టం కాలేదు.  అత నాయెత్తు వెయ్యలేదు.  పైగా "ముందు మన రాజుని తప్పుకోవాలండీ! లేకపోతే ఆట మరీ చెడుతుంది" అని వాదంలోకి దిగాడు.
     "ఇదేమిటండీ?" అన్నట్టు శంకరప్ప తన కేసి చూడగా "వారు చెప్పినట్టు చెయ్యండి రాజుగారూ" అని శాస్త్రి వొత్తిచెప్పాడు.  "చర్చ మొదలు పెట్టకండి.  వారేంచెబితే అది చెయ్యండి.  ఇష్టం లేకపోతే తమరు సొంతంగానే యెత్తు వేయించండి" అని యాజులుకూడా కచ్చితంగా చెప్పాడు.
     "అయితే వే - శాను" అంటూ రాజెత్తువేశాడు.  వెంటనే మూర్తి నిర్లక్ష్యంగా యెదురెత్తు వేసి కనుబొమ్మ లెగరవేసుకుంటూ చూశాడు.
     "వారు తమ శకటు మన యేనుగు పక్క వేశారండీ"
     "మనకి తెరచి రాజయిందన్నమాట.  అయితే, మన యెర్రగది శకటు రాజుకి అయిమూల గదిలో పడెయ్యండి"
     "వే --- శాను"
     "అంతేనా!"
     "మరేమిటీ?"
     "వారికి తెరిచి రాజయిందని చెప్పరూ?"
     రాజు ఈమాట చెప్పగా గతుక్కుమనిపోయి మూర్తి పైకిచూశాడు, పెదవి కరుచుకుంటూ.
     "తాతయ్యగారూ!"
     "ఎందుకండీ మనుమడయ్యగారూ?"
     ఇలా అని మూర్తి కళ్ళు మూసుకున్నాడు.
     "ఆలోచిస్తున్నారండీ"
     "తొందరపెట్టకండి"
     మూర్తి వుడికిపోయాడు
     అతనికి వల్లమాలిన శౌర్యం వచ్చింది.  వెంటనే బలం అంతా వొక్కమాటు కలియచూసి, వొక మా టొకబంటూ, యింకొక మాటు శకటూ, మరొకమాటు గుర్రమూ మూట్టుకుని, మూడు మాట్లూ వూగీస లాడిపోయి, చివరికి రాజుని
వెనక్కి తప్పించుకున్నా డతను.
     రాజు శంకరప్పకి యీసంగతి చెప్పాడు.
     "చూడండీ, స్వస్థలంలో వుండిపోయిందే మన నల్లగది శకటు?  దాంతో వారి బంటు ---"
     "కొట్టి రాజండీ"
     "ఆట --- "
     "కట్టండీ తాతయ్యగారూ!"
     మూర్తి కొయ్యయిపోయాడు.
     శాస్త్రీ, యాజులూ అందుక్కూడా అన్వయించేటట్టు "సెబాస్" అన్నారు.
     రాజు మీసంమీద చెయ్యి వేసుకున్నాడు.
     స్వగతాలు ముగిశాక యువకులు ముగ్గురూ శంకరప్పకేసి చూడగా, అతను, యెదటి గోడనివున్న పరశురామ పటం కేసి నిశ్చలంగా, చూస్తున్నాడు.
     ఆ నిర్వకారస్థితి చూసి ముగ్ధు డయి, లేచివెళ్ళి చెవిలో యేదో చెప్పాడు శాస్త్రి.
     శంకరప్ప తలవూపి వూరుకున్నాడు.
     మూర్తికి రోషం కెళ్ళించింది.
     దాని కది చల్లబడేటట్టు కనబడలేదు.  దాంతో అతను బలం కలిపేసి "చిట్టచివర వచ్చి గారడీ చెయ్యడం కాదు ప్రయోజకత్వం! చేతనయితే మొదణ్ణుంచీ స్వయంగా యెత్తు వెయ్యమనండి"
     అని మళ్ళీ తన బలం సద్దుకున్నాడు.
     "ఏమి సెలవు?" అని అడిగి రాజుకూడా బలం సద్దాటప్పటికి శంకరప్ప వచ్చి కూచున్నాడు.
     "ఒక్క అరగడియ ఆట వడిగానే నడిచింది;  తరవాత మందగించింది.
     ఆస్థితిలోకూడా మరో అరగడియ గడిచాక "యిక నాలుగో యెత్తు పడనివ్వ" నన్నాడు శంకరప్ప.
     "నీకు మూడోయెత్తు చేతనయితేకదా?" అని ముదలకిస్తూ మూర్తి రెండోయెత్తు వేశాడు.
     శంకరప్ప నిర్విణ్ణత నటించాడు.  యువకులు తెల్లపోగా "మూర్తి గుర్రం దిగండి" అన్నట్టు శిర కంపం చేశాడు.
     "ఎత్తు వెయ్యమంటారా" అని అడిగాడు శంకరప్ప.
     "తర మయితేనూ"
     "అయితే మాటే చెప్పండి"
     "అడిగేదేమిటీ?"
     "అయితే, యిదిగో గుర్రం యిక్కడ వే - శాను"
     "తెరచి రాజు"
     "మిమ్మల్ని నాలుగోయెత్తు వెయ్యనివ్వనన్నాను"
     "నీమాట లెక్కేమిటి జమేమిటి, వేసేశాను"
     శంకరప్ప శాస్త్రికేసి తిరిగి పెదవి విరిచాడు.
     "ఏమిటీ యీధోరణీ" అనుకుంటూ శాస్త్రి బలం అంతా పరిశీలించి "అయ్యో, తాతగారూ, మీకు వేసిరాజయిందండీ, అది సద్దుకోకుండా మీరెలా రాజంటారండీ" అనడిగాడు కొంచెం గట్టిగా.
     తరవాత, కృష్ణంరాజు, యువకులతో కూడా శంకరప్పని తలయింటికి తీసుకువెళ్ళి, యెంతో పొగడి, యెంతో ఆదరించి "తమరు నన్ను దిద్దాలి" అంటూ రెండు చేతులూ పట్టుకుని ప్రార్థించాడు.
     శాస్త్రికీ యాజులికీ నిద్ర లేదు.  ఆహారం లేదు.  ఈ ప్రపంచ ధోరణే పోయింది.
     వారికి శంకరప్ప వుపాస్యదేవత అయిపోయాడు.  గొప్ప గొప్ప ఆటగాళ్ళ దగ్గరికి అతణ్ణి తీసుకువెళ్ళడమే వారికి వృత్తి అయిపోయింది.
     భక్తియోగంలో శంకరప్పకి కాళ్ళు పట్టడందాకా వెళ్ళిపోయారు వారు.
     ఇలాగ వొక్కవారం గడిచింది.
     ఈవారంలోనూ పెద్దాపురంలో పేరుపడ్డ ఆటగాళ్లు సగానికి పైగా చిత్తయిపోయారు.
     శంకరప్ప వీధికి రావడం భయం.  పదులు --- యిరవైలు --- యాభైలు చదరంగప్రియు లతణ్ణిచుట్టుకుని "మేముచూస్తాం వొక్కఆట వెయ్యండీ"  "మాకు మెళుకువలు చెప్పండీ"  "తమరీవూళ్ళో వుండిపొండి"  "తమరొకమాటు మహారాజులుంగారితో ఆడాలండీ" "తమర్ని దివాన్జీవారికి పరిచయంచేస్తాం దయచెయ్యండీ" అని ఇలాగ ప్రార్థించడం మొదలు పెట్టారు.
     "తంగిరాల శంకరప్ప" --- ఇది పట్నం అంతటా చుట్టుపట్ల కూడా రామనామం అయిపోయింది.
వూళ్ళవూళ్ళనుంచి ఆటగాళ్ళు రాసాగారు.
     చూడనివారు "ఎంత పకడయిన మనిషో!"  "ఎందర్ని వోడించి వచ్చాడో"  "ఎన్ని తోడాలున్నాయో?"  "ఎన్ని సింహతలాటం మురుగు లున్నాయో?"  "ఎన్ని వుంగరాలు గడించాడో?"  "ఎన్ని శాలువలు కొట్టేశాడో" అనుకుంటూ చూసి, తమకళ్ళు తామే నమ్మలేకుండా వున్నారు.
     ఆవేషం బాగాలేదని అనేకులు పట్టంచులచాపు లివ్వ వచ్చారు.  ఉప్పాడ జరీజామార్లు కట్టబెట్టపోయారు.  బరంపురం తాపితాలు కొందరు సమర్పించపోయారు.  కాశ్మీర శాలువులు కొందరు కప్పపోయారు.
     కాని శంకరప్ప వొకటీ పుచ్చుకోలేదు.  ఒకటీ తాకలేదు --- చూడనేలేదు.
     "అన్నీ పుచ్చుకుంటాను.  ఒకటీ విడిచి పెట్టను.  ఏదీ పోనిచ్చుకోను;  కాని యిప్పుడు కాదు.  ఈస్థితిలో కాదు.  ఎవరూ ఏమీ అనుకోవద్దు.  ఏవరూ ఆగ్రహించవద్దు.  నేనుపుచ్చుకోడానికే వచ్చాను.  అడిగి పుచ్చుకుంటాను" అని వారికందరికీ సద్ది చెబుతూ వచ్చాడు.
     అనేకులు విందు భోజనాలకు పిలిచారు.  వారికీ యిదే సమాధానం.  ఇదే సద్దుబాటు.
     ఎవరికీ యేమీ బోధపడలేదు.  ఏమీ తోచనే లేదు.
     "పెద్దమ్మ చెల్లిలి కొడుకేమోరా"  "మేనల్లుడేమోనయ్యా"  "మొత్తానికి దగ్గిర వాడయి వుంటాడండీ" అంటూ యిలాగ యెన్నో రకాల ప్రతిపాదనలు జరిగాయి;  కాని వొకటీ నిలువలేదు.  శాస్త్రీ యాజులూ కూడా యీవిషయం తెలుసుకోలేకపోయారు.
     పెద్దమ్మ కూడా గాంభీర్యం వహించింది.
     ఇంకొకవారం గడిచింది. సామంతులూ, సేనాధిపతులూ రాజబంధువులూ, రాజపురుషులూ, సంపన్నులూ సరసులూ కోరి తీసుకు వెళ్ళి శంకరప్పతో మళ్ళీమళ్ళీ ఆడి, ఆటకట్టించుకుని అదే తమకొక గొప్పగా ఆనందించసాగారు.
     అతనితో ఆడడమే రాజయోగం అని ఆశ్రయించి, కని పెట్టుకుని, పడిగాపులుపడి తహతహ లాడిపోసాగారు.
     శంకరప్పకి శాస్త్రీ దివాన్జీ, యాజులు సేనాపతీ అయిపోయారు.
     ఠాణేదారు కిదంతా ఉప్పెనలా తోచింది.  దివాన్జీచెవులు తూట్లుతూ ట్లయిపోయాయి;  కాని అత నిదేమీ యెరగనట్టు నటించసాగాడు.  అయితే "మహారాజే కభురు చేస్తారేమో కొంపతీసి" అన్న భయంమాత్రం అతని కోమూల పేగులు తోడేస్తూనేవుంది.
చీకటి పడుతూపడుతూ వుండగానే వేళాకోళాలు చేస్తూ రామసోదెమ్మ వడ్డించగా, పెద్దమ్మా, శంకరప్పా యేక బంతినిభోజనం చేసివచ్చి అరుగుమీద కూచుని కబుర్లు చెప్పుకో సాగారు.
     మరో పది విఘడియలకి శాస్త్రివచ్చి, నట్టివాకట్లో మంచం మీద కూచున్నాడు.
     ముగ్గురూ మాట్టాడుకుంటూ వుండగా "పెద్దమ్మ గారూ!" అంటూ వీధిలోనుంచి పిలుపు వచ్చింది.
     "ఎవరు వా?" రంటూ శాస్త్రి వెళ్ళి తలుపు తియ్యగా ఝూమ్మంటూ వీధిలో రెండుకాగడాలు.  పాలకీ పదహారుగురు బోయీలూనూ.  ఈటెలతోటీ, బల్లేలతోటీ పది పదేహేనుగురు భటులు.  అందరికీ జవాబుగా గుమ్మం దగ్గిరసా వెండి మీసాల ముస్సద్దీ.  అతని పక్కగా డలాయతు.
     చకితుడై లేచి శంకరప్ప నట్టి వాకట్లోకి వెళ్ళాడు.  "ఇది మహారాజులుంగారి పిలుపు" అని సన్నగా చెబుతూ, పెద్దమ్మ అతనితోకూడా రెండడుగులు వేసి ఆగిపోయింది.
     "ఇక్కడ తంగిరాల శంకరప్ప గారున్నారాండి?" అని అడిగాడు ముస్సద్దీ
     "ఉన్నారు"
     "వారి దర్శనం కోసం వచ్చాము"
     "తమరు ---"  అంటూ శాస్త్రి మాట తేల్చేశాడు.
     "మేము చామర్లకోట శ్రీరావు రాయడప్ప రంగారాయణింగారి మనుష్యులం"
     "దయచెయ్యండి, వారే శంకరప్పగారు."
     ముస్సద్దీ కొంజా దాటి వచ్చా టప్పటికి శాస్త్రి మనస్సు వురకలువేసింది.  "వారెవరూ?" అన్నట్టు శంకరప్ప పెద్దమ్మకేసి చూశాడు.  "చెబుతా" అన్నట్టు పెద్దమ్మ కళ్ళు చికిలించి, మళ్ళీ వెనక్కి రెండడుగులు వేసింది.
     "నమస్కారాలు" అంటూ ముస్సద్దీ నమ్రుడుకాగా "శ్రీకృష్ణార్పణం, దయచెయ్యండి" అంటూ శంకరప్ప మంచం చూపించాడు.
     శాస్త్రికూడా "దయచెయ్యండి" అన్నాడు కాని ముస్సద్దీ నుంచునే వుండి, మోడ్పుకేలితో శంకరప్పని చూపిస్తూ "వారిసన్నిధి నుంచునే వుండవలసినవాణ్ణి నేను" అన్నాడు.
     "ఎంతమాట సెలవిప్పించారూ? అందరమూ కూచుందాం దయచెయ్యండి" అంటూ మంచం దగ్గిరకి వెళ్ళాడు శంకరప్ప.
     శాస్త్రీ వెళ్ళాడు.  ముస్సద్దీ కూడా కొంతదూరం వెళ్ళాడు; కాని కూచోక చేతులు దోయిలించుకున్నాడు.
     చివరికి అందరూ నుంచునే వుండిపోయారు.
     మంచం మొదణ్ణుంచీ నిలువుకాళ్ళమీదే వుంది.
     అప్పుడు ముస్సద్దీ చేతులు మళ్ళీ జోడించుకుని "తమరు చదరంగంలో నిధు లని కోలాహలంగా వున్న జనశ్రుతి విని తమ చాతుర్యంచూసీ, తమతో వొక్క ఆటవేసీ, ఆనందిచకోరి, దయచెయ్యవలసిందని కోరుతూ, తమకోసం మా దొరవారు ఈ పరివారం పంపించారు.  వారి అభిలాష తీర్చవలసిందని మా సవినయ ప్రార్థన" అని విన్నవించాడు, వంగి.
     ఇది విని "ఇలాంటి ఆహ్వానం యిదివర కెవరికి వచ్చిందీ?" అనుకుంటూ శాస్త్రి పరవశుడయాడు.
     ఆయన కేమి చెప్పడమో తోచక, శంకరప్ప, మొదట మిత్రుడి కేసీ, తరవాత పెద్దమ్మకేసీ చూశాడు.
     ఈలోపునే ఆశ్ఛర్య సంభ్రమ సంతోషాదులన్నీ ముగించుకుని, కర్తవ్యం కూడా నిశ్ఛయించుకుని వున్న పెద్దమ్మ "వద్దు" అన్నట్టు తల కొంచెం ఆడించి గుమ్మంలోకి వెళ్ళిపోగా, వూచలాగ వెళ్ళి శంకరప్ప ముస్సద్దీ రెండుచేతులూ పట్టుకున్నాడు.  ఇలాంటి ప్రభు సన్మానం నేనెన్నడూ యెరగను.  అసలు, నాకిలాంటి యోగ్యత వుందనే నాకెప్పుడూ తోచలేదు.  తమ రాక నన్ను బ్రహ్మానంద భరితుణ్ణి చేసింది.   దొరవారి కటాక్షం నాకు కొత్త ఆశలు రేపెడుతోంది.  కాని నాదొక ప్రార్థన, తమరు బాగా ఆలోచించాలి.  ఏదో రెండు మూడెకరాల కొండ్ర దున్నుకుంటూ, మిత్రులతో చదరంగం ఆడు కుంటూ కాలక్షేపం చేస్తూవున్న ప్రాకృతుణ్ణి నేను.  కార్యాంతరమీద యీవూరు వచ్చిపడ్డాను.  ఇక్కడికి వచ్చి చాలా రోజులే అయింది.  ఇంకా చాలా రోజులు వుండవలసివుంది;  కాని పెద్దాపురం విడిచి యిప్పట్లో నే నవతల అడుగు పెట్టలేను.  పెట్టడానికి కొన్ని చిక్కులున్నాయి.  తమరీ సంగతి దొర వారికి విన్నవించి, నామీద వారి అనుగ్రహం తప్పిపోకుండా వుండేటట్టు చేసే భారం తమమీద వుంది.  నేను తమ ఆశ్రితకోటిలో వాణ్ణి, తమ రన్యధా భావించవద్దు.
     మొదట చకితు డయిపోయి, తరవాత ముస్సద్దీ యిలా అన్నాడు.
     "పది రోజులనుంచి మాదొరవారికి తమ లీలలు వినడం తోటీ, చెప్పుకోడంతోటీ సరిపోతుంది.  మూడు రోజులకిందట తమతో యెత్తువెయ్యాలని వారికి సంకల్పం కలిగింది.  తమరు ఆదివరాహమూర్తిగారిని చిత్తుచేసిన వార్త వారికి ఈసాయంత్రమే తెలిసింది.  తెల్లవారేదాకా వుండలేక నుంచున్న పాళంగా మమ్మల్ని తరిమారు."
     "నేను పూర్తిగా దురదృష్టవంతుణ్ణి.  చామర్లకోట దొరల  సాహసౌదార్యాలు జగద్విదితాలు;  కాని చదరంగం ఆట కోసమే మేమిప్పు డొకచోటికి వెడుతున్నాము.  ఏర్పాట్లన్నీ యిదివరకే అయిపోయాయి.  మాట తప్పడం అపరాధం అయిపోతుంది."
     "పోనీ, ఫలానా రోజున దయచేస్తామంటే  ---"
     "శ్రీహరీ" అని మాట సగంలోనే అందుకున్నాడు శంకరప్ప, చేతులు జోడించుకుని.
     "అలా మనవి చెయ్యడానికిన్నీ సుతరామూ వీలు కనపడ్డం లేదు.  నేనే బయలు దేరి వస్తాను.  ఏక్షణంలో వీలుపడితే ఆక్షణంలో వచ్చి వాల్తాను.  అయితే ఒక్క మనవి.  ఈపల్లకీ - యీపరివారమూ - వీటికి నేనర్హుణ్ణికాను.  పాదచారినై వచ్చి నేను దొరవారిని సేవించుకుంటాను."
     "మా వుత్సాహం అంతా భంగపడిపోయింది."
     ఈమాట అన్నప్పడు ముస్సద్దీ కొనవూపిరితో వున్నట్టయిపోయాడు.
     "తమరలా సెలవిప్పించవద్దు.  నాదగ్గిర దొరవా రనుకుంటూవున్నశక్తిచాతుర్యా లుండడమే నిజమయితే, యీ వ్యవధానం వారి వుత్సాహాన్ని ద్విగుణమూ త్రిగుణమూ చేసి, చివరికి ఆనందాన్ని శతసహస్రగుణాలు చేస్తుంది."
     ముస్సద్దీ మరి మాట్లాడలేక, రెండుచేతులూ యెత్తి నమస్కారంచేసి, మెల్లిగా వెనక్కి తిరిగాడు.
     గుమ్మందాకా వెళ్ళి శాస్త్రి సాగనంపాడు.
సుతారంగా మొగంతిప్పుకుంటూ శంకరప్ప పెద్దమ్మ కేసి చూశాడు.  గభీమనివచ్చి అతనివీపు నిమురుతూ "చాలా చక్కగా చెప్పావు నాయనా! ఇలాగ మాట పొందిక వుంటే విద్య యెంతయినా రాణిస్తుంది" అని మెచ్చుకుంటూ, అతణ్ణి మంచంమీద కూచోబెట్టి పక్కని కూచుంది పెద్దమ్మ.
     "ఈవులకం యేమిటి పెద్దమ్మా?"
     "వుల కాని కేం వుంది నాయనా?" ఇది రసికుల లక్షణం.  కళ తెలుసుకోడమూ, అనుభవించడమూ, గౌరవించడమూ --- ఇంతే వారి పని.  కళాపరిజ్ఞానం వున్నచోట ద్వంద్వాల చింత తలయెత్తలేదు.  అదలా వుండనియ్యి.  నీకిదే చెప్పడం.  నువ్వు వచ్చిన పని కాయో పండో తేలే దాకా పదచలనం చెయ్యవద్దు"
     "సరిహద్దుకూడా కళ్ళచూడను, సరా?"
     "చూస్తూవుండు.  మహారాజు కూడా యిలాగే కబురు చేస్తారు, పరివారం పంపి"
     "ఇదంతా నీచలవ"
      ఇలా అంటూ శంకరప్ప పెద్దమ్మ పాదాలు పట్టుకున్నాడు.  "వెర్రితండ్రి!  నీకు వచ్చిన లోటు లేదమ్మా! నువ్వు అగ్రహారీకుడ వయిపోతావు నాయనా!" అని, పెద్దమ్మ శంకరప్ప శిరస్సు ఆఘ్రాణించింది.
     ఈసమయంలో "మాట యెవరి కిచ్చారండీ?" అని ముదలకిస్తూ శాస్త్రి వచ్చాడు
కూచోమని మంచంమీద స్థలనిర్దేశం చేస్తూ "మీకివ్వలేదుటండీ?" అన్నాడు శంకరప్ప.
     శాస్త్రి విభ్రాంతుడై ఠకీమని నిలిచిపోయాడు.  "మా నాయన మాటల్లో దొరకడు" అని పెద్దమ్మ శంకరప్పమీద మెటికలు విరచింది.
     "ఇలాంటి గౌరవం యేపండితుడికి జరిగింది పెద్దమ్మా?"
     "నాయని కింకా యెంతెంత లేసి గౌరవాలు జరుగుతాయో అప్పుడే అయిందా శాస్త్రులు బాబూ?"
     "ఇదంతా పెద్దమ్మ చలవా మీ అనుగ్రహమూనూ"
     ఇలా అంటూ మోడ్పుకేలితో వుభయులకేసి తిరిగి సమ్రుడైనాడు శంకరప్ప.
     "దానికేంగాని --- మరి తరవాయి? అన్నాడు శాస్త్రి.  దీనికి జవాబుగా మాంచి రసకందాయప్పట్టులో వుంది ఆట" అని నురగలు కక్కుకుంటూ వచ్చాడు యాజులు.
     "వెళ్ళండి నాయనా" అని తొందర పెట్టింది పెద్దమ్మ
     "ఇలా కూచో.  ముందు ఆయాసం తీర్చుకో" అంటూ యాజుల్ని చెయ్యి పట్టుకు లాగి దగ్గిర కూచోపెట్టుకుని "ఏమిటి విశేషాలు? వివరంగాచెప్పు" అన్నాడు శాస్త్రి
     "వెడుతూ చెప్పుకోగూడదూ?" అని శంకరప్ప లేచి నుంచోగా, "నాకాయాసం యేమిటోయ్? నిమిషంలో వెళ్ళి మన మక్కడ వాలాలి, అంత పొంకగా వుంది ఆట.  మరిలే" అంటూ లేచినుంచుని శాస్త్రి చెయ్యిపట్టుకులాగాడు యాజులు.
     ముగ్గురూ బయలుదేరారు.
     "తొరగా రండి నాయనా, నిద్ర పాడుచేసుకోకండి" అంటూ గుమ్మందాకా వెళ్ళి, తలుపు వేసి పెద్దమ్మ మళ్ళీ వచ్చి మంచం మీద నడుము వాల్చింది.
పుచ్చపువ్వులాగా వెన్నెల.  గంధప్పూత లాగ పిల్లగాలి.  వీటికనుకూలంగానే మాలసిక పరిస్థితులు.
     యువకులు యెగిరిపోతున్నారు.
     రెండో వీధికి మళ్ళా టప్పటికి "శంకరప్పగారు కూడా వున్నారా యేమిట్రా?" అని వొకప్రశ్న.  "ఉన్నారోయ్ కాని ఆగడానికి వీలులే" దని శాస్త్రి జవాబు.
     మరి నాలు గిళ్ళుదాటారు.  ఒక యువకుడు దారి కడ్డంగా నుంచుని "నుంచో, నుంచోవు కాదూ?" అని నిష్ఠురాలాడాడు.  "నీధోరణే నీదా? ఇవతలవాళ్ళ మంచి చెడ్డలు చూడవద్దూ? అక్కడెంత తొందరపని వుందో యెరుగుదువా" అంటూనే తప్పించుకుని ముందుకి సాగి పోయాడు శాస్త్రి.
     ఇలాగే మరికొందరున్నూ పలకరించారు.  "ఒక్కయెత్తు" అని అనేకు లువ్విళ్ళూరారు.  "వీలులే" దనడానికి శాస్త్రి విసిగిపోయాడు.
     మళుపు తిరిగేటప్పటికి వేశ్యావాటిక.
     సర్వవిధాలా అది విలక్షణప్రపంచం.
     మామూలుగా కాక, అక్కడివెన్నెల సురభిళంగా వుంది. పిల్లగాలి మధురంగా వుంది.
     దీనికిసాయం, వొక మేడమీద గాత్రపాట, ఒక మేడమీద వీణాధ్వని, ఒక మేడమీద మృదంగధ్వని వుజ్జీవింపచేస్తూ గజ్జెల చప్పుడు, ఒక మేడమీద కలకల నవ్వులు, ఒక మేడమీద ఛలోక్తులు.
     కొన్ని ద్వారాలలో బంగరు బొమ్మలు, కొన్ని అరుగుల మీద జంగమవల్లులు, కొన్ని మేడలముందు సీతాకోకచిలకలు. 
     అక్కడక్కడ నీడల్లో కొత్త తుమ్మెదలు.
     అలాంటి చోట యీమిత్రమండలి.
     ఒక మేడమీదనుంచి "అల్లుడుగారూ, దండాలు" అని వినిపించింది,  "శ్రీకృష్ణార్పణం"  అన్నాడు శాస్త్రి.
     ఒక ద్వారం నుంచి "మామయ్యగారికోసం కళ్ళు కాయలు కాసిపోయాయి" అని వినిపించింది.  "దోరగా అయినా పండనియ్యి" అని యాజులు దీవన.
     ఒక అరుగుమీదనుంచి "బావయ్యగారు, బావయ్యగారు, రెండెత్తులు --- దయచెయ్యరూ?" అని పిలుపు "ఒకచోటికి శంకరప్పగారిని తీసుకు వెడుతున్నాము.  ఇప్పుడు కాదు" అని యాజులు నిరాకరణం.
     ఒక మేడ ముందునుంచి వొక మధ్యానాయిక అడ్డంవచ్చి "అన్నయ్యగారికి" దండాలు అంది. 
     "శుభం, వెళ్ళనివ్వాలి"
     "శంకరప్పగారి పాదాలు కొలుచుకుంటాను"
     "ఈమె పేరు అలివేణి.  రాజసభలో ప్రముఖురాలైన నర్తకి.  విశేషించి చదరంగంలో నిధి.  ఒకమాటు "ఆటకట్టు" అన్నంత చాతుర్యం చూపించగా మెచ్చి, మహారాజులుంగారీమెకి రత్నాంగూళీయకమూ, బంగారుజడా, దుశ్శాలువులూ, దంతపుబలమూ బహూకరించారు.  ఒక్కమాటు పాదాలివ్వండి"
     శాస్త్రి యిలా చెప్పగా "నాపాదాలు ధూళిధూసరితాలు కదా" అని శంకరప్ప సంకోచించాడు.
     "మహాత్ముల పాద ధూళి నాశిరమున దాల్తు" నంటూ అలివేణి శంకరప్ప పాదాలు పట్టి కళ్ళకద్దుకుంది.
     "సెలవయితే -" అని శాస్త్రికేసి చూస్తూ శంకరప్ప నసిగాడు.  "తప్పకుండాను" అని యాజులనగా "శంకరప్పగారు మీయింటికి సావకాశంగా వస్తారమ్మా చెల్లీ!" అని శాస్త్రి వాగ్దానం చేశాడు.
     "మహాప్రసాదం" అని అలివేణి తప్పుకుంది.
     వారు నాలుగిళ్ళు దాటి వొక భవంతి దగ్గిర ఆగారు.
     "రంగనాయిక" అని చక్కని చుక్క.  చికిలీచేసిన మన్మధబాణం.  వయస్సు రమారమి యిరవై.  ఆటపాటల్లో మేటి.  విటుడు పందొమ్మిదేళ్ళ క్షత్రియయువకుడు.  మహారాజు చదరంగం ఆడాటప్పుడు పరికరాలు సద్ది, సన్నిధిని వుండవలసిన నలుగురు వేశ్యలలోను వొకతె.  అప్పుడప్పుడు మహారాజుకి చదరంగవినోదం చేకూర్చే వుజ్జీ"
     శంకరప్ప చెవిలో ఇలా చెప్పి శాస్త్రి గుమ్మం యెక్కాడు.
గుమ్మం దాటితే, లోపల చక్కని భవంతి.  ముందు పెద్ద జూకా మల్లిపందిరి.  బయలంతా పూలతోట.  పందిరికి దక్షిణంగా పావురాల గూడు.  హాల్లోనూ అరుగుల మీదా పట్టపగలన్నంత దీపకాంతి.
     వాతావరణం అంతా అగరువత్తుల పరిమళంతో గుమ్మయిపోయివుంది.
     పందిట్లోనే వొక కవాచీ బల్ల వుండగా, దానిమీద కూచున్నారు వారు.
     ఎవరైనా కనబడతారేమో అని యాజులటూ యిటూ చూశాడు.  "ఏమిటి దారి?" అని శాస్త్రి ఆలోచనలో పడ్డాడు.
     శంకరప్ప కళ్ళు అప్పగించేశాడు.  
     ఇక్కడిలా వున్న సమయంలో "ఇవాళ మీఆటకట్టి తీరతానండీ" అని దక్షిణపు తెరిపిలో నుంచి వొక చిలకపలుకు వినవచ్చింది.  "అమ్మయ్యా" అని యెగిరిపడి తర్జనితో నిర్దేశిస్తూ, "రంగనాయిక" అన్నాడు మెల్లిగా శాస్త్రి.
     "ఆయేనుక్కి కాపులేదే అక్కా?" అని ఒక నెమలికేక.  శాస్త్రి "మరదలు పిల్ల" అన్నాడు.
     స్ఫుటంగానూ, స్పష్టంగానూ వినపడలేదు;  గాని జవాబు గా సన్నని పురుషకంఠం.
     "అలా వచ్చారా? ఆయెత్తుమీద వచ్చారా? అందుకా మీరాకా? ఉ-హూ! ఇందాకటికంటే చెడిందిచెల్లోయ్! అయినా ---గుర్రం యిక్కడ వేశానండీ" అని మళ్ళీ చిలకపలుకు.
     ఉలిక్కిపడి, యాజులు శాస్త్రిని గోకాడు.  "ఏమిటి దారి?" అంటూ శాస్త్రి మళ్ళీ తటపటాయించసాగాడు.
     శంకరప్ప యివేమీవినలేదు.  మిత్రులనూ చూడలేదు.
     అతనికి దాదాత్మ్యం కలిగింది.  ఆవేశమున్నూ వచ్చేసింది.  గభీమని లేచి నుంచున్నాడతను.  లేస్తూనే దక్షిణపు తెరిపికేసి పందిరి చివరికి వెళ్ళాడు.
     శాస్త్రీ యాజులూ "యెందుకో?" అనుకుంటూనే వుండగా "నీకంత కష్టం యెందుకు చిరంజీవి? ఏగదిలో యేజంతువుందో చెబితే, నేనిక్కణ్ణుంచే సలహాచెప్పి, నాలుగెత్తుల్లో నిన్ను గెలిపించనూ?" అనేశాడు.
     అది విని యేంచిక్కు వచ్చిపోతుందో అని నోళ్ళుమూసుకుని కంగారుపడసాగారు మిత్రులు.  వారిగుండెలు పీచుపీచు మని పోతున్నాయి;  కాని,
     "మీరు తంగిరాల శంకరప్పగారా యేమిటండీ?"
     "ఔను సౌభాగ్యవతీ!"
     "దండాలండి"
     గలగలమని చల్లగా హస్తాభరణాల చప్పుడూ యీమాటా కలిసి వచ్చాయి.
     "శ్రీకృష్ణార్పణం"  అన్నాడు శంకరప్ప
     "ఏమండీ, లోపలికి రానిద్దామా?"
     ఈమాట, యివతలకి, చెవిలో చెప్పినట్లు వచ్చింది.
చెయ్యి వూపడమూ, ఆమె మెల్లిగా లోపలికి వెళ్ళిపోవడమూ జరిగిపోయాయి.
     "తమరాజుని వొక్కగది ముందికి --- మనగుర్రం దగ్గిరికి వేశారండీ వారు"
     "శివశివా! మన శకటింటోనే!"
     "ఆట కట్టండీ"
     అచ్చంగా అది మయూరక్రేంకారం.
     మరి మాటలేదు.  బలం కలిపేసిన చప్పుడుమాత్రం వచ్చింది. ఒక్క పావుగడియ వేచియుండి, తరవాత వెనక్కి వచ్చి, బల్లమీదకూచుని యాదాలాభంగా అరుగుమీది కిటికికేసి చూశాడు శంకరప్ప.
     కళ్ళు చెదిరిపోయేటట్టు కిటికీలో మొదట రెండు చంద్రబింబాలు మెరిశాయి.  వాటి వెనుక నూనూగు మీసాలున్నూ తళుక్కుమన్నాయి.
     చెరోవైపునా మొగంమీద మొగాలుంచి, శాస్త్రీ యాజులూ "కొంపలు మునిగి పోతాయనుకున్నా" మనగా, శంకరప్ప ముక్కు మీద వేలు పెట్టుకున్నాడు.
     వీరీ స్థితిలో వుండగా యెక్కడోలాగ మంజీరనినాదం సన్న సన్నంగా వినవచ్చింది.  "ఏమిటి చెప్మా?" అనుకుంటూ వుండగా, దణ్ణాలండి అని వెనకాల చిలక పలుకు.  ముగ్గురూ అదరిపడి వెనక్కిచూడగా, అంజలి బంధంతో వొక బంగారు బొమ్మ.
     "శ్రీకృష్ణార్పణం" అని శంకరప్పా "సౌభాగ్యవతీభవ" అని  శాస్త్రీ యాజులూ దీవిస్తూ లేచి నుంచున్నారు.
     దరహాసలిప్తాలే అయినా శంకరప్ప చూపులతో విభ్రాంతురాలై, అంజలిబంధంతో ఆమె అలాగే నిలిచిపోయింది.
     అడ్డచారల తాబొందుమీద వుప్పాడ సన్నజరీకండువా వలెవాటు.  ముద్దుముద్దుగా వాటిని పొదివి పట్టుకుని గంటల మొలనూలు.  మెడలో పైటమీద యెగుడు దిగుడుగా పచ్చల పతకం.  ముక్కున సత్తూ బులాకీని.  చెవులకు జూకాలూ, కర్ణిపువ్వులూ, బావిలీలూనూ, చేతులకు మురుగులు, మురిడీ గొలుసులు, పోచీలు, కంకణాలు, భుజబందులు.  శిరస్సున సూర్యుడు, చంద్రుడు, పాపిడి పిందిరీలు, తమలపాకు, మొగిలి రేకు, తెగ బారెడు బంగారు జడ దానికి గుత్తులు గుత్తులుగా గంటలు.
     ఆమె శరీర కాంతిలో కలిసి పోవడం వల్ల కొన్ని ఆభరణాల రత్నసరుకే గాని, బంగారం కనిపించడం లేదు.  శిరోభూషణాలు మాత్రమే సర్వాంగీణంగా మెరుస్తున్నాయి.
     సంతతపరిచయం వుండిన్నీ శాస్త్రీ యాజులూ చకితులయినారు.  శంకరప్ప పరవశుడే అయిపోయాడు.
     "దయ చెయ్యండి" అంది రంగనాయిక.
     "ఇప్పటి దాకా కూచునే వున్నాం.  దానికేంగాని, రస భంగం చేశాను, సిగ్గుగా వుంది" అన్నాడు శంకరప్ప.
     "ఎంతమాట సెలవిప్పించారూ? మాయిల్లూ, మావంశమూ, నాజన్మా పవిత్రం అయినాయి.  మేమందరమూ ధన్యులం అయునాము?
     అంజలిబంధం విప్పకుండానే రంగనాయిక యిలా అంది.
     శాస్త్రి శంకరప్పకేసి చూశాడు.  ఆ చూపులో "అందరం అన్నమాటలో ప్రాతినిధ్యం స్ఫురిస్తుంది సుమండీ" అన్న భావం వుండడం గుర్తించి, శంకరప్ప "మీ వుదారబుద్ధి అలా అనిపిస్తోంది.  నాలో కించిత్తూ వైలక్షణ్యంలేదు" అన్నాడు.
     "తమలో లేనిది వైలక్షణ్యం కాదు, దానికి పరిమితి"
     శాస్త్రీ యాజులూ "రంగా, నువ్వు సరిగా చెప్పా" వన్నారు.
     "నే నసహాయు ణ్ణయిపోయాను" అని శంకరప్ప మందహాసం చేశాడు.
     "అసహాయశూరులు తమరు.  పదిరోజులుగా తమ పేరుమీద దేవదుందుభులు మోగిపోతున్నాయి.  ఉబలాటం వురకలువేస్తోంది.  అయితే, నాజన్మలో తీరనికోరిక యిది. కాని అప్రయత్నంగా సిద్ధించింది"
     "అంత నిరాశయేలా? కాకిచేత కభురుచేస్తే రాకపోదునా నేను? ఈపట్నంలో హేమాహేమీలున్నారని తెలిసి, మెళుకువలు గ్రహించడానికి కదా నేను వచ్చాను?"
     "శ్రీహరీ! శ్రీహరీ! వూరుకుంటారేం శాస్త్రుల్లు మామయ్యగారూ!"
     "ఊరుకోక యేమిటి చెయ్యడం? ఆటలో నెగ్గాము కనకనా, మాటల్లో నెగ్గడానికి?
     "నాకు వాగ్బంధంచేశారు మీరు" అన్నాడు శంకరప్ప.
     "మీకు వాగ్బంధనం చెయ్యడానికి సరస్వతికూడ చాలదంటే యిక అస్మదాదులమాట చెప్పేదేమిటి?  అయితే మీరీవూరు నుంచి కదలకుండా అష్టదిగ్బంధనం మాత్రం చేసేస్తాం మేము" అన్నాడు యాజులు.
     దానిమీద "అవునవును.  అది తప్పకుండా చెయ్యాలి" అని రంగనాయికా, "ఇంకా చెప్పాలా? అని శాస్త్రీ దృఢంగా అన్నారు.
     ఈసమయంలో వెండిపళ్ళెం పట్టుకుని మరదలుపిల్లా ఆమె వెనుక జరఠా వచ్చారు.
     రంగనాయిక వెంటనే వొక తాంబూలం అందుకుని నమ్రురాలై శంకరప్పకి సమర్పించింది.
     ఈఅవకాశంలో పళ్ళెం తల్లిచేతికందించి, మరదలుపిల్ల, శాస్త్రికీ యాజులుకీ తాంబూలా లిచ్చింది.
     ఒక్కమాటు అయిదుగురి కళ్ళూ మిలమిల్లాడాయి. వెంటనే పురుషులు ముగ్గురూ బయలుదేరారు.
     గుమ్మందాకా సాగనంపి, మళ్ళీ దణ్ణాలు నివేదించి, సెలవుపొంది అక్కా చెల్లెలూ వెనక్కిమళ్ళారు.  తలుపు వేసేసి తల్లికూడా కూతుళ్ళవెనకనే వెళ్ళిపోయింది.
"పట్నంలోకెవరో అసాధ్యపు ఆటకాడు వచ్చారుట, మీకేమయినా జాడ తెలిసిందండీ?"
     "లేదు మహాప్రభూ!"
     ఉదయం యేడెనిమిది గడియల పొద్దెక్కాక, జరుగురైన రాజాధికార్యాలన్నీ ముగించుకుని, పెద్దాపురంకోటలో, మహారాజాధిరాజ, పేషణిహనుమంత, నెలవోలుగండాంక, శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతిమహారాజు లక్క మేడ వసారాలో పచారుచేస్తున్నాడు.
     లేజవరాలైన వొకపరిచారిక వెనకవెనకనే కూడాకూడా తిరుగుతూ ఆమహారాజు చెయ్యి చాపినప్పుడల్లా హూక్కా గొట్టం అందిస్తోంది.  మరొక లేజవరాలు, చేతులు, కట్టుకునీ మొగం వంచుకునీ మెట్లదగ్గిర నుంచునివుంది.
     జరూరుకాగితాలు చేతపట్టుకుని, వొక స్తంభం దగ్గిరగా నుంచుని దివాన్జీ మాట్టాడుతున్నాడు.
     "ఊరంతా కోడయికూస్తోందిట మీకు తెలవకపోవడం యేమిటండీ?" అని ఆశ్చర్యం కనపరుస్తూ మళ్ళీ అడిగాడు మహారాజు.
     "నేను సత్యమే మనవిచేసుకున్నాను మహాప్రభూ! చదరంగం అంటే నాకు తూర్పూపడమరా యేమీ తెలువదు కనక, దానికి, సంబంధించిన కభుర్లు నాతో యెవరూ చెప్పరేమోనండి"
     "అంతా విడ్డూరంగా మాట్టాడతారండీ మీరు."
     ఇలా అంటూ మహారాజు అసంతృప్తి కనపరిచాడు.
     "మసిపూసి మారేడుకాయ చేసెయ్యడం యెలాగా!" అని దివాన్జీ ఆలోచనలో పడ్డాడు.
     సరిగా యీసమయంలో, దూర్వాసుల ఆదివరాహ మూర్తి వచ్చి కభురు చేసి, సెలవుపొంది పైకివచ్చాడు.
     "పట్నంలో కెవరో గొప్ప ఆటకాడు వచ్చారుట మీరు విన్నారుటండీ.?"
     వచ్చీరావడంతోటే నిలవేసినట్టు మహారాజిలా అడగ్గా మూర్తి వొక్కక్షణం గుక్కతిప్పుకోలేక వుక్కిరిబిక్కిరి అయిపోయి అంతలో మళ్ళీ సద్దుకున్నాడు.
     "వినడంకాదు, చూశాను మహాప్రభూ! చూడ్డమూ, కాదు అతగాడితో ఎత్తులుకూడా వేశాను మహాప్రభూ"
     "మరి సెలవిప్పించారు కారేం?"
     "విధిలేక యిప్పుడు మనవిచేసుకుంటున్నాలు జగత్ప్రభూ! ఆమనిషి యేలినవారి సన్నిధిలో ప్రస్తావన చెయ్యవలసినవాడు కాడండి"
     "అదేమీ?" అంటూ మహారాజు నిర్విణ్ణుడయాడు.
     మొగం పక్కకి తిప్పుకుని "నాలుగు బాదులు బాదండి" అన్నట్టు దివాన్జీ కన్నుగీటాడు.  అది గుర్తించి మూర్తి పూర్తిగా పురెక్కాడు.
     "అతగాడు కట్టు పొగరుమోతు.  నొసలు వెక్కిరించడమే కాదు, నోరే బ్రాహ్మణనోరు కాదండి"
     "అంటే?"
     "నిజాని కొకమాత్రపు ఆటకాడే.  మెళుకువలు తెలిసిన వాడే.  కాని మాట పొందిక లేదు.  వినయవిధేయత లెరగడు.  పెద్దాపిన్నా తారతమ్యం లేనేలేదు.  ఒక మంచి యెత్తు తోచిందంటే - లేకపోతే యెదటిబలం లొంగుబాటులో వుందంటే చప్పట్లు - కేకలు - యీలలు - ఇకిలింపులు - భరించడం కష్టం మహారాజాధిరాజా!"
     "ఒక గోచిపాత కట్టుకుని, మరో గోచిపాత కప్పుకుని అతగాడు యేమిటండీ?" అని అడిగాడు  దివాన్జీ.
     "చిత్తం చిత్తం, అతనేనండి.  తమరు కూడా"
     "అతగాడే అయితే, నేనూ చూశాను మహాప్రభూ! ఒకనాడు మా యింటికి వచ్చి నానాఅల్లరీ చేశాడండి"
     "శ్రీహరీ! తమ లోగిటిదగ్గరే?' అంటూ నిర్విణ్ణత నటించాడు మూర్తి.
     "జవాన్లు అవతలికి పంపెయ్యబోగా, వొకడి అంగీచింపేసి, వొకడి డవాలీ లాక్కుని - ఠాణేదారుకూడా చాలా అవస్థ పడ్డాడండి అతడితోటి"
     మహారాజు చాలా పరితపిస్తూ "అదేమిటిచెప్మా!" అన్నాడు.
     "పొగరుమోత్తనమే కాకుండా, కొంచెం మతిభ్రమకూడా వున్నట్టు కనపడింది మహాప్రభూ"
      "దివాన్జీగారు సరిగా కనిపెట్టారు.  అదికూడా వుందనే నాకిప్పు డనుమానం కలుగుతుంది జగత్ప్రభూ!"
     మూర్తి యిలాఅనడం  దివాన్జీకి బాగా వూతంయిచ్చింది.  దాంతో అతను "సెలవయితే అరగడియలో అతగాణ్ణి యేలినవారి పాదాల దగ్గిర నిలబెట్టగలను;  కాని ---" అంటూ నసికాడతను.
     "ఆటలో సారస్యమా? మాటలో పౌరుష్యమా? నడతలో వైరస్యమా!"
     ఇలాఅని మహారాజు ఆలోచనలో పడ్డాడు.  ఉత్సాహమంతా విరిగిపోయింది.  హూక్కాగొట్టం అందుకున్నాడు కాని, నోటపెట్టుకోలేదు, మళ్ళీ పరిచారిక కిచ్చేశాడు.
     అది చూసి మూర్తీ,  దివాన్జీ పొంగిపోయారు.
     "సెలవయితే ---" అంటూ మళ్ళీ నసికాడు  దివాన్జీ.  ఒక్క క్షణం ఆలోచించి "అక్కర్లేదు; మీరు వెళ్ళండి" అన్నాడు మహారాజు.
     బరువుగా అడుగులు వేసుకుంటూ, బుర్రవంచుకుని  దివాన్జీ వెళ్ళిపోయాడు.
     మహారాజు యింగితం కనిపెట్టి "సూరపరాజుగారు కూడా దయచేసి వున్నారు.  వారితో ముచ్చటలాడుతూ కింద వుంటాను మహాప్రభూ!" అని విన్నవించి మూర్తికూడా వెళ్ళిపోయాడు.
మహారా జొక్కగడియ బొమ్మలాగ నిలిచిపోయాడు.  తరవాత, హుక్కాగొట్టంకోసం, పరిచారిక ఒకవైపునవుండగా మరొకవైపుకి చెయ్యిచాపాడు.
     ఆదుర్దాపడుతూ పరిచారిక తిరిగివచ్చి గొట్టం అందించింది.  రెండుగుక్కలు పీల్చాటప్పటికి రాజుకి కొంచెం హుషారు కలిగింది.  ఏదో చెబుదామని మెట్లదగ్గిర వున్న పరిచారిక కేసి చూశాడు.  ఈలోపున పక్కగదిలోనుంచి రంగనాయిక వచ్చి అంతా సిద్ధంగా వుంది మహాప్రభూ!" అని విన్నవించింది.
     ఆమెని చూశాటప్పటికి మళ్ళీ జిజ్ఞాసరేకెత్తగా
     "రంగీ!" అని పిలిచాడు మహారాజు.
     "చిత్తం మహాప్రభూ!" అంటూ పక్కకి వచ్చి నుంచుంది రంగనాయిక.
     "పట్నంలో కెవరో గొప్పఆటకాడు వచ్చారుటా?"
     "అవును మహాప్రభూ!"
     "అవునంటే? నువ్వు చూశావా?"
     "చిత్తం, చూశానండి"
     "వారి బసకి వెళ్ళావా?"
     "నిన్నరాత్రి వారు మాయింటికే దయచేశారండి"
     "రాత్రా?" అని కొంచెం శ్లేషగా అడిగాడు మహారాజు.
రంగనాయిక అందుకు మొదట సిగ్గుపడి, తరవాత ధైర్యం తెచ్చుకుని "అవును మహాప్రభూ! రాత్రి అయితే వారుంటారని వూహించి -"
     " అవును.  అదేఅయివుంటుంది.  సరే దయచేశారు"
     "ఎక్కడెక్కడ యే యేజంతువు ఉన్నదో ఒక్కమాటు విన్నవించగా -"
     'విన్నవించడమా?"
     "అవునండి.  గోడ అవతల నుంచుని నాలుగెత్తుల్లో"
     "గోడ అవతల నుంచునా? లోపలికి రాలేదూ?"
     "లేదు మహాప్రభూ అసలు, వారు మాయింటికి వచ్చినట్టే మాకు తెలవదండి.  మామూలుగా దక్షిణపు తెరిపిలో కూచుని యెత్తు వేసుకుంటున్నాము.  వారు నట్టివాకిట్లోనే వుండిపోయారండి"
     "నాలుగెత్తుల్లోనా?"
     "చిత్తం --- నాలుగో యెత్తుతో ఆటే కట్టిపోయిందండి"
     "ఎవరిదీ?"
     రంగనాయిక మొగం వంచుకుని "వారిది మహాప్రభూ!" అంది.
     "అయితే వారు నీపక్షం వహించా రన్నమాట"
     "చిత్తం, వారు వచ్చేటప్పటికి యెత్తునాది.  వారు చాలా అసాధ్యపు రాకడ వచ్చారండి.  ఉత్సాహాతిరేకంవల్ల      "ఇవాళ మీఆట కట్టితీరతా ---"
     "సిగ్గెందుకూ? సమయం అలాంటిది కనక చెప్పు"
     "నామాట వాకిట్లోకి వినపడి వుంటుంది.  దానిమీద వారు "నీకంత కష్టమెందుకు చిరంజీవీ! ఏగదిలో యేజంతువుందో ---"
     "ఓహో అలా కలిసిందా కత్తూ"
     "చిత్తం.  వారి యెదటికి బల్ల పంపబోయాను;  కాని అక్కర్లేదని - వద్దే అని -"
     "నీయింటి కెందుకు దయచేశారు?"
     "తరవాత తెలిసినసంగతి మనవి చేసుకుంటాను.  వారు గొప్ప ఆట ఆడతారనీ, నేను కూడా -"
     "అవునవును, తరవాతా?"
     "నిన్న రాత్రి మాయింటికి బయలుదేరుతూ వుండగా, చామర్లకోట దొరలు, వారికోసం పాలకీ, జోడు మషాల్తీలూ, పరివారమూ పంపి ప్రార్థించారుట మహాప్రభూ!"
     "వారికీర్తి పొరుగూళ్ళకిన్నీ వెడుతోందన్నమాట, అయితే మన కోట కెందుకు రాలేదూ?"
     "ఇది అంత సులభ మైనదా రాజాధిరాజా?"
     మహారాజుకి, రంగనాయిక మాటలో ఏదో ధ్వనివున్నట్టు తోచింది.  దానిమీద మూర్తి  దివాన్జీగార్ల మాటలు జ్ఞాపకం వచ్చాయి.
     "వారి దగ్గిర పొగరుమోత్తనం యేమయినా వుందా?"
     "శ్రీహరీ! గంగిగోవు మహాప్రభూ!"
     "మతిభ్రమ వున్నట్టు తోచిందా?"
     "అపర బృహస్పతులని చెప్పవచ్చు మహాప్రభూ!"
     "కట్టుకున్న బట్టలు అసహ్యంగా వున్నాయా!"
     "నీరుకావి అంగాస్త్రా లొకటి కట్టుకుని, వొకటి కప్పుకుని - వారి వేషం కటికి దారిద్ర్యానికి సూచకంగావుందే;  కాని అసహ్యంగా లేదు రాజేంద్రా?"
     "ఎందుకూ?" అనుకుంటూనే "వికారరూపులా?" అన్నాడు మహారాజు.
     రంగనాయిక మొదట కొంచెం సిగ్గుపడింది.  అంతకంటే యెక్కువగా సంకోచపడింది;  కాని తరవాత నిదానంగా చూస్తూ "చాలా చక్కనివారు మహాప్రభూ! వారి మొగమ్మీద బ్రహ్మవర్చస్సు తాండవం చేస్తోంది.  తగిన వేషం వుంటే మన్మధుణ్ణి మించి వుంటారు వారు నిశ్చయంగా" అని చెప్పేసింది.
     ఇదంతా మహారాజుకి కట్టుకథగా కనపడింది.  దీనిమీద సాలోచనగా పక్కకి చూశాడు;  రంగనాయిక వర్ణన వొక బ్రాహ్మణ యువకుడుగా రూపొంది యెదట నుంచున్నట్టు కనపడింది.  "ఒక్క యెత్తుకి సెలవిప్పించండి" అని దోసిలివొగ్గి కోరుతూ వున్నట్టుకూడా అనిపించింది.
     దాంతో వుత్సాహం రేకెత్తింది.  మనస్సు తేరుకుంది.  అంతా అర్థంఅయింది.  కర్తవ్యం తేలిపోయింది.  వెంటనే "సరేపద" అంటూ గదిలోకి వెళ్ళిపోగా, మెట్లదగ్గిర వున్న పరిచారిక కిందకి బయలు దేరింది.
నాటి సాయంత్రం శ్రీదాట్ల అప్పలనరసింహరాజు లోగిట్లో ఆట యేర్పాటయింది.  ఎత్తువెయ్యడానికి, భీమవరపుకోట నుంచి, శ్రీవత్సవాయి విజయరామరాజు అంచెగుర్రాల మీద వచ్చి వున్నాడు.
      అప్పల నరసింహరా జెప్పుడూ చదరంగంకేసి చూడడు.  దశావతారీ అంటే మాత్రం అతనికి నిద్రాహారా లక్కర్లేదు.  అందులో అతను సిద్ధహస్తుడు.  మహారాజుతో ఆదినారాయణం ఆడగల ముగ్గురిలోనూ అతను మొనగాడు.
     సొంతానికి, అతనెప్పుడూ చదరంగం ఆడకపోయినా, చక్కని దంతపుబలం మాత్రం వొకటి సంపాదించి వుంచాడు.  కోటకి వెళ్ళనిరోజున అతను ఒక వైపున దశావతారీలో కూచుని వుంటే, మరొకవైపున బంధువులో ఆశ్రితులో, మిత్రులో చదరంగం సాగిస్తూ వుంటారు.  
     మహారాజు దగ్గిరలాగే యేదోవొక ఆటలో సమర్ధులైన వారికేగాని సామాన్యులకు అతనిదగ్గిర ప్రవేశం కలగదు.
     విజయరామరాజు మహారాజుకి సన్నిహితుడు.  అప్పలనరసింహరాజుకి సయానా మేనల్లుడు.  పైగా అన్నగారి అల్లుడు.
     భోజనానంతరం అల్లుడు మామ లిద్దరూ నిద్రపోయి లేచాటప్పటికి, పెద్దపెద్ద ఆటకాళ్ళు చాలామంది వచ్చి కనిపెట్టుకుని వున్నారు.  విశాలమైన సావడి అంతా కిటకిట లాడి పోతోంది.  రాజుకి సలహాలు చెప్పడానికి మొనగాళ్ళందరూ ముందువరసలో కూచుని వున్నారు.
     పన్నెండేళ్ళ వయస్సుగల అప్పలనరసింహరాజు కొడుకు, వచ్చినవారి నందర్నీ చందనతాంబూలాలతో సత్కరించి,నౌకరు తెచ్చియివ్వగా దంతపుబలం చక్కగా సద్ది,  యింకా వచ్చేవారికి స్వాగతం నివేదించడానికి ద్వారంలో నుంచున్నాడు.
     నలుగురు మంగళ్ళు గోడల దగ్గిరగా చెదిరి నుంచుని విసనకర్రలు వేస్తున్నారు.
     సావడి అంతా పునుగు వత్తుల ధూమంతో గుబాళిస్తోంది.  చూసి వుండినవారు శంకరప్ప నేర్పు వుగ్గిడిస్తూ వుండగా చూడనివారు ఆప్యాయంగా ఆలకిస్తున్నారు.
     ఇలాంటి సమయంలో అప్పలనరసింహరాజు వచ్చి అందరికీ నమస్కారాలు చేశాడు.  సభ్యులందరూ వుబ్బెత్తుగా లేచి ఆనమస్కారా లందుకుని ఆశీర్వచనాలు కొందరూ,  ప్రతినమస్కారాలు కొందరూ చేశారు.
     ఇది అయ్యేటప్పటికి ముందొక రాచకుమారుడూ, తరవాత, విజయరామరాజూ వచ్చారు.  ఎరిగిన వారందరూ కుశలప్రశ్నాదికం చెయ్యగా, యెరగనివారు పరిచయభాగ్యం పొందారు.
     చివరికి యెవరి నిర్దిష్టమైనచోట వారు కూచున్నారు.
     అల్లుడి యింగితం కనిపెట్టి,  అప్పల నరసింహరాజు, ద్వారంలోవున్న కొడుక్కేసి చూశాడు.  ఆరాచబిడ్డ వెంటనే వసారాగదిలోకివెళ్ళి శంకరప్పనీ, శాస్త్రియాజులు గార్లనూ తీసుకువచ్చాడు.
     నమస్కార నివేదనలతోటీ, స్వాగతవచనాలతోటీ సావడి అంతా ముఖరిత మయిపోయింది.  శంకరప్పని రెండుచేతులూ పట్టుకుని కొందరూ, కౌగిలించుకుని కొందరూ, ప్రీతివిస్రంభాలు వెల్లడించారు.
     సావడి అంతా నిండుగానే వుంది;  కాని బల్లకీ దక్షిణ ద్వారానికీ మధ్య యేడెనమండుగురు కూచోతగినంత స్థలం కాళీగా వుంది.  అప్పలనరసింహరాజు  శంకరప్పకి ఆస్థలం చూపిస్తూ "అందరూ దయచెయ్యండి" అన్నాడు.
     అందరూ కూచున్నారు.
     "నాకింత చోటెందుకూ?" అని సంకోచిస్తూనే శంకరప్ప కూడా కూచున్నాడు.
మిత్రు లతని వెనక కూచోబోయారు;  కాని అప్పలనరసింహరాజు  "తమ రిద్దరూ యిలా దయచెయ్యండి" అని పిలిచి బల్లకి పశ్చిమంగా తన దగ్గిర కూచోపెట్టుకున్నాడు.
     శంకరప్పకి అనుమానం హెచ్చింది.
     "వారిని ఏకాకిని చెయ్యాలనా? మా సలహా అందకుండా చేద్దామనా? అయితే, యిదివరకి మహావుండిందా? ఇప్పుడు లేకపోతుందని బెంగా" అని శాస్త్రీ యాజులు కిందా మీదా పడ్డారు.  
     మొనగాళ్లు "ఇక ప్రారంభిచగూడదూ?" అన్నట్టు చూడగా  అప్పల నరసింహరాజు "అందరికీ చందనచర్చ అయిందా? బాబూ! అని అడిగాడు.
     దానికి, కొడుకు "అందరికీ అయింది.  కాని శంకరప్పగారికీ, శాస్త్రిగారికీ, యాజులుగారికీ మాత్రం తరవాయి.  వారినీ యిప్పుడే సేవించుకుంటాను" అని చెబుతూ శాస్త్రి యాజులు గార్ల యెదటికి వెళ్ళి నుంచున్నాడు.  గంధపుగిన్నె పట్టుకుని ఒక నౌకరతణ్ణి వెంబడించాడు.
     ఇది యిలా జరుగుతూ వుండగా, దక్షిణ ద్వారంలోనుంచి ముందొక ప్రౌఢ వచ్చింది.  తరవాత ఒక మధ్య వచ్చింది.  ఆమె వెనక ఒక ముగ్ధకూడా వచ్చింది.  వస్తూనే వొక్కక్కరే, అందరికీ నమస్కరించి నుంచున్నారు.
     ఒక నౌకరు ప్రౌఢచేతికి బంగారపు గంధపుగిన్నె అందించాడు.  ఇంకొక నౌకరు మధ్యచేతికి వెండి తాంబూలపు పళ్ళెం అందించాడు.  మరో నౌకరు ముగ్ధచేతికి నెమలిరెక్కల వట్టివేళ్ళ విసనకర్ర అందించాడు.
     శంకరప్ప అతి గంభీరంగా శిరకంపం చెయ్యగా శాస్త్రీ యాజులూ మొగ మొగాలూ, చూసుకున్నారు.
     తరవాత అప్పల నరసింహరాజు మందహాసం చేశాటు.  విజయరామరాజు కన్ను గీటాడు. 
 వెంటనే శంకరప్పకి కుడివైపు కూచుని, ప్రౌఢ, గంధపుగిన్నెలో చెయ్యపెట్టింది.  ఎడమవైపున కూచుని ముగ్ధ తమలపు చిలకలు చుట్టసాగింది.  వెనకవైపున ముందు ముంగాళ్ళమీద కూచుని శంకరప్ప కప్పుకున్న అంగాస్త్రం మెల్లిగా తీసి, తరవాత సరిగా కూచుని విసనకర్ర అందుకుంది ముగ్ధ.
     శంకరప్ప ప్రౌఢకేసీ, మధ్యకేసీ అతిగంభీరంగా చూశాడు.  అతని మొగంమ్మీద చిరునవ్వు తళుక్కుమంది.  తరవాత అప్పల నరసింహరాజు కేసి చూస్తూ "ఇవాళ శంకరప్పకి అగ్ని పరీక్ష అన్నమాట.  ఉచితంగానే వుంది.  రాజాస్థానాల్లోకి వచ్చి గారడీ చేస్తామంటే సాధ్యపడుతుందా మరి? కాని, ప్రభూ! గోచిపాతరాయడికా అప్సరసల చందనచర్చ?" అని అడిగాడు.
     "తమకి పరీక్షా? అందులోనూ అగ్ని పరీక్షా? ఎంతమాట సెలవిప్పించారూ? తమర్ని పరీక్షించడాని కెవరికి తాహతుందీ? ఇంతకీ: తాము సాక్షాత్తూ ఆశ్రీశుకుల అవతారం గదా?" అని చమత్కరించాడు అప్పల నరసింహరాజు.
     "తథాస్తు" అంటూ అందుకుని "తమ అయోఘశభ చింతనం నన్ను తప్పకుండా వొడ్డెక్కిస్తుంది; కాని తాహతు లేదే?  ఈవిలాసాల మాధుర్యం చవిచూడగల యోగ్యత కూడా లేదే అనే విచారం తప్ప నాకు మరేబెంగాలేదు.  సకలానికీ నాకు ఆ పినాకపాణే వున్నాడు" అని చెప్పి, మహా మేరువులాగా సుస్థిరుడై ప్రౌఢకి, దర్జాగా కుడిచెయ్యి అందించాడు శంకరప్ప.
     "ఇందులో యేదో కిటుకుందని తమ రనుకోవద్దు.  ఆయువతులకు ముగ్గురికీ చదరంగంలో తగినంత నేర్పుంది.  పది పదిహేను రోజులుగా తమరీ పట్నంలో ప్రకటిస్తూ వుండిన చాతుర్యం విని ముగ్ధలై, తమర్నీ, తమ చాతుర్యాన్నీ ప్రత్యక్షంగా చూడదలచి ప్రార్ధించారు.  ఇందులో దోషమేమీ లేదని మామయ్యగా రంగీక రించారు.  ఇక తరవాయి సంగతి.  ఈ ముగ్గురూ కళావతులు, సకలవిధాలా యీవూరి వేశ్యలలో యెన్నికయినవారు.  తమర్ని సేవించుకోడానికింత కంటే మంచిమార్గం కనపడలేదు.  నేనే యిది పురమాయించాను.  ఇది భక్తి ప్రపత్తుల ఫలితమే కాని మరొకటి కాదు.  కనక తమరు మరొకవిధంగా భావించవద్దు" అని విజయరామరాజు కూడా చాలాచాలా చెప్పాడు;  కాని, శంకరప్ప నమ్మలేదు.  
     శాస్త్రీ యాజులూ "ఇది శంకరప్పగారి ఏకాగ్రత భంగపరచడానికే" అని దృఢంగా నమ్మారు.
     ఈనమ్మకమే శంకరప్ప చూపుల్లో వారికి కనబడింది.  ఆచూపుల్లో "మీరు బెంగ పెట్టుకో నక్కరలేదు" అని ధీమా కూడా కనపడి వారు స్తిమిత పడ్డారు.
     ప్రౌఢ గంధం తీసింది.
     అసలే వెన్నకంటే మృదువయిన చందనం.  అంతకంటే మృదువయిన వేశ్య చేతిలో అది సంస్కారం పొందింది.  అందులో మల్లె అత్తరు కూడ కలిసింది.  దీనికి సాయం ఆ ప్రౌఢ,  ముందు తాను కరిగిపోయి అతణ్ణి కరిగించి వెయ్యాలన్న ప్రీతితో అలదింది.
     కాని, అంతా వ్యర్థం.
     శంకరప్పలో వికారం యేమీ కనపడలేదు.  అతనికి గంధం పూస్తున్నంతసేపూ ఆమె "లక్కబొమ్మకి పూస్తున్నానా?" అని సిగ్గుపడుతూనే వుంది ఆమె.
     అవతల మధ్యకూడా వొక్కక్క చిలకే అందిస్తూరాగా,  ముగ్ధ వొక పక్కకివచ్చి విసరసాగింది.
     "ఇక ప్రారంభిద్దామా?" అంటూనే విజయరామరాజు మూడెత్తులు వేశాడు.
     "చిత్తం" అని శంకరప్ప వొకమాటు మిత్రుల కేసీ, వొకమాటు పైకీ చూసి, తనబలంలో మంత్రీ వొక శకటూ తీసి బరిణెలో పడేసి, తానున్నూ మూడెత్తులు వేశాడు.
     అది చూసి అందరూ చకితు లయిపోయారు.
     "అదేమీ?" అనా లనుకునిన్నీ అప్పలనరసింహరాజు నీరవుడయిపోయాడు.
     "మొదటి యెత్తులోనే మన లోకువ కనిపెట్టేశారా యేమిటి శంకరప్పగారూ?" అని విజయరామరాజు అధైర్యపడ్డాడు.
     "ఏమిటీ యీసాహసం?" అన్నట్టు సలహాదార్లు మిడుతూ మిడుతూ చూసుకున్నారు.
     శాస్త్రీ యాజులూ కూడా మొగమొగాలు చూసుకోక పోలేదు;  కాని వారి కేమాత్రమూ అపజయశంక కలగ లేదు.  "ఒక గుర్రమూ వొక యేనుగూ తీసేసుకున్నా వారిని గెలవగల మొనగాడెవడోయ్!" అన్నట్టున్నాయు వారిచూపులు.
     శంకరప్ప మనస్సు కలిచేసి ఆట పాడుచెయ్యాలని వచ్చిన రప్పించబడ్డ వేశ్యలు తామే విభ్రాంతిపొంది బొమ్మలయి పోయారు.
     కొంతసేపటి కందరూ ప్రకృతిలో పడ్డారు.
     మొదట మనోవేగంతో సాగి, తరవాత వాయువేగంలోకి మారి, పిమ్మట ప్రవాహవేగంలోకి దిగి, కొంతసేపటికి తాబేటి నడకలోపడి, మొత్తం వొక్కగడియ గడిచాటప్పటికి చెరువు నీటిలాగ స్తంభించిపోయింది ఆట.
     అది రాజు వంతు.
     ఆలోచన తోచదు.  దారి కనపడదు.  చెయ్యి ఆడదు.  ఎత్తు పడదు.
     ఇలాంటిస్థితి సంభవించేటప్పటికి శంకరప్పకే వంతు వచ్చే టట్టు చెయ్యాలని రాజెంతో వుబలాటపడ్డాడు.  చాలా శ్రద్ధ వహించాడు.  ఎంతో ప్రయత్నంచాడు.  రణపెంకి రాకడలు వచ్చాడు.  ఒక యెత్తు బుకాయించడానికి సిద్ధపడ్డాడు;  కాని యింత చేసినా చివరికి తానే ఆస్థితిలో పడిపోయాడు.
     మొదట కలిగిన అధైర్యానికీ ఆశాభంగం తోడయు అతణ్ణి దిగతీసింది.
     మొదట, రాజూ సలహాదార్లూ కొంతసేపు అదేపనిగా బలంకేసి, చూశారు.  తరవాత వుండి వుండి చూశారు.  చివరికి బల్లవిడిచిపెట్టేసి పైకీ - కిందకీ - ఆపక్కకీ - యీపక్కకీ - అయిమూలలకీ చూడసాగారు.
     పెదవులు కొరుక్కోవడం, నిట్టూర్పులు విడవడం, కళ్ళు మూసుకోడం, వొకమాటు కుడిచేతిమీదికీ, వొకమాటు యెడమ చేతిమీదికీ వాలడం, మరోమాటు యెడమచెయ్యి వెనక్కి ఆనుకుని కుడిచెయ్యి కుడి మోకాలిమీదికి చాపుకోడం, కొంతసేపటికి నడ్డిలాగి, చేరబడదా మని వెనక్కి వాలి, యెవరిదో చెయ్యో కాలో తలో తగలగా వులిక్కిపడి సరిగా కూచోడం, మధ్య మధ్య మించిపోయినట్టు గభీమని ముందుకి వంగి బలం పరకాయించడం, కాని దారీ తెన్నూ కనపడక, తోచక మళ్ళీ మొదటికిరావడం - ఈస్థితికిన్నీ వచ్చేశారు.
     శంకరప్పకి మాత్రం నిశ్చింత.
     కాస్త నిదానమైనవాడితో యెప్పుడాడినా తనకి వంతు రాక అతనిలాగ కూచుంటూ వుండడమే పరిపాటి.  తన యింటో అయితే, ఆట అలాగేవుంచి యెదటివాళ్ళు పిలిచేదాకా యింటిపనులు చేసుకుంటూ వుంటాడు.  ఏ శాకుంతలమో, యేకాదంబరో, యేవుద్యోగ పర్వమో చూస్తూ అయినా వుంటాడు.
     మరి యిక్కడ?
     తన మిత్రులా, దూరంగా వుండిపోయారు.  దగ్గిరగానే యెదటి వరసలో కూచుని వున్నవారా, యీ ప్రపంచంలో లేరు. మరేమిటి చెయ్యడం?
     అతనికీ జిజ్ఞాస కలిగి, యాదాలాభంగా అటూఇటూ చూశాటప్పటికి, మనస్సు గుబగుబ లాడిపోయేటట్టు పదునైన చూపులు విసిరింది ప్రౌఢ; కాని ఆ చూపులు కళ్ళల్లోనే లీనం చేసుకుని గంధపు గిన్నె కేసి చూశాడు శంకరప్ప.
     ప్రౌఢ కనక గ్రహించేసి, బెల్లింపు చూపులు పరుపుతూ మళ్ళీ చందనచర్చకి పూనుకుందామె.
     ఆమె కుడిచెయ్యి అందిస్తూ మిత్రులకేసి చూసి శంకరప్ప మందహాసం చేశాడు.
     ఆ చూపులో "గిన్నెలోనా, కావలసినంత గంధం వుంది.  అలదడానికా, అప్సరస వుంది.  తీరుబడా, కావలసినంత.  "ఏం తప్పా?" అన్నభావం మెరిసి ఆ మిత్రులను ముగ్ధులను చేసేసింది.
     తరవాత శంకరప్ప అటు తిరిగి పళ్ళెం కేసి చూశాడు.సత్యవరపు కవటాకులు పళ్ళెం నిండా వున్నాయి.  మధ్య కళ్ళల్లోకి చురుక్కున చూశాడు.  ఆచూపులకు భరించలేక మొగం వాలిపోయింది;  కాని, ఆమె చేతులకు మాత్రం చురుకు వచ్చింది.  
     ఇదంతా చూసి, తన గుండెలికి అపాయం రాకుండా ముందే జాగ్రత్తపడింది ముగ్ధ.
     అప్పలనరసింహరాజు "దశావతారీ వేస్తారా యీపక్కని?" అని అడిగాడు, దానికి శంకరప్ప "ఇది తేలి వొడ్డెక్కితే అంతేచాలు మహాప్రభూ!" అని మందహాసం చేశాడు.
     ఈ చందనచర్చా, యీ మాటా విజయరామరాజుని తట్టిలేపాయి.  సలహాదార్లకు కశాఘాతా లయినాయి.
     వెంటనే ఎక్కడలేని తొందరా పుట్టి అందరూ బల్లమీదికి వంగారు.
     రాజు కొక యెత్తు కనపడింది.  అది పాతదేగాని, యీ అడావుడిలో అదే తారకంలాగ తోచింది.  చివరికేమయినా అది శంకరప్పని ఒక వూపువుపకపోదని సలహాదార్లు భావించారు.
     వెంటనే రాజు ఆయెత్తు వేసి తేరి చూశాడు.  సలహాదార్లుకూడా "దీని కేం చెబుతా?" వన్నట్టు బిర్రుగా చూశారు.
     శంకరప్పకి నవ్వు వచ్చింది;  కాని దాన్ని అధరంలోనే విశ్రమింపజేసుకుని మొదట ప్రౌఢకేసీ, తరవాత మధ్యకేసీ, చివరికి మిత్రులకేసీ, చూసి అతను మూడోవరస ఆరోగదిలో వున్న బంటుని మెల్లిగా ముందుకి గెంటి, ఏమీ ఎరగనట్టు మధ్యకేసి చెయ్యిచాపాడు.
     అందరికీ గుండెలు ఠు --- వ్వు మన్నాయి.
     చూడగా తెరిచి రాజు.
     కంగారుపడి, ఎవరి సలహా కూడా పుచ్చుకోకుండానే రాజు తన రాజుని వొక్కగది పక్కకి వేశాడు.
     వెంటనే శంకరప్ప గుర్రాన్ని ముందుకివేసి, మిత్రులకు చిరునవ్వు అందిస్తూ చేతులు దులుపుకున్నాడు.  
     అది చూసి, శాస్త్రీ యాజులూ ఔడుకరిచి శిరకంపం చేశాడు.
     ప్రౌఢకేసి చూస్తూ మధ్య కన్ను గీటింది.
     అప్పలనరసింహరాజుకేసి చూస్తూ ప్రౌఢ పెదవి విరిచింది.  లక్షణంగా కూచుని వున్న ముగ్ధ నిలువునా లేచి నుంచుంది.
     శంకరప్పకేసి చూస్తూ విజయరామరాజు రెండుచేతులూ జోడించుకున్నాడు.
     బారు మంటే కాని తృప్తి పడని సలహాదా రొకడు "వేసి రాజూ ఆట కట్టూను" అంటూ బిక్కమొగం వేసి చేతులు తేలవేసుకున్నాడు.
ఆమాటా యీమాటా చెప్పుకుంటూ అందరూ నట్టి వాకిట్లోకి వచ్చారు.
     అప్పటికి నాలుగ్ఘళ్ళ పొద్దు మాత్రమే వుండడంవల్లా, యెండ తగ్గి పొద్దుకూడా భవంతి చాటుకి వెళ్ళిపోయి వుండడం వల్లా వాకలంతా విలక్షణకాంతి తో ముచ్చటగా వుంది.
     ఏమి టేమిటో ప్రస్తావనలు రావడంలో హఠాత్తుగా స్ఫరించగా, అప్పలనరసింహరాజు "తమరొక్కమాటు మహారాజులుంగారితో ఆడాలండీ" అని మహోత్సాహంతో శంకరప్పని ప్రోత్సహించాడు.
     "హర హరా! నేనెక్కడ మహారాజులుంగా రెక్కడ మహాప్రభూ వారి పట్నానికి రావడమే నేను మహాపరాధంగా భావించుకోవలసివుండగా ---"
     "అలా కాదండీ? మహారాజులుంగారితో ఆడతగ్గవారు తమరొక్కరే.  అలాగే తమతో ఆడతగ్గవారున్ను మహారాజులుంగారొక్కరే.  ఏమంటావోయ్?"
     అప్పలనరసింహరా జిలా అడగ్గా "తప్పకుండానూ" అని విజయరామరా జందుకున్నాడు.
     "తగిన వుజ్జీ దొరక్క, చదరంగం ఆట కోసం మహారాజులుంగారు మొగం వాచిపోయి వున్నారు.  రోజూ సన్నిహితులతో యెత్తులు వేస్తూనే వుంటారు గాని, వారికి తృప్తి లేదు.  మొత్తానికి వారిదివరలో కొన్ని వందలమందితో ఆడివుంటారు;  అయినా యింత పకడైన నడకా, యింత అసాధ్యపు రాకడలూ చూసి అయినా వుండరు.  కనక మామయ్యగారు సెలవిప్పించినట్టు తమరు మహారాజులుంగారితో తప్పకుండా ఆడాలి."
     "నాయెడల తమకి హఠాత్తుగా కలిగిన ఆదరం అలా అనిపిస్తోంది.  వెర్రివాడిచేతి రాయిలాగ యివాళ నా యెత్తులు పొంకంగా వున్నాయేమో గాని, అన్నప్పుడూ యిలా ఆడడం నా తరమా? అదీకాక; ఆటలో కూచుని వోడిపోతే వచ్చినవాడి తలకొట్టించి ---"
     "కీడెంచి మేలెంచాలి.  గత్వాగత్వా మహారాజే వోడిపోతే?"
     తలపంకిస్తూ అప్పలనరసింహరా జిలా అడగ్గా "అదీ మాట" అంటూ విజయరామరాజు మళ్లీ అందుకున్నాడు.
     "కనక మహారాజులుంగారి శపథం అసమగ్రం.  నిజానికి, అయినవాడూ కానివాడూ వచ్చి ఆట రసాభాసు చేసి వెళ్ళిపోకుండా వుండడానికే అది వుద్దేశించబడి వుంటుంది;   కాని, తమవంటి నిపుణులను బాధించడానిక్కాడు.  ఎలాంటి వాడూ కూడా అసహాయశూరుడైన శత్రువు వొడిపోయినా మెచ్చుకుంటాడు గదా!  యిక మహారాజులుంగారి ఔచిత్యమా మనం సందేహించవలసింది?  పోని, తమరే వోడిపోతారనుకుందాం, అయితే, తమ వింతపోకడలు గమనించవద్దూ  వాటికి విలువ యివ్వవద్దూ?"
     దీనిమీద వొక సలహాదారు గభీమని ముందుకి వచ్చి "తమరు సెలవిప్పించింది బాగుంది.  ఆటలో కూచున్నాక జయం యెవరికో వొకరికే; కాని శంకరప్పగారి యెత్తులవంటి యెత్తులు మన మెప్పుడయినా చూశామా, విన్నామా? వారికి కంగారు ఏకోశంలో అయినా వుందా?  నానవేత అయినా వుందా ఈచాతుర్యం మహారాజులుంగారిని నిర్విణ్ణులను చేసెయ్యదూ? కనక, ప్రభూ! ఈవిషయమై తమ రుభయులూ తప్పకుండా పూనుకోవాలి.  మహారాజులుంగారితో ఆడకుండా మనం శంకరప్పగారిని కదలనివ్వకూడదు" అంటూ మూతి బిడాయించుకున్నాడు.
     "కదలనివ్వడమా? అదేమిటి, తమరలా సెలవిప్పిస్తారేమిటి జగన్నాధశాస్త్రులవారూ? శంకరప్పగారు మహారాజులుంగారితో ఆడనివ్వండి ఆడకపోనివ్వండి.  ఆడి గెలవనివ్వండి, వోడిపోనివ్వండి.  ఏమయినా పెద్దాపురం దాటి వొక్క అడుగయినా కదలనివ్వను నేను"  
     "ఇంత ఆదరం కనపరుస్తూవున్న తమర్ని కాదని అవతల నేను బాముకునే దేమీ లేదు;  కాని వున్నదల్లా యేమిటంటే? మహారాజులుంగారిని తలచుకుంటేనే ---"
     శంకరప్ప జలదరంపు నటించాడు. 
     "అలా కాదు.  తమరు మా మనవి చిత్తగించక తప్పదు.  మొదటొక్కఆటకే యేర్పాటు చేసుకుందాం.  మామయ్యగారు సర్వమూ అనుకూలంగా యేర్పాటు చేయిస్తారు."
    "తమకి భయం వద్దు శంకరప్పగారూ! తమ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు" 
     ఇలా అంటూ అప్పలనరసింహరాజు శంకరప్ప రెండుచేతులూ పట్టుకున్నాడు.
     ఇక్కడ యిలా జరుగుతూ వుండగా, అక్కడ ద్వారంలో ఠాణేదారు ప్రత్యక్షమయినాడు.
     మెల్లిగా లోపలికివచ్చి ముందు అతను అప్పలనరసింహరాజుని పలకరించాడు.  "ఎప్పుడు దయచేశారు?" అని తరవాత విజయరామరాజునూ పలకరించి, కొందరు సవినయంగా కుశల ప్రశ్న చెయ్యగా వెన్ను విరుచుకుంటూ జవాబు చెప్పాడు.  చివరికి శంకరప్ప కేసి తిరిగి "నమస్కారం" అన్నాడు.  
     శంకరప్పకి మొదట వొళ్ళు మండిపోయింది;  కాని, అక్కడి మహాజనుల సాన్నిధ్యం వెంటనే దాన్ని చల్లార్చి వేసింది.  అయినా అతని మొగం కరకర లాడుతూనే వుంది.  కళ్ళు నిప్పులు కక్కుతూనే వున్నాయి.
     కాని, రాజులిద్దరూ తనకేసి చూస్తూవుండడం గమనించి, బాగుందనీ, పైగా మోటతనం అనిపించుకుంటుందనీ భావించి అతి పెంకితనంగా తలమాత్రం వూపి ఆ నమస్కారం అందుకున్నా డతను.
     రాజు లాశ్చర్య చకితు లయినారు.  వినయమూర్తి అయిన శంకరప్ప దగ్గిర యింత పెంకితనం వుంటుందని వారెప్పుడూ అనుకోలేదు.  "ఇది పగా, వైరస్యమా?" అని ఆలోచన ప్రారంభించారు.  కాని, వారెరిగివున్నంతవర కీ రెండింటికీ కారణాలు లేవు.
     అందుకు ఠాణేదా రగ్గయిపోయాడు;  కాని యేమిచెయ్యగలడూ? నిప్పున్నకర్ర అతను.  లోపల్లోపల రవిలి బుగ్గయిపోవడం తప్ప వేరే గతిలేదు;  కాని, అందరు పెద్దమనుష్యుల యెదట శంకరప్ప అలాగ ప్రవర్తించడం తనకే లాభం అనుకున్నాడు.  దీన్ని మనస్సులో పెట్టుకుని యెంతపనయినా చెయ్యవచ్చు ననుకున్నాడు.
     ఈవుద్దేశం తో శాంతించి, యేమీ యెరగనట్టు నటిస్తూ "రాత్రి భోజనం చేశాక వొకమాటు దర్శనానికి రమ్మని దివాన్జీవారి సెలవయింది" అని చెప్పాడు.  
     అతని ధోరణికిన్నీ రాజు లాశ్ఛర్య చకితులయినారు.  వారి కనుబొమ్మలు ముడిపడ్డాయి.
     అది గ్రహించి, ధైర్యం తెచ్చుకుని "నాకవసరంలేదు.  నేను - ర్ - రాను" అని దురుసుగా జవాబుచెప్పాడు శంకరప్ప.
     అప్పుడున్నూ శాంతివహించి ఠాణేదారు "సరే" అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పి, రాజుల దగ్గిర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.
     అందరూ వొక్కమాటే అన్నారు.  "అయితే యేదో గొడవ వున్నట్టుందే" అన్న అప్పలనరసింహరాజు మాట శంకరప్పని ఆకర్షించింది.
     "చిత్తం చిత్తం వుంది.  పెద్దగొడవే వుంది"
     "రహస్యమా?"
     "ప్రస్తుతం రహస్యమే.  ఇప్పుడింతకంటే నన్నేమీ అడగవద్దని ప్రార్థిస్తున్నాను.  కొద్దిరోజులు వోపిక పట్టించండి.  జరిగిందంతా సావకాశంగానూ, పూర్తిగానూ మనవి చేసుకుంటాను.  ఏమీ తరవాయి అట్టేపెట్టను.  తమతో మనవి చేసుకోకుండా యిక్కణ్ణుంచి కదలనే కదలను"
     తరవాత మరొక అరగడియ విషయాంతర ప్రస్తావన జరిగింది.  అందరి అభిలాషా గమనించి "మళ్ళీ రేపుదయం వొకమాటు దయచెయ్యాలి" అని కోరుతూ శంకరప్పని లాలకీ మీద బసకి పంపేసి, అందరికీ సెలవున్నూ యిచ్చి రాజులిద్దరూ గుర్రాలెక్కి కోటకి వెళ్ళిపోయారు.
     శంకరప్ప లాలకీ యెక్కబోయాటప్పుడు వేశ్యలు ముగ్గురూ ముందు పాదాభివందనం చేసి తరవాత నల్లకలువ దండలతో ముంచెత్తేశారు.
20
నాలుగ్ఘళ్ళ పొద్దెక్కింది.
     శాస్త్రీ యాజులూ వాకట్లో కూచునివున్నారు.  అప్పటిదాకా లోపల పెద్దమ్మతో మంతనం చేసిచేసి "కభురు వస్తుందా మనమే వెళ్ళడమా?" అని అడుగుతూ వచ్చి, శంకరప్ప, వారి కిద్దరికీ మధ్యగా కూచున్నాడు.  
     "కభురు కోసం చూడవద్దు.  మీరే వెళ్ళండి నాయనా! గొప్పవారితో పని.  ఏం శాస్త్రుల్లుబాబూ! మన మర్యాద మనం తక్కించుకోవడం మంచిదికాదూ?" అంటూ అతని వెనకనే వచ్చి యెదటి బల్లమీద కూచుంది పెద్దమ్మ.
     "మీరు చెప్పింది బాగానే వుంది.  అయితే, నిన్న సాయంత్రం లాలకీ మీద బసకి పంపించినవారు, ఇవాళ నౌకర్ని పంపయినా వర్తమానించకుండా వుంటారా?  ఇంకొక్క గడియ చూస్తే యేమి మించిపోతుందీ?"
     యాజులిది గట్టిగా బలపరిచాడు.
     "పోనీ, అలాగే చెయ్యండి" అంది పెద్దమ్మ
     ఈసమయంలో "పెద్దమ్మగారూ' అని మాట వినబడింది.
     "కభురు వచ్చింది" అన్నట్టు శాస్త్రి కన్ను గీటగా, "ఎవరువా" రని అడుగూతూ పెద్దమ్మ గుమ్మంలోకి వెళ్ళింది.  
     "నేను దాట్లవారి మనిషి నమ్మా?"
     "ఏమిటి పని?"
     "పెద్ద బాబయ్యా, భీమవరపుకోట నాన్నగారూ, సేనాధిపతిగారూ వచ్చారమ్మా"
     ఇది విని పెద్దమ్మ, యేకకాలంలోనే చకితురాలూ, నిర్విణ్ణురాలూ అయిపోయింది.  యువకులు ముగ్గురూ నట్టివాకట్లోకి వొక్క దూకు దూకారు.
     అప్పటికప్పుడే విజయలామరాజూ, అప్పలనరసింహరాజూ, దంతులూరి జగ్గరాజూ గుర్రాలు దిగి, కొంజా దాటి లోపలికి వచ్చారు.
     వెంటనే ముందు  విజయలామరాజూ శంకరప్పా కౌగిలించుకుని ప్రీతి నెరుపుకున్నారు.  తరవాత శంకరప్ప అంజలిబంధం పట్టుకుని,  అప్పలనరసింహరాజు, తన ఆదర గౌరవాలు ప్రకటించాడు.  జగ్గరాజూ శంకరప్పా వొక్కమాటే చేతులు మోడ్చుకున్నారు.  ఒక్కమాటే వొకరి చేతులొకరు పట్టుకుని మర్యాద చేసుకున్నారు.
     శాస్త్రీ యాజులుగార్లూ క్షత్రియులూ కూడా కుశల ప్రశ్నాదికం చేసుకున్నారు.
     తరవాత  అప్పలనరసింహరాజు "నిన్న సాయంత్రం, యీపూట కూడా ఆటకి మాయింటోనే అనుకున్నాం;  కాని మనమిప్పుడు కోటకి వెళ్ళాలి" అన్నాడు.
     దాని మీద జగ్గరాజు అందుకుని "మహారాజులుంగారు తమతో చదరంగం ఆడాలని అభిలషిస్తున్నారు.  అందుకోసం తమదర్శనం కోరుతున్నారు.  తమరాక నిరీక్షిస్తూ, తమకోసం పాలకీ, పరివారమూ పంపారు;  కనక తమరు దయచెయ్యవలసిం దని నా ప్రార్థన" అని విన్నవించాడు.
     "ఏమి సెలవిప్పించారు ప్రభూ!" అంటూ శంకరప్ప మొదట ఆశ్చర్యం కనపరిచాడు.  "ఎంతమాటా! దీనికోసం ప్రభువులే దయచేయించాలా? కాకి చేత కభురు చేయిస్తే, మహారాజులుంగారి పాదాల దగ్గిర వాలకపోదునా? అని తరవాత వినయం చూపించాడు.  చివరకి అప్పలనరసింహరాజు కేసి తిరిగి, "సకలమూ నిన్న తమతో మనవి చేసుకునే వున్నాను;  కాని, తమరు నావిషయమై కొంచెమున్నూ యోచించలేదు.  నేను యథార్థం విన్నవించుకుంటుంన్నాను.  మహారాజులుంగారితో ఆట అంటే నాకిప్పటికీ గుండెలు తాళడం లేదు" అని బెదురు నటించాడు.
     "తమ కేమీ భయంవద్దు.  శంకరప్పగారూ! చివరికి గెలుపు యెవరిదయినా తమ యెత్తులకే సంతోషించి, ప్రభువు తమర్ని ఆదరిస్తారని నా సంపూర్ణ విశ్వాసం"
     "మాకెంత ధైర్యం లేకపోతే మేము మహారాజులుంగారితో విన్నవించుకో గలుగుతామూ? తమరిది యోచించారా? అని అడిగాడు విజయరామరాజు.
     శంకరప్ప యిలా నిరుత్సాహపడడం చూసి, శాస్త్రీ యాజులూ "ఈయనకీ కంగా రెప్పణ్ణుంచోయ్?" అన్నట్టు చూసుకున్నారు.
     అప్పుడు జగ్గరాజు ముందుకు వచ్చి,  "మరి దయచెయ్యండి' అని చెయ్యి పట్టుకున్నాడు.
     "ఇక తప్పదన్నమాట.  అయితే ప్రభూ! నన్ను చిత్తగించారా? నావేషమూ నావాలకమూ పరకాయించారా? ఈవేషంతో రాజదర్శనం చెయ్యడం అంటే నాకు కలిగే సిగ్గుమాట అలా వుండగా, మహారాజులుంగారిని అగౌరవ పరిచినట్టు కాదూ?"
     "ఆ సందేహం అక్కర్లేదు.  తమరిలాగే రావచ్చు"
     "నిండుకుండ, మహారాజులుంగారు తొణకకపోవచ్చు;  తమరు సద్ది చెప్పగలగనూవచ్చు; కాని, కొండంత లేసి ఠాఅేదార్లుంటారు.  ప్రభువు తరవాత అంతవారు దివాన్జీ లుంటారు.  చికిలీచేసిన కత్తులనుమించి వారి జవాన్లుంటారు.  దరిద్రుణ్ణనీ, పిచ్చివాణ్ణనీ, శనిగ్రహాన్ననీ ద్వారంలో అడుగు పెట్టాటప్పటికే వారు నామీద పడకుండా వుంటారా? నా యజ్ఞోపవీతాలు తెంపి, పోగులుపెట్టకుండా వుంటారా?"
     ఈమాట లనేటప్పుడు శంకరప్పలో కొంచెం ఆవేశం కనపడింది.
     ఇదివిని అప్పలనరసింహరాజూ, విజయరామరాజూ తెల్లపోయారు.  "ఇంత అమానుషం జరిగిందా?" అనుకుని శాస్త్రీ యాజులూ స్తబ్ధులయిపోయారు.
     "ఆ ముండాకొడుకులికి గడ్డి పెట్టించండి మహారాజా" అన్నట్టు పెదవులు కదుపుతూ తలుపు చాటునుంటి తొంగిచూసింది పెద్దమ్మ.
     ఒక్క క్షణం అందరూ నిశ్ఛలంగా వుండిపోయారు.
     తరవాత జగ్గరాజు చేతులు అప్రయత్నంగా దోయిలించుకున్నాయి.  "క్షమించమని కోరుతున్నాము" అని అతను నమ్రుడైనాడు.
     తలుపోరగా చూస్తూవుండిన పెద్దమ్మ "ఇక చాలు ఈపాటికి వొప్పుకో" అన్నట్టు గుమ్మాని కెదురుగా వచ్చినుంచోగా శంకరప్ప వెళ్ళి అమాంతంగా ఆమె పాదాల మీద వాలాడు.
     అటు కొడుకులాగ చూసుకుంటూ వున్న శంకరప్ప కిలాంటి గౌరవం జరగడం - అలాంటి శంకరప్ప అంతంతలేసి, పెద్దమనుష్యులు చూస్తూవుండగా ఇటు తనకి పాదాభివందనం చెయ్యడం - పెద్దమ్మకి ఆనందంతో వుక్కిరిబిక్కి రయింది.
     "పెద్దమ్మా, ఇదంతా నీఅనుగ్రహం.  గాలికి కొట్టుకు వచ్చిన పరదేశిని కొడుకుని చూసుకున్నట్టు చూశావు.  నాకీగౌరవం కలగడానికి కారణం నువ్వు.  ఏమి చేసిన్నీ నేను నీరుణం తీర్చుకోలేను"
     "అదంతా యిప్పుడు కాదు నాయనా!  తొందరగా వెళ్ళు తండ్రీ! ఆలస్యంచెయ్యడం మర్యాద కాదు బాబూ!"
     "భోజనాల వేళకి వస్తావా,  యిక ఫరవాలేదనుకో! లేదూ, నాతలకోటకొమ్మలికి వేలాడుతూ వుంటుంది, వొక్కమాటు చూడేం"
     ఇలా అని శంకరప్ప, మళ్ళీ పెద్దమ్మ పాదాలు స్పృశించి కళ్లకద్దుకున్నాడు.  "వెర్రితండ్రీ.  నీకా వోటమి! అధైర్యపడకు.  గుండె నిబ్బరం చేసుకో" అని చెబుతూ ఆమె అతని శిరసు మూర్కొని సెలవిచ్చింది.
     ఇద్దరికళ్లూ ఆనందభాష్పాలతో దొప్పదోగి పోయాయి.  పెద్దమ్మ తన పమిటి కొంగుతో ముందు శంకరప్ప కళ్ళు తుడిచి, తరవాత తన కళ్ళు తుడుచుకుంది.
     శాస్త్రికి, యాజులుకీ, శంకరప్ప పెద్దమ్మ కేమీ కాడని స్పష్టం అయింది;  కాని వారి తాత్కాలికానుబంధం గుర్తించి వారు చకితులయినారు  పెద్దమ్మ ఔదార్యానికి కూడా వారు ఆశ్చర్యపడ్డారు.  విజయరామరాజు చెయ్యిపట్టుకు తీసుకువెళ్ళగా "జయమహాదేవా" అనుకుంటూ శంకరప్ప వెండి అడ్డల పాలకీలో కూచున్నాడు.
     నిశానీవాడు వెంటనే ధ --- న్ను మని ఢంకా బజాయించాడు.  దండెలమీద చేతులు వేసుకుని సిద్ధంగా వున్న బోయీలు వెంటనే పాలకీ యెత్తగా రాజులు ముగ్గురూ గుర్రాలెక్కారు.
     "నేను పాలకీలో కూచోడం, మీరు రెండు పక్కలా నడిచి రావడం ---"  ఇలా అని చేతులు పిసుక్కుంటూ, శంకరప్ప చాలా యిదయిపోగా, మీరేమీ కించపడవద్దు.  మీరు మాకు గురువులు.  మీతరవాతే మాకు మహారాజులుంగారు.  మీకు చోపుదారులం కావడమే మాకు గొప్ప గౌరవం" అని నచ్చచెప్పి, శాస్త్రీ, యాజులూ, అతని విచారం పోగొట్టారు.  
     ప్రస్థానం మళుపు తిరిగే దాకా చూసి "పెద్దాపురం రాజ్యం పట్టాక నానాయనికి తప్ప యిలాంటి గౌరవం మరెవరికి జరిగిందీ?" అనుకుంటూ పరవశురా లయి పెద్దమ్మ కొంజా అరుగు మీద చతికిలపడగా, రామసోదెమ్మ బొమ్మ అయి అలాగే నిలిచిపోయింది.
పాలకీ కోటగుమ్మంలోకి వెళ్ళాటప్పటికి ఠాణేదారు వచ్చి, నమస్కారం చేసి, చేతులుకట్టుకుని వెంట బయలు దేరాడు.
     వంకదార ప్రవేశించాటప్పటికి కిల్లేదారు వచ్చి వీర నమస్కారం చేసి ముందు బయలుదేరాడు.  
     కచేరీ సావడిదగ్గిర శంకరప్ప అడుగు కింద పెట్టాటప్పటికి దివాన్జీవచ్చి "దయచెయించండి" అంటూ ఆహ్వానించాడు.
     సేనాధిపతికి వెనకా, అప్పలనరసింహరాజుకీ, విజయరామరాజుకీ మధ్యగాను వుండి ద్వారంలో అడుగు  పెట్టాటప్పటికి గదిలో, యెదట, మహారాజు నుంచుని వున్నారు.
     ఇద్దరిమొగాలూ ప్రఫుల్లపద్మా లయినాయి.  శంకరప్పకి, మహారాజు దగ్గిర, విష్ణ్వంశ ద్యోతకం అయింది.  మహారాజుకి శంకరప్ప దగ్గిర మహేశ్వరాంశ కనపడింది.
     పెద్దాపురం వచ్చినప్పణ్ణుంచీ అనేకులవల్ల దినచర్య సకృచ్ఛ్రంగా వింటూ వున్నాడు కనక, శంకరప్ప మహారాజునీ, రెండు రోజులనుంచీ గుణగతు లన్నీ అతిసూక్ష్మంగా తెలుసు కుంటుంన్నాడు కనక, మహారాజు శంకరప్పనీ చిరకాలంగా యెరిగి వుండిన ట్లనుకున్నారు.
     అప్పటికప్పుడే అంకురించిన యీఅనుబంధం తక్షణమే కొనలు సాగి వారి నిద్దర్నీ ఒకరికేసి ఒకర్ని ఆకర్షించింది.
     మహారాజు నమస్కారం చేశాడు.
     వేదోక్తంగా ఆశీర్వదిస్తూ నమ్రుడై దోసిలి వొగ్గి శంకరప్ప ఆ నమస్కారం అందుకున్నాడు.
     అప్పుడు మహారాజు ఇంగితం కనిపెట్టి, జగ్గరాజు బలం సద్దించడానికి మేడమీదికి వెళ్ళిపోయాడు.  
     తరవాత శంకరప్పకీ, అప్పలనరసింహరాజుకీ, విజయరామరాజుకీ మహారాజు తహజీమివ్వగా, మహారాజుకి వారున్నూ యిచ్చారు.  ఇది అయాక నలుగురూ యేకకాలం లో కూచున్నారు.
     భృత్యులతో సరిగా నుంచునివున్న దివాన్జీని చూసి శంకరప్ప మందహాసం చేశాడు.  ఆ మందహాసం లో వెటకారం వుండడం గుర్తించి, దివాన్జీ వుడికిపోయాడు.
     ఇది యిలా జరుగుతూవుండగా మహారాజందుకున్నాడు. 
     "తమకి శ్రమ యిచ్చాను.  తమరు మాపట్నంలోనే యిరవై రోజులుగా వీరవిహారం చేస్తూవుండినా, గుర్తించలేకపోయినందుకున్నూ సిగ్గుపడుతున్నాను"
     "తమరలా సెలవిప్పిస్తే నే నేం మనవి చేసుకోగలనూ?  సర్వవిధాలా నేను సామాన్యుణ్ణి.  పైగా పిచ్చివాణ్ణి.  ఎటుచూసినా జగత్ప్రభువుల సన్నిధికి రావడానికి నేను తగను.  అయినా తమప్రజ్ఞ మొదట పెనుగొండలో విన్నాను.  చూడాలని పేరాస పుట్టింది.  కందనోలిలో అది సహస్రగుణం అయిపోయింది.  తాహతు లేకపోవడం యెరిగి వుండిన్నీ యిక, ఆగలేక, అంచె పరుగులమీద పెద్దాపురం చేరుకున్నాను.  కాని --- "
     శంకరప్ప మాట తేల్చేశాడు.  
     ఆ అర్ధోక్తిలోనే మహారాజుకి, శంకరప్ప పొందిన పరాభవం అంతా స్ఫురించింది.
     వెంటనే, అకర్ణాంతాలైన మహారాజు నేత్రాలు దివాన్జీ మీద విషపుకోలలు నిగిడించాయి.
     అది చూసి కూడా శంకరప్ప "చాలు" అనుకుని తృప్తి పొందాడు.
తరవాత మహారాజు "ఇక మనం పైకివెడదాం" అంటూ అప్పలనరసింహరాజుకేసీ, విజయరామరాజుకేసీ ప్రసన్నంగా చూసి "దయచెయ్యండి" అని శంకరప్పని ఆహ్వానిస్తూ "మాచుట్టూ బలమైన వొకప్రాకారంవుంది.  అహితుల నెప్పుడూ దూరంగా వుంచే అలవాటుచొప్పున అది, వొక్కొక్కప్పుడు విహితులను కూడా దగ్గిరికి చేరనివ్వదు.  నిజానికి, అహితులను చేరనిస్తే ఎంతఅపాయమో విహితులను పారగొట్టినా అంత అపాయమే గాని, యెటుచూసినా అప్పుడప్పుడిది తప్పనిసరిగా కనపడుతోంది.  అయితే భీమవరపుకోట దాకా భూనభోంతరాళాలు దద్దరిల్లజేసిన ప్రజ్ఞ తమది.  దాని యెదట ఆప్రాకారం లెక్కేమిటి జమేమిటి" అన్నాడు.
     మాటముగిశాటప్పటికి అందరూ వసారాలోకి వచ్చారు.
     అక్కడవుండిపోయిన శాస్త్రీ, యాజులూ మహారాజును చూసి నమ్రులై చేతులు కట్టుకుని, పక్కకి వోసరిల్లారు.
     శంకరప్పవారిని చూసి తెల్లపోయాడు.  వారక్కడేవుండి పోయినందుకూ, ఆసంగతి తాను గుర్తించలేక పోయినందుకూ, చాలా పరితపిస్తూ నాలుక కరుచుకున్నారు.  తరవాత వారి దిక్కుగా సంఘటిల్లిన అంజలిబంధం మహారాజుకేసితిప్పి "జగత్ప్రభూ! ఒక్క మనవి.  ఏలినవారి ఆశ్రితకోటిలోచేరిన యీ మహానుభావులిద్దరూ నాకళ్ళకి రెప్పలు.  నాకళ్ళే అని కూడా చెప్పవచ్చు.  అకించనుడూ, అపరిచితూడూ అయిన శంకరప్పని పెద్దమ్మ కడుపులో పెట్టుకుని కాపాడగా, "పిచ్చివాడు" కాడని పెద్దాపురంలో మహామహు లందరిదగ్గిరా రుజువు చేసి వీరు నన్నీస్థితికి తీసుకువచ్చారు.  చూసుకున్న వేళా విశేషం యెలాంటిదోకాని, నిద్రలోతప్ప మేము ఒకరినివిడిచి వొకరం వుండలేని పరిస్థితుల్లో వున్నాం.  పైగా పెద్దాపురంలో వున్నంత కాలమూ నాకు వీరి అవలంబం కావలసికూడా వుంది.  వీరిని విడిచి వుండడం నాకు శ్రేయస్కరమూ కాదు.  కనక నాదగ్గిర కూచోడానికి సెలవిప్పించి, వీరిని సంతోషపెట్ట వలసిందని ప్రార్థన" అని కోరాడు.
     మహారాజు వారికేసి ప్రసన్నంగా చూశాడు. 
     శాస్త్రి "నేను కొంపెల్ల జగన్నాధభట్టు గారి కుమారుణ్ణి మహాప్రభూ!" అన్నాడు.
     "అలాగా? వారు దశావతారీలో నిధులు.  వారి చాతుర్యం నేను చాలామాట్లు చూశాను.  తమరు --- "
     "వీరు చదరంగంలో నిధులు మహాప్రభూ!" అన్నాడు శంకరప్ప మోడ్పుకేలితో నిర్దేశిస్తూ.
     "అతిశయోక్తి కంటేనూ యెక్కువమాట సెలవిచ్చారు శంకరప్పగారు - నాకు జంతువుల నడక మాత్రం తెలుసు మహాప్రభూ!" అని శాస్త్రి వినయం కనపరిచాడు.
     "చిత్తం, దయచెయ్యండి."
     "ఇతను చిలుకూరి గోవిందశాస్త్రిగారి కుమారుడు మహాప్రభూ!" అని శాస్త్రి యాజుల్ని పరిచయంచేశాడు.
     "గోవిందశాస్త్రిగారూ?" అంటూ మహారాజు అప్పల నరసిహ రాజు కేసి ప్రశ్నార్థకంగా చూశాడు.
     "వారు చాలామాట్లు తమదర్శనం చేసుకుని వుండినవారు.  ఒకమాటు తమ సత్కారమున్నూ గడించుకున్నారు వారు.  మక్తారూపాయలు తెచ్చుకుంటూ, యెరజర్ల వాకదగ్గిర దొంగలడ్డుకోగా లంకాదహనఘట్టం పురాణంచెప్పి వాళ్ళవల్ల బహుమతీలు పొంది --- "
     "ఓహో, వారా? పాతిక సంవత్సరాలనాటిమాట అది, జ్ఞాపకం వచ్చింది.  పెద్దబ్బాయి నామకరణ మహోత్సవసమయంలో కాదూ వారు కోటలో పురాణం చెప్పడం?"
     "చిత్తం చిత్తం.  అప్పుడే తమరు వెయ్యిన్నూటపదార్లూ, దుశ్శాలువలూ, పట్టుతాపితాలూ --- "
     "వారి చాతుర్యంముందు అవి యేపాటివీ? వారి పురాణ ధోరణి శ్రోతలకు వీరావేశం యెత్తించేది.  ప్రాస్తావికశ్లోకా లందుకున్నారంటే గవ్వల గుత్తిలాగ రాత్రీ పగలూ విరామం లేకుండా --- "
     "ఆవిషయంలో యితనూ అంతవాడే మహాప్రభూ!"
     "అలాగా? అయితే సావకాశంగా వొకమాటు --- " అని అందించి అప్పల నరసిహ రాజు కేసితిరిగి "సమయం కనిపెట్టి తమరు జ్ఞాపకం చెయ్యండి" అన్నాడు మహారాజు.
     "చిత్తం"
     "ఇవాళ తమ వుభయుల దర్శనమూ అయాచితంగానూ, అప్రయత్నంగానూ లభించింది, చాలా సంతోషం --- దయచెయ్యండి"
      ఇలా అని, మెట్లమీద మహారాజు ముందడుగు పెట్టాడు.  అతనివెనక జంటగా అప్పలనరసిహరాజూ, శంకరప్పా బయలు దేరారు.  వారిని విజయరామరాజు అనుసరించాడు.  శాస్త్రీ, యాజులూ పొంగిపోతూ అతని వెనక బయలుదేరారు.
అప్పటికప్పడే రంగనాయిక బలం సద్దివుంది.
     ఒకపక్షానికి కెంపులూ, వొక పక్షానికి పచ్చలూ పొదిగిన బంగారపు బలం అది.
     కెంపులబలం వేపున మహారాజు కూచోగా, పచ్చలబలం వేపున శంకరప్ప కూచున్నాడు.
     మహారాజుకి రెండుపక్కలా అప్పలనరసిహరాజూ, విజయరామరాజూ, జగ్గరాజూ కూచున్నారు.  శంకరప్ప రెండుపక్కలా శాస్త్రీ, యాజులూ ఆసీను లయినారు.
     మందపాటి సూరపరాజూ, దూర్వాసుల ఆదివరాహమూర్తీ, పాణంగిపల్లి వెంకటరాయడూ అర్హస్థలాల్లో కూచోగా మహారాజు వెనక యిద్దరూ, శంకరప్పవెనక యిద్దరూ వేశ్యలు నుంచుని ఆజ్ఞలకు నిరీక్షిస్తువుండినారు.
     "తమ" రంటే "తమ" రంటూ వొక నిమిషం మొదట మర్యాదలు జరిగాక, గంభీరంగాచూస్తూ ముందు మహారాజు యెత్తువెయ్యగా, మందహాసంచేస్తూ తరవాత శంకరప్ప అనుసరించాడు.
     అతి దురితంగా యెత్తులువేసే సూరపరాజూ, యెంతో నిదానించి గాని కాయకదపని విజయరామరాజూ, కాపుమీద కాపు వేసుకుని గాని యెత్తువెయ్యని ఆదివరాహమూర్తీ, యెత్తువేశాటప్పటికి తెరిచి రాజయేటట్టు, శకట్లూ, యేనుగులూ, దూరందూరంగా వుంచుకుంటూ యెంతసేపూ బంట్లకాపుదలమీద మంత్రినీ గుర్రాలనూ యెదటిబలంమీదికి వురికించే వేంకటరాయడూ కూడా వొకగడియ గడిచేదాకా ఆటపోకడ గమనించలేకపోయారు.
     నలుగూరూ తరుచు మహారాజుతో ఆడేవారే;  శంకరప్ప తోటిన్నీ ఆడివుండినవారే, కాని తమతో ఆడినప్పటికంటే వారికా యిద్దరి ఆటలోను యెంతో వైలక్షణ్యం కనపడించి.  ఆనడకే కొత్తగా తోచింది.
     కాకేమీ?
     సూచిభేద్యమైన గాఢాంధకారంలోనేకదా మెరుపుతీగల చకచకలు?  మదగజం తారసిల్లినప్పుడేకదా సింహప్పిల్ల శౌర్యోద్రేకం?
     దిగ్దంతుల ద్వంద్వయుద్ధం భయంకరమే.  అయినా ద్రష్టలకు దర్శనీయమే.  మరి ఆ దిగ్దంతులకు?
     మహారాజు అసాధ్యపు యెత్తులూ, శంకరప్ప పెంకిరాకడలూ దుర్గ్రాహ్యాలుగానే వుండినా ద్రష్టలకు వుల్లాసకరంగానే వున్నాయి.
     అయితే, మహారాజుకి మానహానిభయమూ, శంకరప్పకి ప్రాణహానిభీతిన్నీ.
     ఏమయినా యెత్తులమీదయెత్తులు పడిపోయాయి.  అసలే తాపీగా ప్రారంభంఅయినఆట నాలుగ్ఘడియలు గడిచేటప్పటికి "యెత్తుపడదేం?" అన్న స్థితికి వచ్చింది.
     మరెవరితో ఆడినా మహారాజుకి గువ్వపిట్టలవేటలా వుండేది.  శంకరప్పకి వోనమాలు దిద్దించడంగా కనపడేది;  కాని యిప్పుడు మహారాజుకి కొండ తాకినట్టుంది.  శంకరప్పకి బ్రహ్మవిద్యలో పడ్డట్టుంది.
     ఎత్తుపడ్డకొద్దీ వారికి కసిపెరిగింది.  కసి పెరిగినకొద్దీ యెత్తులు బిగిశాయి.
     దీంతో, ఒక్కొక్కయెత్తు వేసినప్పుడు, వారికి, వొక్కొక్క ప్రాణం వొడ్డుకున్నట్టు తోచసాగింది.
     మరో నాలుగ్ఘడియలు వెళ్ళిపోయాయి.
     మహారాజుకీ, శంకరప్పకీ మచ్చెమటలు పోశాయి.
     కంగారుపడి వేశ్యలు విసనకర్ర లందుకున్నారు.
      కాని, అప్పటికే ఆట స్తంభించిపోయింది. 
     చివరిమాటు, యెడమతర్జనితో మొగం తుడుచుకుని, శంకరప్ప, యెర్రగదిశకటు నొక్కి వేసి శాస్త్రికీ, యాజులుకీ చిరునవ్వు అందిస్తూ, వూపిరితీసుకుని నిటాగ్గా కూచున్నాడు. 
     మహారాజు కళ్ళు మిలమిల్లాడాయి.
     ద్రష్టలు మొగమొగాలు చూసుకున్నారు.
     రంగనాయిక వొక్క అడుగు వెనక్కివేసింది.
     ఇది గుర్తించినట్టుగా, వందిమాగధులు, మాధ్యాహ్నిక సమయ సూచికంగా కైవారాలకు అందుకున్నారు.
"నాతండ్రే? నా నాయనే? నాశంకరప్పే! ఇంటికివచ్చావా బాబూ! అగ్రహారం కొట్టుకు వచ్చావా?" అని పొంగిపోతూ కౌగిలించుకుందామని పెద్దమ్మ ముందుకి దూకింది;  కాని అంతకుముందే శంకరప్ప "పెద్దమ్మా!" అంటూ ఆమె యెదట సాష్టాంగపడి, మరి మాటరాక, చేష్టలుకూడా లేక, అలాగే వుండిపోయాడు.
     ఆదుర్దాపడుతూ పెద్దమ్మ శంకరప్పని లేవదియ్యబోతూ పక్కని కూచోగా శాస్త్రీ యాజులూ అతన్ని లేవదీసి పట్టుక్కూచున్నారు.
     ఇంతలో పచ్చ అక్షింతలూ యెర్ర అక్షింతలూ పట్టుకునచ్చి రామసోదెమ్మ విభ్రమవిలాసాలతో అతనికి దిష్టితీసింది.
     "నెగ్గేశాం పెద్దమ్మా" అంటూ పెద్దమ్మ రెండుచేతులూ పట్టుకుని ప్రారంభించాడు శంకరప్ప.
     "ప్రతిష్ట అడ్డు వచ్చింది;  కాని మహారాజు యివాళే తన వోటమి అంగీకరించి వుండును.  అయినా యిప్పుడు మనకి వచ్చిన లోటేమీలేదు.  ఆరుమాసాల కయినా ఆట కట్టిందని వొప్పుకోవలసిందే; కాని, మహారాజుకి మరో దారి లేదు.  అవునా శాస్త్రిగారూ? మీ రేమంటారు యాజులు గారూ?"
     "ఆట కట్టేపోయింది" అన్నాడు శాస్త్రి,  "ఆమాట ఒప్పుకోడానికే వాయిదా" అన్నాడు యాజులు.
     జరిగిందంతా అతిమధురంగా చెప్పాడు శంకరప్ప.
     శంకరప్పని కౌగిలించుకొని వొక్క క్షణం మాట్టాడలేకపోయింది పెద్దమ్మ.
     శాస్త్రినీ, యాజుల్నీ ఆపూట భోజనానికి ఆపేసింది.
     జాముప్రొద్దువేళ మళ్ళీ పాలకీ రాగా, ఒక్కమాటు ఏకాంతంగా గదిలోకి వెళ్ళివచ్చి మిత్రులతో కోటకి వెళ్ళాడు శంకరప్ప.  
     మామూలు మర్యాదలన్నీ జరిగాయి.  తరవాత అందరూ యధోచితంగా కూచున్నారు.
     రాజుకీ శంకరప్పకీ రంగనాయికా, తక్కినవారికి తక్కిన వేశ్యలూ తాంబూలా లందించారు.
     ఏమి టేమిటో కభుర్లు వెళ్ళాయి.  ఏమి టేమిటో సంగతులు వచ్చాయి.  చదరంగానికి బదులు లోకాభిరామాయణం ప్రారంభ మయింది.
     'చంద్రవదన అని మా వుళ్ళో వొక వేశ్య" అంటూ అందుకున్నాడు శంకరప్ప.
     "ఆమె మా నాయనగారి దగ్గిర కావ్యనాటకాలంకార గ్రంథాలు నాతో సరిగా క్షుణ్ణంగా చదివింది.  ప్రస్తుతం ఆమె మొగలితుర్రు ఆస్థానంలో మన్ననలు పొందుతోంది.  భ్రాతృప్రేమతో పెంచి నన్నామె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది"
     "సరసంగా వుంది.  అంచేతనే తమ యెత్తుల్లో యీ చాతుర్యం" అన్నాడు మహారాజు.
     రంగనాయికా, ఆమె సహచారిణులూ వుత్సాహంతో మొగమొగాలు చూసుకున్నారు.
     "కందనోలి నవాబుగారి వజీర్లలో వొకాయన యీఆటలో అఖండుడు.  వయసు కాలంలో సేనావిన్యాసంలో ఆయన అసాధ్యుడుగా వుండినాడనీ, ఈ వార్ధక్యంలో ఆ నేర్పంతా చదరంగం ఆటలో కనపడుతోందనీ కర్ణాకర్ణిగా విని, పనికట్టుకు వెళ్ళి, నెలరోజులు తంటాలుపడి ప్రవేశం సంపాదించాను.  మూడురోజులు యెన్నో పెంకిరాకడలు వచ్చా డాయన.  ప్రతియెత్తూ నన్ను మూడు చేరలనీళ్ళు తాగించింది"
     "దేశంలో యెంతెంతవారేనా వున్నారు.  అలాంటివారిని చూడాలంటే అదృష్టం వుండాలి.  అయితే తరవాత యేమి జరిగిందీ?"
     "నాలుగోనాడు బల్లదగ్గిర కూచోగానే కౌగలించుకుని, నా చెయ్యి ముద్దాడి ఆయన చేసిన బహుమతీ మహాప్రభూ యిది" ఇలా అని తన మొలలో గుప్తంగా వుండిన కటారి తీసి, మహారాజు దగ్గిరగా వుంచాడు శంకరప్ప.
     శాస్త్రీ, యాజులూ వులిక్కిపడి "ఇదివరకి మనకి చూపించారుకారు చూశావా?" అన్నట్టు చూసుకున్నారు.
     "ఎందరు వీరాధివీరుల కవోష్ణరక్తం చవిచూసిందో యిది.  లేకపోతే యీకెంపుల కింతపూత యెలా వచ్చిందీ? మంచి సరసు డాయన" అని మెచ్చుకుంటూ మహారాజది అందుకుని పరిశీలనగా చూసి, వొరతీసి వాయి కూడా పరీక్షించి, బాగుంది అని అప్పలనరసిహరాజుకి అందించాడు.
     "నాలుగో నాడు కొత్తఆట వేశాం.  నాయెదట కూచుని ఆడింది ఆయనేకాని, తెరచాటునుంచి సలహాలు వచ్చాయి.  తెరచాటున నెమిలిపిట్ట వున్నదా అని భ్రాంతి పడ్డాను నేను.  ఆట వారం రోజులు సాగింది;  కాని, మహాప్రభూ! ఏమి రాకడలూ అవీ? ఏమి ప్రతిఘటనలూ అవీ! ఒక్కొక్క యెత్తు వొక్కొక్క వూపు వూపేసింది నన్ను.  ఎనిమిదో సాయంత్రం, తెరచాటునుంచి తన వొడిలో పడిన యీవుంగరం నా వేలికి తొడుగుతూ ఆయన చేసిన ప్రశంసా, తెర చీల్చుకు వచ్చిన మందహాసజ్యోత్స్నా యిప్పటికీ నాకు పులకలు రేపెడుతున్నాయి."
     ఇలా చెప్పి, శంకరప్ప, యెడమచేతి అనామిక నుంచి తీసి, ఆరత్నాంగుళీయకం మహారాజుసన్నిధిలో వుంచాడు.
     మరో గడియ యిలాగే గడిచాక అందరూ లేచారు.
     మన్నాడుకూడా వుదయం యిలాగే గడిచిపోయింది.
     తరవాత అదే మామూ లయుపోయింది.
"మనం కొంచెం జోరు చేసేశాం.  తమరు వుసికొల్పడం వల్ల నేను కూడా వుద్రేకంలో పడిపోయాను" అంటూ చాలా పరితపించాడు ఆదివరాహమూర్తి.
     "నేను మాత్రం యిలా అవుతుందని యెరుగుదునుటండీ?  ఆ ఠాణేదారుగాడు నన్ను తప్పుదారిలో పెట్టేశాడండీ!" అంటూ పిసుక్కున్నాడు దివాన్జీ.
     "మహారాజు దృష్టిలో క్షుద్రుణ్ణయి పోయాను నేను.  నాకు తరుణోపాయం కనపడ్డం లేదు."
     "ఆటపూర్తికాకుండా బెంబేలు పడిపోతారేమిటండీ?"
     "ఆటవేరూ శంకరప్పగారి ప్రవృత్తివేరూ కాదండీ? ఆ వినయవిధేయతలూ, ఆ సభ్యతామర్యాదలూ మహారాజుని ముగ్ధుణ్ణి చేసేస్తున్నాయి.  నే నసత్యవాదినే కాదు, ఈర్ష్యాళువు నయిపోయాను.  అదీకాక: ఆట యెప్పుడో పూర్తి అయిపోయింది"
     "అంటే?"
     "అంటే యేంవుందీ? ఇక్కడికి నెల్లాళ్ళనుంచీ ప్రతిదినమూ వుదయమూ సాయంత్రమూ వెళ్ళి బల్లదగ్గిర కూచోడం తప్ప మరేమీ పనిలేదు.  మహారాజిక యెత్తు వెయ్యలేరు."
     "వెయ్యలేరూ?" అంటూ దివాన్జీ మాన్పడి పోయాడు.
     "వేసేం లాభమూ? ఇప్పుడు వేసిరాజు మాత్రమే.  ఎత్తు వేస్తే కొట్టిరాజే.  అంచేత మహారాజు తటాపటాయిస్తున్నారు"
.........
     "ఎటు చూసినా ఆటకట్టిందని ఒప్పుకోడమే మర్యాదగా కనపడుతోంది"
     "మరి దారి లేదంటారా"
     "ఉంది, మహాప్రభూ! వుంది.  బల్లదగ్గిరికి, బల్లదగ్గిర్నుంచి కావలసినంత దారి"
     "వారి చాతుర్యం కళ్ళారా చూస్తున్నావు నువ్వు"
     "అవును, చూస్తున్నాను"
     "రోజూ రెండుపూటలా వారిదర్శనం అవుతోంది నీకు "
     "అహా, అవుతోంది"
     "వారు, మీయింటికి విజయంచేశారు"
     "నీకు కనపడుతూవున్నదీ, నిన్నూరిస్తూ వున్నదీ యిదే;  కాని, దీనివల్ల నాకు కలిగిన మహాభాగ్యం యమయాతన మాత్రమే అని యెరగవు నువ్వు"
     ఇది విని అలివేణి వులిక్కిపడింది.
     "పందిట్లోనుంచునివుండి పందిట్లోనుంచే వెళ్ళిపోయారు వారు.  నాచైతన్యం అంతా వారివెంటే వెళ్ళిపోయింది.  ఇప్పుడు నీయెదట వున్నది రంగమ్మ కట్టెమాత్రమే"
     ఈమాటతో రంగనాయిక కంఠంలో గద్గదిక అంకురించింది.  అలివేణి కళ్ళు అనిమిషా లయిలాయి.
     "రెండుపూట్లా వారిదర్శనం అవుతోంది కనక, కర్పూరవిడెం సమర్పించుకునే టప్పుడు మునివేళ్ళ స్పర్శ అయినా అవుతోంది కనక, యెప్పుడైనా వొక్కొక్కమాటు, వారు, కాటుకకళ్ళ నిండా చూస్తున్నారు కనక రంగమ్మ నింకా నువ్వు చూడగలుగుతున్నావు"
     "నాకందులో సహస్రాంశమూ లేదుగా?"
     రంగనాయిక క్షణం ఆలోచించి "శాస్త్రుల్లుమామయ్యగా రున్నారుగా? వారి నాశ్రయించరాదూ!" అంది.
     "అదీ అయింది.  ఈ ఆటసంగతి తేలితేగాని, వారు మాట్టాడరన్నా రన్నయ్యగారు" అని అలివేణి మొగం వేలవేసుకుంది.
     "ఒక్కపని చెయ్యి"
     "ఏమిటదీ?"
     "తెల్లవారితే యిటు మహారాజు కొలువు.  దీపాలు పెడితే అటు వారి రాక.  కనక నాకెలాగా యోగం లేనట్టే.  నువ్వు బసకే యెందుకు వెళ్ళగూడదూ?
     "శాస్త్రం చెప్పినట్టుంది నీ సలహా"
     "అదేమే?"
     "పెద్దమ్మగా రంటే వారికీ భయమే, అన్నయ్యగారికీ భయమేట"
     "పాదసేవకీ అభ్యంతరం వుంటుందా?"
     అలివేణి "అవునుసుమా" అంటూ యెగిరిపడి "నువ్వు చెప్పింది బాగుంది.  ఇక ఆప్రయత్నం చేస్తాను.  ఆయేర్పాటు చేసేదాకా అన్నయ్యగారి పాదాలు వదలను" అంది.
     "అదేవిధంగా చివలికి నీకేనా అదృష్టం --- "
     "నాకంత అదృష్టం పడితే నీకూ పట్టిందన్నమాటే.  మొదటిరోజున నిన్ను తీసుకునే వెడతాను"
     "అయితే, మధ్యాహ్నం రెండు జాములవేళ మామయ్యగారి నోమాటు మీయింటికి రప్పించగలవా"
     "వో! నిమిషంలో రప్పిస్తాను.  మాఅమ్మ తీసుకువస్తుంది."
     "అట్నుంచి నరుక్కువద్దాం.  నాకు వేళఅయింది, వెళ్ళిపోవాలి, యిక నువ్వు వెళ్ళు"
     ఇద్దరూ వొకమాటు గంభీరంగా చూసుకుని "సంయే"  "సంయే" అనుకుని, అభీష్టం నెరవేరినట్టే ఆనందిస్తూ అలివేణి యింటికి వెళ్ళిపోగా, వుపక్రమణిక ఆలోచించుకుంటూ రంగనాయిక వెళ్ళిపోయింది.
     "ఏమౌద్దంటారు బాబయ్యా?"
     "ఏమిటోయ్ అయేది? మహారాజే నెగ్గేస్తారు.  వాడితలకాయ దగ్గిరవుండి, కోట కొమ్మలికి నేను కట్టిస్తానిక మాదిగ అమ్మిగాడిచేత" అంటూ వెన్ను విరుచుకుని మీసం మీద చెయ్యివేసుకున్నాడు ఠాణేదారు.
     "అంతమాట అనెయ్యకండి బాబయ్యా! ఇదివరకే తొందరయిపోయిం దికనేనా జాగ్రత్తగా వుండడం మంచిదండి"
     "అయితే, యెమంటావ్"
     "ప్రభువ్వారు నెగ్గలేరుటండి.  నెగ్గడం దాకా ఎందుకూ కాయే కదపలేరు టండి"
     "ఆఁ !"
     "సూరపురాజు బాబయ్య సెలవిప్పించారండి.  ఆటకట్టిపోయేవుందిట దేవరా!"
     "కొంపతీసి గోచీపాతగాడు నెగ్గేస్తాడా యేమిటి?"
     "మనవి చేసుకున్నాను కాదండీ? అలాంటి మాట రానియ్యకండి బాబయ్యా! దేవిడీమన్నా అయిందంటే --- "
     "ఓరి నీ యిల్లు --- "
     ఠాణేదారు నో రెండిపోయింది
     "పైకి దయ చెయ్యండి బాబయ్యా!" అన్నాడు చల్లా జగ్గప్ప మెట్లకేసి చూపిస్తూ
     "అప్పుడే శంకరప్పగారు వచ్చారా యేమిటి?" అని సూరపరాజూ "యెత్తేమయినా పడిందా?" అని ఆదివరాహ మూర్తీ వొక్కమాటే అడిగారు.
     ఇద్దరికీ "లేదండి బాబయ్యా!" అని వొకటే జవాబు.
     "మ రేమంటావోయ్?"
     "ఏమీ లేదు పైకి దయ చెయ్యండి"
     "ప్రభువు --- "
     "ఈపాటికి నల్ల చెరువుదగ్గిరికి చేరుకుంటారండి"
     "అదేమిటి?"
     "ప్రభువ్వారూ, శంకరప్పగారూ, అప్పలనరసింహరాజు బాబయ్యా వేటకి --- 
     "మరి ఆట?" అని అడిగాడు మూర్తి.
     "శంకరప్పగారికి వేటకూడా అలవాటుందా యేమిటి?" అని ఆశ్చర్యపడుతూ అడిగాడు సూరపరాజు.
     ఇంతలో "వేటేమి టండోయ్?" అంటూ వెంకటరాయుడు వచ్చాడు.
     జగ్గప్ప వివరాలు చెప్పాడు.
     దానిమీద "అయితే యిక మేము పైకెందుకూ వెళ్ళడం?" అనడిగాడు మూర్తి.
     "ఎత్తేమయినా దొరుకుతుందేమో పరకాయించ మని సెలవయింది బాబయ్యా!"
     "ప్రభువ్వారికి తోచని యెత్తు మనకా తోస్తుంది?" అని అన్నాడు వెంకటరాయడు.
     "ఎత్తుతోచడం సర్వాబద్ధం.  ఇక వున్నదల్లా యేమిటంటే! ప్రభువు లేరు కనక, బలంచూస్తూ మనం ధారాళంగా చర్చించుకోవచ్చు.  ఇది కాదని అదీ, అది కాదని యిదీ యెత్తు వేసి చూడవచ్చు"
     సూరపరాజిలా అనగా "బలం యేమాత్రం కలిసి పోయినా మన పరువు తక్కదండోయ్" అన్నాడు మూర్తి.
     "పైనెవరున్నారు జగ్గప్పా?"
     "బంగారపు బలం యెలా వుందో అలాగే దంతపుబలం సర్ది వుంచింది అలాయిదాగా రంగనాయిక.  నాగరత్నం కూడా పైనే వుందండి.  వీరభద్రమూ విరిబోణీ వచ్చే వేళయిందండి"
     "బతికాం మరి తొరగా పదండి" అంటూ మెట్లకేసి తిరిగాడు బోసినోరు తప్పళించుకుంటూ మూర్తి.
     సూరపరాజు మెట్ల దగ్గిరికి బయలుదేరి "వెంకటపతిరాజు దద్దయ్యగా రుంటే బాగుండును.  అన్నట్టు విజయరామరాజుగారూ?" అని అర్థోక్తిలో వుండగా, "వారు భీమవరపుతోట వేంచేశారు బాబయ్యా! మళ్ళీ పదిరోజుల్లో దయచేస్తారండి.  వెంకటపతిరాజు బాబయ్యకీ, అప్పలాచార్యులయ్యవార్లంగారికీ, మల్లికార్జునలింగం అయ్యవార్లంగారికీ కభురు వెళ్ళింది.  తమరు దయచెయ్యండి, రాగానే పైకి తీసుకు వస్తావారి" నంటూ జగ్గప్ప బయలుదేరాడు.
     వారు ముగ్గురూ యేకవరసన మెట్లెక్కేశారు.
రోజులు కాదు, వారాలు కాదు, మాసాలే ఆరు గడిచి పోయాయి; కాని, యెత్తుపడలేదు.  దారీ దొరకలేదు.  ఆశే అంతరించిపోయింది.
     ఈ ఆరు మాసాల్లోనూ యెక్కడి కెక్కడికో కభుర్లు వెళ్ళాయి.  ఆహూతులూ, అనాహూతులూ యెవరెవరో యెంద రెందరో ఆటకాళ్ళు వచ్చారు.
     ఎన్నో పరిశోధనలు చేసి, యెన్నో మాట్లు రకరకాల యెత్తులు వేశారు కాని, బంగారపుబలం బంగారపుకొండ అయి అలాగే ఉండిపోయింది.
     కోటలో బంగారపుబలం యెలావుందో అలా సర్దుకుని మూర్తి వగైరాలు తమ యిళ్ళల్లో కూడా తీవ్రప్రయత్నాలు చేశారు.
     ఒక్కొక్క బల్లదగ్గిర పదేసి మందీ, యిరవయ్యేసి మందీ నలుగుళ్ళు పడ్డారు.
     పెద్దాపురానికి పెద్దాపురమే వుడికిపోయింది;  కాని ప్రయోజనం కలగలేదు.
     చివరికి, మహారాజుకి, నిద్రాహారాలు కరువయిపోయాయి.  రాచకార్యాలమీద వెగటున్నూ పుట్టింది.
కరకర పొద్దుపొడిచింది.
     ఎర్రని సూర్యబింబం, పొగనింపి అప్పుడే వెలిగించిన కాగితబ్బుట్టలాగ మెల్లిగా పైగి లేవసాగింది.
     దేవిడిలో ఝాంఝకారా మంటూ నగారా మోగిపోసాగింది.
     ఊళ్లోశివాలయంలో రుంజలు, ఆనగరాకి జవాబివ్వసాగాయి.
     బురుజుమీది నరసింహస్వామి ఆలయం పసిడికుండ, జిగజిగ మెరిసిపోతుంది.
     ఘంటాపధాలన్నీ అసివారులు బయలుదేరిన అశ్వికులతో నిండిపోయి వున్నాయి.
     సాలలు బాగుచెయ్యడం కోసం, కోటలో బయటకట్టి వున్న మదపుటేనుగు ఘీంకారాలతోటి పారశీకాశ్వాలు సకిలింపుల తోటీ అన్నదాతలను ఆహ్వానిస్తున్నాయి.
     అగడ్తలో, తమ్మిచెర తప్పించుకుని, మహోల్లాసంతో పాటలు పాడుకుంటూ గండుతుమ్మెదలు పూలతోట కొల్లగొట్టడానికి కోటలో చొరబడుతున్నాయి.
     ఇలాంటి సమయంలో, సాముగరిడీలు చాలించి, మహారాజు అప్పుడే స్నానపుగదిలో ప్రవేశించాడు.
     నూనే జిడ్డు వదలడానికి ఇద్దరు గుబ్బెతలు సుగంధ చూర్ణంతో నలుగు పెడుతున్నారు.
     ఒకతె సువర్ణకలశం పట్టుకుని గంగాళందగ్గిర నుంచుంది.
     మరొకతె ఆగంగాళంలో నీళ్ళు తొరుపుతూవుండగా యింకొకతె అందులో పన్నీరు గుమ్మరిస్తోంది.
     వేరొకతె, వుండుండి చెయ్యిపెట్టి నీళ్ళు పాళాలు చూస్తోంది, పరిశీలనగా.
     ఇంకొకతె కొంచెం దూరాననుంచుని చెంగావిపంచెకి చుంగలు సవరిస్తోంది.
     మరొకతె అందరిమీదా కళ్ళతో అధికారం చెలాయిస్తూ, ఆజ్ఞలకోసం యెదురుచూస్తూ కొంచెం పక్కగా నుంచుని వుంది.
     మానసికాందోళనవల్లా, సుఖస్పర్శవల్లా కళ్ళు మూసుకుని, మొగం కూడా వంచుకుని వున్న మహారాజు హఠాత్తుగా మెరపు కొట్టినట్టయి ఆమెకేసి చూశాడు.
     వెంటనే "చిత్తం మహాప్రభూ!" అంటూ ఆమె సావధాన అయింది.
     "చల్లా జగ్గప్ప - నుంచున్నట్టుగా" అని కొంచెం ఆత్రంగా చెప్పి మళ్ళీ కళ్ళుమూసుకున్నాడు మహారాజు.
     అజ్ఞ అంచెనోళ్ళమీద వెళ్ళింది.
     జగ్గప్ప యెగిరివచ్చి "హాజర్ మహాప్రభూ!" అంటూ దోసిలి వొగ్గి, నమ్రుడయినాడు.
      కళ్ళు తెరవకుండా మొగం మాత్రం అటు తిప్పి "జగ్గప్పా?" అన్నాడు మహారాజు.
     "చిత్తం మహాప్రభూ!"
     "ఎలావున్నాసరే, శంకరప్పగారిని నిమిషాలమీద తీసుకురావాలి"
     "తీసుకువస్తాను మహాప్రభూ!"
     "పాలకీ అయితే ఆలస్యం అవుతుంది.  గండభేరుండాన్ని తీసుకు వెళ్ళు"
     "చిత్తం చిత్తం"
     "ఇంకా నుంచున్నావు"
     "లే - ద్ - మ -"
     జగ్గప్ప మాటకంటే ముందు వుడాయించాడు.
     "తొరగా తెమల్చాలి" అన్నట్టు పరిచారికల కేసి చురుగ్గా చూశాడు మహారాజు.
స్నానసంధ్యానుష్ఠానాలన్నీ ముగించేసుకుని, ఆరివున్న అంగాస్త్రాలజత ధరించి, మిత్రుల కిద్దరికీ మధ్యగా, కవాచీ బల్లమీద కూచునివున్నాడు శంకరప్ప.
     కొంచెం పక్కగాను, పడమటింటి గుమ్మానికి చేరికగానూ పెద్దమ్మా, లోగుమ్మంలో తలుపు ఆనుకుని రామసోదెమ్మా, మండువాదక్షిణపుటంచున గోడ ఆనుకుని అలివేణి రంగనాయికా నుంచుని వున్నారు.
     "చెల్లాయిది ఆరుమాసాల తపస్సు, రంగనాయికదిన్నీ ఆపాటిదే కనక మీరీపాటికి వరదులు కావడం దర్మం" అన్నాడు శాస్త్రి.
     అలివేణి దోసిలి వొగ్గింది.
     "సంగతిసందర్భాలన్నీ మామయ్య గారితో మనవి చేసుకునే వున్నాను.  మళ్ళీ యిలాంటి అవకాశం యెప్పటికో? అంచేత నేనాదుర్దా పడిపోతున్నాను" అంది జాలిగా రంగనాయిక.
     "మిమ్మల్ని నిర్బంధించడానికి మేము చాలం;  కాని, మీరివాళ దయచెయ్యక తప్పదు.  బాహాటంగా అంగీకరించడం తరవాయిగా మహారాజు వోడిపోయే వున్నారు.  ఆకాస్తా అయిపోయిందనుకుందాం.  ఇక మీతో యెత్తు వెయ్యడాని కెవరికి గుండెలు తాళుతాయీ" కనక మీరివాళ 'ఊఁ' అనాలి, తప్పదు" అని యాజులు వొత్తిచెప్పాడు.
     దానిమీద "యిక తప్పేటట్టు లే" దన్నట్టు శంకరప్ప పెద్దమ్మకేసి చూశాడు.  అదిగుర్తించి "పెద్దమ్మగారి అనుగ్రహమూ మాభాగ్యమూనూ" అంది అలివేణి.
     "వెర్రిపిల్లవు, జగత్పండితుడైన నా వరహాలమూటకి నేనా చెప్పగలదాన్ని?" అంటూ పెద్దమ్మ రామసోదెమ్మ కేసి చూడగా, ఆమె శంకరప్పకి మాత్రమే కనపడేటట్టు విభ్రమవిలాసాలు మొలిపించి తలుపుచాటున నక్కింది.
     దాంతో శంకరప్ప కళ్ళల్లో వింత తేజస్సు మెరిసి, అలివేణి కనుదమ్ములకు వికాసంయిచ్చి, రంగనాయిక చెవులకు మధురశబ్దం అందించింది.
     ఈసమయంలో కొంజాదగ్గిరనుంచే "పెద్దమ్మగారూ!" అంటూ పిలుపు వినిపింటింది.  వెంటనే గుమ్మంలోకి వెళ్ళి పెద్దమ్మ "యేం జగ్గప్పా?" అనడిగింది.
     వచ్చినమనిషి జగ్గప్ప అని తెలవడంతోటే నాలుక కరుచుకుంటూ రంగనాయికా, అలివేణీ తూర్పింటోకి దూటారు.
     'దండాలు బాబయ్యా! దండాలండి, దండాలండి"
     "శుభం ...... ఏమోయ్ తెల్లవారకుండా వచ్చావు?"
     "ప్రభువ్వారు తరిమి పంపారు దేవరా! నుంచున్న పాళంగా తోడితెమ్మని సెలవు.  పాలకీ అయితే ఆలస్యం అయిపోతుందని గండభేరుండం పంపారు.  ఈపాటికి సగం దూరాన వుంటుందండి"
     "అంత వులకం యేమిటోయ్?"
     "తెలవదు బాబయ్యా"
     తదేకదృష్టితో చూస్తూ "విసుగ్గా వున్నారా?" అని అడిగాడు శంకరప్ప.
     "లేదం" డన్నాడు జగ్గప్ప.
     "ఏంచేస్తున్నారు?" అనడిగాడు యాజులు
     "స్నానప్రయత్నంలో ఇంకా నలుగుల్లోనే వున్నారండి"
     శంకరప్ప చిరునవ్వు బిగపట్టుకుని, మిత్రులకేసి బెల్లింపు చూపులు చూశాడు.
     "ఏదో యెత్తు తోచింది, మరి లేవండి" అంటూ యాజులు లేచి నుంచున్నాడు.
     చిరునవ్వు నవ్వుతూ, పెదవి విరుస్తూ, తల అడ్డంగావూపుతూ తొంగిచూసి రంగనాయిక మళ్ళీదాక్కుంది.
     "అదిగో గండభేరుండం బాబయ్యా!" అన్నాడు జగ్గప్ప.
     శంకరప్ప నిశ్చలంగా అలాగే కూచుని వున్నాడు
     అదిచూసి "లే, యింకా జాప్యం చేస్తావేం నాయనా?" అంటూ పెద్దమ్మ తొందరపెట్టింది.
     అప్పుడు మొగం పక్కకితిప్పుకుని, కిందకి చూస్తూ వొక్కమాటు తలపంకించి, తాపీగా మళ్ళీ మొగం తిప్పుకుంటూ "జగ్గప్పా!" అంటూ అందుకున్నాడు శంకరప్ప.
     "చిత్తం బాబయ్యా!"
     "శంకరప్ప ఏనుగెక్కేగాని, గుర్రంయెక్కి వెళ్ళడోయ్"
     అదేదో బోధపడక జగ్గప్ప తెల్లపోయాడు.
     శాస్త్రీ, యాజులూ మొగమొగాలు చూసుకున్నారు.
     పెద్దమ్మ శంకరప్పని విడిచి జగ్గప్పనీ, జగ్గప్పని విడిచి శంకరప్పనీ చూడసాగింది.
     "కనక నువ్వు వెళ్ళిపోవచ్చు"
     "వెడతాను దేవరా?" అంటూ చేతులు నలుపుకున్నాడు జగ్గప్ప.
     "ఈమాటే మనవి చెయ్యి ప్రభువ్వారితోటి"
     "చిత్తం చిత్తం" అంటూ నసిగాడు జగ్గప్ప.
     "ఇంక గండభేరుండం యెందుకూ?"
     "పాలకీ --- "
     "ఇప్పటి కంతే మరి"
     "సెలవు బాబయ్యా!"
     "శుభం"
     "దండాలండి, దండాలండి, దండాలండి"
     బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి జగ్గప్ప గుర్రం యెక్కాడు.
     గుర్రాలు మేఘాలెక్కాయి.
"ఆరు మాసాల ఆందోళనవల్ల, గుర్రంకదిపితే యేనుగుతో తెరచి రాజవుతుందన్న సంగతి మరచిపోయారు ప్రభువ్వారు" అని కళ్ళు చికిలించుకుంటూ, జగ్గప్ప వెళ్ళీ వెళ్ళడం తోటే రంగనాయిక మళ్ళీ వాకిట్లోకి వచ్చింది.
     "శాబాసు" అంటూ ఆమె వెనకనే అలివేణిన్నీ వచ్చింది.
     "ఏమిటీ?" అంటూ యాజులూ, "అవును సుమా" అంటూ శాస్త్రీ వూగిపోయారు.
     అది శంకరప్పకి వుద్రేకం కలిగించింది.  
     ఆరుమాసాలుగూ బలవంతాన అణిగి వుండిన వుత్సాహం అంతా వొక్కవూపున కట్ట తెంచుకుని వురికి, శంకరప్పని గుంజిగుంజి విడిచిపెట్టింది.
     దాంతో "మనం నెగ్గేశామండి!  మహారాజివాళ తమ వోటమి వొప్పేసుకుంటారండీ" అంటూ చంటిపిల్లాడిలాగ పరవళ్ళు తొక్కి, అమాంతంగా వెళ్ళి పెద్దమ్మ కాళ్ళదగ్గిర చతికిలబడ్డాడతను.
     పెద్దమ్మకిన్నీ వుత్సాహమూ, ఆనందమూ వెల్లివిరిసి పోయాయి.
     వెంటనే శంకరప్పని పట్టుకుని "నాతండ్రే! నాబాబే! ఈమాట వినడానికి కనిపెట్టుకుని వున్నాను నాయనా నేను.  నాకళ్ళు చల్లబడ్డాయి బిడ్డా!" అంటూ వూర్ధ్వశ్వాసతో మూర్ధాఘ్రాణం చేసిందామె.
     అది చూసి అలివేణి "యిదంతా పెద్దమ్మగారి చేతిచలవ" అనగా "యింకా సందేహమా!" అంటూ ఆవేశంతో అందుకున్నాడు శంకరప్ప.
     "మీరంతా శంకరప్ప మహా తెలివయినవాడను కుంటుంన్నట్టుంది.  ఇదంతా శంకరప్ప ప్రజ్ఞే అనుకుంటున్నట్టూ వుంది;  కాని, అసలు శంకరప్ప ఆదిలోనే మొగం వేలవేశాడు.  ఇప్పుడు మీయెదుట వున్న శంకరప్ప పెద్దమ్మ ప్రాణప్రతిష్టచేసి విడిచిపెట్టిన పిండిబొమ్మ.  నిజంగా పెద్దమ్మ కటాక్షించి వుండకపోతే, శంకరప్ప యెవరో, మీరెవరో, మహారాజెక్కడో, యీగొడవ అంతాయేమిటో! ఎన్ని జన్మలెత్తి యెంతసేవ చేసినా నేను పెద్దమ్మరుణం తీర్చుకోలేను.  పెద్దమ్మ శక్తి యీవుళ్ళో యెవరెరుగుదురూ? మహారాజు నాకోసం పాలకీ పరివారమూ పంపారంటే - సేనాధిపతినే పంపారంటే అది పెద్దమ్మ వేసిన ఎత్తుకి ఫలితం.  ఎందుకని దయతలచి ఆవేళ వారు రాగానే నన్ను పంపించిందిగాని, పెద్దమ్మ వొకరోజు బెట్టుసరీ చూపిస్తే మహారాజే పాదచారి అయి రాకపోదురా వెతుక్కుంటూను?  ఆదిలో పెద్దమ్మ వేసిన యెత్తే యిప్పుడు మహారాజు ఆట కట్టిందనుకోండి.  నామరూపాలు లేక గాలికెగిరివచ్చిన యీదూదిపింజెని 'మనిషి, వుక్కుతునక' అనిపించింది పెద్దమ్మ.  దివాన్జీ నౌకర్లచేత యీడ్పులుపడ్డ శంకరప్పకి పెద్దాపురం మహారాజుచేత తహజీ మిప్పించింది పెద్దమ్మ.  అంటే నాపెద్దమ్మ ఆదిశక్తిఅని యిప్పుడేనా తెలిసిందామీకు? నాపెద్దమ్మ నాయిలవేల్పు"
     ఇలా అంటూ పరవశు డయిపోయి కళ్ళుమూసుకుని అతను పెద్దమ్మ పాదాలమీద వాలాడు.
అందరికళ్ళూ చెమ్మగిల్లాయి.
     శాస్త్రీ, యాజులూ, అలివేణీ, రంగనాయికా పెద్దమ్మ కేసిచూస్తూ అప్రయత్నంగా దోసిళ్ళు వొగ్గారు.
     కళ్ళుతుడుచుకుంటూ వచ్చి, పెద్దమ్మమీద ఒక చెయ్యి ఆనుక్కూచుని, రామసోదెమ్మ బోర్లాపడుకుని వున్న శంకరప్ప వీపు నిమిరింది.
     అప్పటికి పెద్దమ్మకి మాట తిరిగింది.
     "అన్నం అమ్ముకుంటూ పొట్టపోసుకునే ముసలిముండ యింతపని చెయ్యడం యెక్కడేనా వుందా?  కనక నా వెర్రితండ్రి మాటలు మీరెవరూ నమ్మకండి నాయనా! 'చేతిలో యెర్రని యాగానిలేదు.  మహారాజుని ఆశ్రయిద్దామని వచ్చాను.  అన్నం పెడతావా పెద్దమ్మా' అంటూ వచ్చాడు నాతండ్రి.  ఆదైన్యంలోనే ఆమొగం మీద నాకు దేవతాకళ కనపడింది.  'నీకొడుకనుకో' అని యెవరో చెవిలో చెప్పినట్టయింది.  దీనికి సాయం నామేనగోడలు యీవెర్రిపిల్ల 'కట్టుకోడానికి బట్టలుకూడా లేనట్టుంది అత్తా - మొగం కలకల్లాడుతోంది, గొప్పవాడు కామోసు, వొప్పకోవమ్మా' అంటూ పాకులాడింది.  లేదన లేక పోయాను.  పెట్టాలని వుంటే పదిమంది తిని పోయేచోట గుప్పెడన్నమే మిగలకపోతుందా? నీకులోటు లేదు, రా, నాయనా!' అన్నాను.  అదివిని పొందిపోయాడు నాతండ్రి.  అప్పుడే మొదలు ఈ పడిపడి దణ్ణాలికి.  చిట్టితండ్రికి నేనంటే యేదో వెర్రిభక్తి కుదిరిపోయింది.  ఇంతకీ నాతండ్రికి జయంకలిగింది నాకు కావలసిందదే" అందామె.
     అప్పటికి ప్రకృతిలో పడి లేచి కూచున్నాడు శంకరప్ప.  
     వెంటనే రామసోదెమ్మ పడమటింటోకి వెళ్ళిపోయింది.
     తరవాత 'నౌకర్లు చేత యీడ్పులు పడ్డం యేమిటో కూడా చెబితేగాని వల్లకా" దంటూ వెళ్ళి శంకరప్ప రెండు చేతులూ పట్టుకున్నాడు శాస్త్రి.
     యాజులుకూడా మొండిపట్టు పట్టాడు.
     పెద్దమ్మా శంకరప్పా వొక్కమాటు చూసుకున్నారు.  
     ఆచూపుల్లో మెరుపుతీగలు పాకిపోయాయి.
     వెంటనే ఒక్కమాటు కంఠం సవరించుకుని శంకరప్ప జరిగినదంతా చెప్పేశాడు.
     విని విని "దివాన్జీకీ, ఠాణేదారుకీ పుట్టగతులుంటాయా" అంటూ పెద్దమ్మ పళ్ళుకొరికింది.
     అలివేణీ రంగనాయికా కంటతడి పెట్టుకున్నారు.
     "ఈతుచ్ఛుల్ని దేవిడీమన్నా చేయించవలసిందే" అంటూ శాస్త్రీ, యాజులూ అగ్గయిపోయారు.
     ఇంతలో పాలకీ వచ్చింది.
     ఒక్కమాటు రంగనాయికనీ, అలివేణీనీ చూసి పెద్దమ్మ శంకరప్పకి కనుసన్న చేసింది.
     వెంటనే "అలివేణీ? రంగనాయికా!" అంటూ మహోత్సాహంతో లేచి అత నందుకున్నాడు.
     "ఇప్పటికి నేను వచ్చినపని అయింది.  అనుకున్నదీ నెరవేరింది.  ఇక యేది యేమయినా యిబ్బంది లేదు.  అదివరకెందరితో ఆడినా, మహారాజుతో యెత్తువేశాక అటో యిటో అది తేలిపోయే దాకా మరెవరితోటీ ఆట వెయ్యకూడదనుకున్నాడు.  శాస్త్రిగారి తోటీ యాజులుగారితోటీ కూడా ఆడలేదంటే యిక చెప్పడానికేం వుందీ? ఇక ఆవ్రతం పూర్తి అయినట్టే; కనక యివాళ రాత్రి - తెలిసిందా? ఇక మీయింటికి వచ్చి యెత్తు వేస్తాను.  మీకోరిక తీరుస్తా"
     శాస్త్రీ, యాజులూ చాలా ఆనందించారు.
     అలివేణీ రంగనాయికా పొంగిపోయి, అంతలో కొంచెం సిగ్గుపడ్డారు.
     ఈసమయంలో చాకలి పెద్ద వచ్చి "హాజర్ బాబయ్యా!" అని విన్నవించి పాలకీదగ్గిరికి వెళ్ళిపోయాడు.
     అందరి దగ్గిరా సెలవు పొంది, కళ్ళు తిప్పుకుంటూ శంకరప్పని పొగుడుతూ రామసోదెమ్మ దారి చూపగా "అలాగాండి? బాగుందండి.  అవును, మంచిబట్టలే వుంటే వారియెదట రాచ కొమాళ్ళ విశేషం యేమిటండి?  మీమేలు మరిచిపోరండి వారు.  దీపాలు పెట్టాటప్పటికివాళ భోజనం పెట్టించండేం అక్కయ్యగారూ!" అని గునిసి, రంగనాయిక, దొడ్డిదారిని కోటకి వెళ్ళిపోయింది.
     ఆమె కోట సమీపిస్తుం దన్నంతవరకూ జాప్యం చేసి శంకరప్ప లేచాడు.
     వెంటనే అలివేణి అతని పాదాలు అంటి కళ్ళకద్దుకుని, ఒక్కమాటు అతని కళ్ళల్లోకి సవిలాసంగా చూసి, తానే కరిగిపోయి, నును సిగ్గుతో పక్కకి తప్పుకుంది.
     "అబ్బాయోయ్.  అగ్రహారం.  జ్ఞాపకంవుందా? మరో టయితే నే నొప్పనుసుమా" అంటూ పెద్దమ్మ సాగనంపగా, శాస్త్రి యాజులు గార్ల బుజాలమీద చేతులు వేసుకుని పున్నమ చంద్రుడు లాగ మెరిసిపోతు శంకరప్ప పాలకీదగ్గిరికి బయలుదేరాడు.
పాలకీలో కాలు గుమ్మంలో పెట్టాటప్పటికి వూచలాగ వచ్చి మహారాజు శంకరప్పని కౌగిలించుకున్నాడు.
     కళ్ళు తెరిచి చూశాటప్పటికి ఆ కౌగిలింతతోనే యిద్దరూ సింహాసనం మీద కూచుని వున్నారు.  మహా విలవ అయిన తలకాయకు తగినసత్తాలేక, దివాన్జీమెడ జవజవలాడి తోటకూరకాడ అయిపోయింది.
     సభ్యులందరి కంటే ముందు తనకంఠం సవరించుకుని "శంకరప్పగారూ!" అని సంబోధించాడు మహారాజు.
     "ఏమి సెలవు జగత్ప్రభూ!" అని శంకరప్ప దోసిలివొగ్గాడు.
     "తమరు నా ఆట కట్టేశారండీ"
     "ఎంతమాటా! నిర్హేతుకజాయమాన కటాక్షంవల్ల తమరలా సెలవిప్పిస్తున్నారే కాని, యేలినవారి ఆటకట్టడానికి నేనెంతవాణ్ణి మహాప్రభూ?"
     "అలాకాదండీ! స్పష్టంగా నేనోడిపోయాను.  చదరంగంలో నాకిదే మొదటివోటమి.  ఓటమివల్ల మనుష్యుల మానసికావస్థ లెలాపరిణమించేదీ నాకిప్పుడేబోధ అయింది.  అయితే, ప్రతికక్షి రసికుడైతే వోటమికూడా ఆనందకరంగా వుండేటట్టే కనపడుతోందండీ"
     "ఒక్కమనవి మహాప్రభూ!" అంటూ అందుకున్నాడు అప్పలనరసింహరాజు.
     "నాఅంచనా తప్పిపోలేదు.  తమరుభయులూ ఆటకి కూచుంటే యెవరోడినా పర్యవసానం యిలాగే వుంటుందని నే నాదిలోనే నిశ్చయించుకున్నాను. అంచేతే యెంతజంకినా, శంకరప్పగారిని నేను బలవంతపరచ గలిగాను.  ఆరుమాసాల తీవ్రస్పర్ధకి ఫలితంగా, చివరికి, విజితులూ విజేతలూ కూడా సమంగా ఆనందించడం - యిది మానవప్రవృత్తికి అతీతమైన విషయం."
     "తమరింకొకటికూడా సెలవిప్పిస్తారని తలుస్తున్నాను"
     "చిత్తం మహాప్రభూ, మనవి చేసుకుంటున్నాను.  ఈ ఫలితానికి సన్నికృష్టకారణం శంకరప్పగారి ప్రవృత్తిన్నీ.  ఏమంటే? శంకరప్పగారి యీవిజయం సామాన్యమైనదా?  కాని, దానికి సంబంధించిన పొంగు లేశమయినా వారిదగ్గిర కనపడుతోందా? వారిమొగంమీద యెంత సాత్విక తేజస్సు భాసిస్తోందో చిత్తగించారా?"
     "అదీ సంగతి.  దాని వల్ల పరిసరాలన్నీ అకలుషాలయినవి.  బ్రహ్మతేజస్సంటే అదేకదూ?"
     "చిత్తం చిత్తం"
     దీనిమీద చేతులుజోడించుకుని "శ్రీహరీ! మాటలు రాని కొండికవాణ్ణి పట్టుకుని యిద్దరు ప్రభువులు అలా సెలవిప్పించడం ధర్మమా?" అంటూ అందుకున్నాడు శంకరప్ప;  కాని, మాటకి అడ్డంవచ్చి మహారాజు ఇద్దరు కాదెంత మందయినా యీపని చెయ్యవలసిందే.  ఏమంటే నిజంగా చదరంగం ఆడతగ్గవారు తమరొక్కరే కనబడుతున్నారు.  ఇందులో తమర్ని జయించగల వాడింతవరకూ పుట్టలేదు, ఇకముందూ పుట్టబోడు" అన్నాడు.
     శంకరప్ప మొగం వంచుకున్నాడు.
     "తమచేతిలో అపజయం పొందడంకూడా వొక భాగ్యం లోనే లెక్ఖ"
..........
     "మనస్సు నిలుపుకోలేక ఆట వెయ్యడమేకాని, యెవరితో వేసినా చంటిపిల్లలతో ఆడుతున్నట్టే వుండేది.  తమతో ఆడ్డం మాత్రం కత్తులమీద పరీక్షా, నేలవిడిచి సామూనూ"
     "ఇప్పటిదాకా నేనున్నూ --- " అంటూ మోడ్పుకేలితో ప్రభువు కేసి తిరిగి అందుకున్నాడు శంకరప్ప.
     "అనేకులతో చదరంగం ఆడాను.  అందర్నీ ఓడించాను;  కాని పెద్దాపురం కోటలో అడుగుపెట్టినప్పుడు కాళ్ళు వొణికాయి.  తమ యెదట కూచున్నప్పుడు గుండెలు కొట్టుకున్నాయి.  తమ దివ్యతేజస్సు నన్ను విభ్రాంతుణ్ణి చేసేసింది.  తీరా యెత్తు వేసిన తరవాత తమతో ఆటకి కూచోడం దుస్సాహనం అని బోధపడింది.  పట్టుపట్టి యేలినవారితో ఆడినందుకు నేను సిగ్గు పడిపోతున్నాను మహాప్రభూ!"
     "సిగ్గా? ఓడిపోయిన నాకే ఆనందంగావుందే, తమ కేలా సిగ్గు. ఆట మొదలుపెడితే యెవరికో వొకరికే గెలుపు.  రెండో వారోడి పోవలసిందే.  అయితే అంతమాత్రాన వారిని తీసిపారెయ్య వలసిందేనా? నిజంగా,  చూదవలసినవి శక్తిసామర్ధ్యాలూ, యుక్తిప్రయుక్తులూనే; కాని, జయాపజయాలు కావు"
     ఇలా అని మహారాజు తనకేసి చూడగా "ఏలినవారు సత్యం సెలవిప్పించారు" అంటూ అందుకున్నాడు అప్పలనరసింహరాజు.
     "శంకరప్పగా రెంతకేనా సమర్థులు; కాని, వారు తమ శక్తి యెంతటిదో యేరుగరు.  వారిని కోటకి తీసుకురావడం నాకు చాలాకష్టం అయిపోయింది"
     "దీని కంతకీ కారణం నాశపథం.  'నేనయ్యా మహామొనగాణ్ణని యెక్కణ్ణుంచో వచ్చి, యెత్తు వేశాటప్పటికి చేతులు వేలవేస్తే యెలాంటివాడూ కూడా సహించడం కష్టం.'  అందుచేత అసమర్థులూ, కళాజీవులు కానివారూ సిద్ధపడకుండా వుండడానికే నేనీ శపథం పట్టాను గాని, మరొకందుకు కాదు.  దీనికి నిదర్శనం, వచ్చినవా రోడిపోతే తల కొట్టించివేస్తా నన్నాను కదా, మరి నేనే వోడిపోతే?"
     "చిత్తం చిత్తం, నేనామాటే మనవి చేసుకున్నాను శంకరప్పగారితో.  కాస్త యోచించగలవారి కెవరికయినా యిది తోచేప్రశ్నే.  ఇందులో యేదో గంభీరార్థం వుండకపోదు --- "
     "ఉండకపో దంటే తమరు గ్రహించలేనిదా యిది అయినా నేనే మనవిచేసుకుంటాను"
     ఇలా చెప్పి శంకరప్ప కేసి తిరిగి, చేతులు కట్టుకుని "దాసోహమ్" అని మహారాజు శిరస్సు వంచుకున్నాడు.
     అది చూసి అప్పలనరసింహరాజు చకితుడైనాడు.
     శాస్త్రి, యాజూలూ నిర్విణ్ణు లయిపోయారు.
     విజయరామరాజు దివాన్జీకేసి నిరసనగా చూశాడు.
     సభ్యులందరూ గతుక్కు మనిపోయారు.
     అంతకు ముందే "శ్రీహరీ! శ్రీహరీ!" అంటూ చెవులు మూసుకుని "ఎంతమాటా? కిరీటమాంధాతలు మమ్మేలినవారు తమరెక్కడ,  క్షుద్రబిక్షుకుణ్ణి నేనెక్కడ మహాప్రభూ? తమ రంతమాట సెలవిప్పిస్తే నేను భరించగలనా?" అంటూ శంకరప్ప తహతహలాడిపోయాడు.
ఒక్కక్షణం గడిచాక, ఆనందభాష్పాలు కొనగోట చిమ్ముకుంటూ "శంకరప్పగారూ!" అని మళ్ళీ సంబోధించాడు మహారాజు.
     "చిత్తం మహాప్రభూ!" అంటూ అంజలిబంధంతో శంకరప్ప సావధానుడైనాడు.
     "ఇంతటి ఉత్కంటానందం నాకింతవర కెప్పుడూ కలగలేదు.  ఇందుకు గుర్తుగా, తమ ప్రతిభముందు నాసంపత్తి అణువునూ పోలదు గాని, అయినా చంద్రున కో నూలుపో గని శాస్త్రమే కనక, పెద్దాపురం రాజ్యంలో వున్నది యేమయినా సరే తమకి సమర్పించుకుంటాను సెలవిప్పించండి"
     "నాకు బహుమానమా మహాప్రభూ?"
     "అవును ..... కాకేమీ ..... తమకంటే బహుమానార్హులు మరెవరూ?"
     "పోనీ, నేనిప్పటికే బహుమానం పొందివున్ననుకదా?"
     "అదెలాగా?"
     మహారాజు, అప్పలనరసింహరాజుతేసి చూస్తూ యిలా అనగా, ఇదంతా వోరకంట చూస్తూవున్న దివాన్జీ యీనిండు సభలో తాను చేసిన పని బయటికి వచ్చేస్తుందేమో అని కుతకుత లాడుపోతూ తలకాయ తీసుకువెళ్ళి పొట్టలో పెట్టుకున్నాడు.
     అది చూడమని శాస్త్రి యాజులుగార్ల కు కన్నుగీటి శంకరప్ప మళ్ళీ అందుకున్నాడు.
     వత్సవాయివారి సాహసౌదార్యాలు చాలా విన్నాను.  ప్రకృతం సకృచ్ఛ్రంగా చూస్తూనూ వున్నాను.  నాకు ఆనంద పారవశ్యం కలుగుతోంది.  ఇదిలా వుండగా: కందనోలి సంఘటన చిరస్మరణార్హమే కాని, మాచెల్లెలు చంద్రవదన, అది చాలదని పూర్వపక్షం చేసేసింది.  "పెద్దాపురం మహారాజులుంగారితో  కూడా యెత్తువేస్తే కాని, తనకి తృప్తి లేదని" ఆమె నన్ను తరిమి పంపింది.  నేను చాపలం జయించుకోలేక పోయినాను.  మురిసిపోతూనే వచ్చాను;  గాని పెద్దాపురం ప్రవేశించడం చాలా సాహసం అని అనుభవం అయింది.  ఏమయినా ముళ్ళకంచెల్లో బాధపడి చివరికి సహకారం పొంద కలిగాను.  ఏలినవారితో వొక్క ఆటా ఆడగలిగాను.  తమతో అర్ధాసనమున్నూ అధిష్ఠించగలిగాను.  తృప్తి అయింది.  నాబతుకున్నూ సఫలం అయింది.  ఒక పిచ్చిబ్రాహ్మడి కిది సంభవమా మహాప్రభూ? ఒక దరిద్ర దేవత కిది లభ్యమేనా రాజాధిరాజా? ఇంతకంటే నేను కోరతగినట్టిన్నీ, పొంద తగినట్టిన్నీ బహుమానం మరేం వుంది భూలోకదేవేంద్రా?"
     దీనికి మహారాజేదో చెప్పదలచుకుంటూ వుండగా "నేను మనవి చేసుకుంటాను" అంటూ అప్పలనరసింహరాజు లేచాడు.
     మహారాజు "సెలవిప్పించండి" అన్నాడు.
     "సంగ తంతా తమకి విశద మయ్యే వుంది.  దాన్ని బట్టి చూస్తే తమ దర్శనం లభించడమూ, తమతో యెత్తువెయ్య గలగడమూ - ఇవే శంకరప్పగారికి మహామేరువులు, కాని వారి కళాభిజ్ఞత --- "
     "అదీ సంగతి.  వారి కళాసంపద మన మందరమూ కొల్ల లాడినాము.  దానికి పరిహారం చూపించవద్దూ? ఇంతేకాక, ఏ విద్యలోనయినా, యేకళలోనయినా నిష్ణాతులైనవారికి వత్సవాయివారి సత్కారం లేకుండా వుండగూడదని మా మూల పురుషుల శాసనం.  దానికి తప్పడం మాకు ధర్మమా, సాధ్యమా?  విద్యలకు మా రాజ్యంలో అయినా అనాదరం జరగకూడదే.  యిక నాదగ్గిరా జరగవలసింది?"
     "నాదగ్గిర యేలేశమాత్రమో కళాభిజ్ఞత వుండడం నిజమే కాని, అది చెప్పుకోతగ్గది కాదు.  నా యెడల శ్రీదాట్ల అప్పలనరసింహరాజు బహద్దరు వారికి  నిర్హేతుకంగా పుత్రవాత్సల్యం కలిగి పోయింది.  భీమవరపుకోట నాన్నగారు దానికి దోహదం చేశారు.  ఆ రసికప్రభువుల ఆదరవాత్సల్యాలే నన్ను తమ సన్నిధికి చేర్చాయి గాని, నా శక్తిసామర్థ్యాలు కావు"
     "అయితే, మామయ్యగారికి అలాంటి ఆదరవాత్సల్యాలు కమయెడల మాత్రమే, కలగటానికి క్కారణం?"
     ఉన్నట్టుండి విజయరామరా జిలా అడగ్గా మందహాసం చేస్తూ "మరి వారి సందేహంతీర్చండి" అన్నాడు మహారాజు.
     అంజలిబంధంతో విజయరామరాజుని నిర్దేశిస్తూ "అదిలోనే వారికి నచ్చచెప్పుకోలేక పోయాను.  ఇలా నిలవతీసి అడిగితే యిప్పుడేం చెప్పుకోగలనూ? కాక, జగత్ప్రభువులతో చర్చ సాగించడం అనుచితం" అంటూ వినయనిధేయతలు కనపరిచాడు శంకరప్ప.
     అవ్యవధానంగా "కనక, తమ అభీష్టం సెలవిప్పించండి" అన్నాడు అప్పలనరసింహరాజు.
     "తప్పనిసరి కావడంవల్ల విన్నవించుకుంటున్నాను.  అయితే, నాకొక తృప్తి లేకపోలేదు.  అదేమిటంటే? ఎదటవున్నది మహాసముద్రమే.  కాని నాచేతిలో వున్నది బుడ్డచెంబు మాత్రమే.  మరి ప్రకృతం.  మహాప్రభూ? నేను నిరుపేదను.  నిరుపేదలకు కావలసినవి కూడూ కూడ్డానూ.  వీటిలో యేలినవారు నాకొక్క అన్నంమట్టుకు పెట్టిస్తే, అదే మహా మేరువుగా సంతోషిస్తాను"
     ఈ మాటనే టప్పుడు శంకరప్ప చాలా నిర్లిప్తత కనపరిచాడు.
     అది చూసి అందరూ మొగమొగాలు చూసుకున్నారు.
     శాస్త్రీ యాజులూ "కొంపతీసి యేదో కాస్తమాన్యం కోరేస్తారా యేమిటి శంకరప్పగారు" అనుకుంటూ ఆదుర్దాపడి పోయారు.
     ఈధోరణి గుర్తించుకోలేక మహారాజు తనకేసి చూడగా, అప్పలనరసింహరాజు "విందాం మహాప్రభూ" అన్నాడు.
     "మనవి చేసుకుంటున్నాను" అని శంకరప్ప, మాట అప్పలనరసింహరాజు కందించి, మహారాజుకేసి తిరిగాడు.
     "నా యిష్టక్రీడ చదరంగం.  దానివల్లనే యేలినవారికి నా యెడల ఆదరభావం కలిగింది"
     "చిత్తం" అన్నాడు మహారాజు
     "కనక నాకోరిక దానికి సంబంధించే వుండడం వుచితం"
     "సెలవిప్పించండి"
     "'చదరంగానికి అరవైనాలుగు గదులు.  మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి.  తరవాత, రెండోగదిలో రెండు, మూడోగదిలో నాలుగు, నాలుగోగదిలో యెనిమిది - యిలాగ వెళ్ళినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ!"
     ఇలా అని శంకరప్ప వొక్క క్షణకాలం మహారాజు కేసి చూశాడు.  తరవాత సన్నిహితులకేసి చూశాడు.  చివరికి సభఅంతా కలయచూశాడు.
     కాని, వొక్కరూ తనమాట బోధపరచుకున్నట్టు లేక పోగా మందహాసంచేస్తూ, కనపడీ కనపడనట్టొక మాటు తల పంకించుకున్నాడు.
     శాస్త్రికీ, యాజులికీ కూడా అది బోధపడలేదు;  కాని, యిందులో కూడా గొప్పచాతుర్యం వుంటుంది.  వుండితీరుతుంది" అనుకుని, యింతలో శంకరప్ప ధోరణిచూసి "వోస్! వుందోయ్" అన్నట్టొకరూ "ఓహ్! వుండకేమోయ్!" అన్నట్టొకరూ తల లెగరవేసుకున్నారు.
     అప్పటిదాకా కమిలి, కుమిలి, వుడికి, మాడిపోతూ వుండిన దివాన్జీ "పుట్టెడుగింజ లయితే పారబోస్తాను పట్టుకుపో" అనుకుని తలకాయ విసిరేసుకున్నాడు.
     ఉండుండి "మళ్ళీ మనం మధ్యాహ్నం కలుసుకుందాం" అన్నాడు మహారాజు.
     "చిత్తం చిత్తం" అన్నాడు శంకరప్ప.
     ఇద్దరూ సింహాసనం దిగారు.
     సభఅంతా ఉబ్బెత్తుగా లేచింది.
     అర్హులదగ్గిర కళ్ళతో సెలవుపుచ్చుకుని మహారాజు వాస గృహానికి వెళ్ళిపోయాడు.
గద్దె దిగీదిగడంతో అప్పలనరసింహరాజూ, విజయరామరాజూ శంకరప్పని కౌగిలించుకున్నారు.
శాస్త్రీ యాజూలూ పాదాభివందనం చేశారు.
     మూర్తీ మొదలయినవారు వచ్చి ముట్టడించేశారు.
     ఇక్కడ యిది యిలా జరుగూతూ వుండగా, సేనాధిపతి వచ్చి కనుసన్నచేసి, అప్పలనరసింహరాజుని యెడంగా తీసుకువెళ్ళాడు.
     "చిత్తగించారా?"
     "సెలవిప్పించండి"
     "ఠాణేదారుకి దేవిడీమన్నా అయిపోయింది.  పెద్దాపురంలో వుండడాని క్కూడా సెలవులేదు"
     "ఒ - క - టి"
     "దివాన్జీవారి విషయం సందేహాస్పదంగా వుంది.  కేవలమూ దేవిడీమన్నా కాకపోవచ్చు గాని --- "
     "రెండు పూర్తి చేయిస్తారనుకున్నాను."
     "కావాలనేనా తమ నిశ్చయమున్నూ?"
     "ఇంకా - మెల్లిగా --- "
     "నిజమే  కాని - మనిషికి పరశ్శ్రేయ సహనం --- "
     "లేశమయినా వుంది టండీ?"
     "లేదు లేదు"
     "ప్రత్యక్షశయ్య కనపరిచిన బులుసు రామ గోవింద శర్మ గారిని కూడా యిలాగే అగౌరవపరిచారు కాదుటండీ ఈయన?"
     "ప్చ్"
     "గొట్టుముక్కల రామభద్రరాజు మామయ్యగారు పూనుకుని రాకపోతే అలివేణికి ప్రవేశం కలగనిచ్చునుటండీ ఈయన నృత్యం విషయంలో పెద్దాపురం రాజసభకి అది తెచ్చిన పేరుప్రతిష్ఠలు మరే రాజసభకి మరే నర్తకి తేగలిగిందండీ?"
     "జ్ఞాపకం వుంది"
     "రామతీర్థం వైణికులు పరమశివశాస్త్రిగారు విసిగిపోయి ముందుకి సాగిపోవడాని క్కారణం ఈయన కాదుటండీ? వారు బిక్కనవోలు దాటి వెళ్లకపూర్వమే యేనుగు భీమరాజుగారు మహారాజులుంగారికి సంగతి విన్నవించి వుండకపోతే, అప్పుడు పెద్దాపురం సంస్థానాని కెంత అప్రతిష్ఠ వచ్చి వుండేదండీ?"
     "నిజమే"
     "ఢిల్లీ అత్తరువర్తకుడు షుకురల్లీ ఖాను, గులాబీ అత్తరు సీసా కోటగోడకి వేసి కొట్టడానికి క్కారణం ఈయన కాదుటండీ"
     "అవును"
     "లాహోరువస్తాదు దళపతిసింగు 'ఇంకెవరూ లేరూ?' అంటూ కాలుదువ్వి తొడ చరిచి మీసంమీద చెయ్యివేసు కున్నప్పుడు, యీరంకి వీరావధానులుగారు జబ్బచరిచి నిలవక పోతే, పెద్దాపురం రాజ్యం నామరూపాలు నిలిచి వుండునుటండీ? నల్లపరాజు వెంకటపతిరాజు దద్దయ్యగారు అడ్డుకున్నారు కనక సరిపోయింది; కాని, అవదానులుగారిని ఈయన కోటలో అడుగు పెట్టకుండా చెయ్యాలని చూశారు కాదుటండీ?" 
     "యథార్థమే"
     "అప్పుడదా? ఇప్పుడిదా? ముందైనా ఈయన బుద్ధి వక్రించకుండా వుంటుందని హామీ వుందా? అయినా మహారాజులుంగారింకా వోపికపట్టడం బాగుందా?"
     "తమరు సెలవిప్పించింది యేదీ కాదనను.  ఈయన్న సమర్థించాలేను;  కాని, లెక్ఖల్లో వున్న ప్రావీణ్యమూ, వసూళ్ళలో వున్న శ్రద్ధా ఈయన్ని కాపాడుతున్నాయి.  అయితే కళలన్నా, విద్యలన్నా, మహారాజులుంగారు చెవికోసుకునేటప్పుడు ఆవిషయాలలో ఈయన కలగజేసుకోకుండా వుంటే బాగుండిపోవును"
     "మహారాజొక్కమాటు గట్టిగా మందలిస్తే"
     "తమకా సందేహం అక్కర్లేదు.  ఇవాళ మహారాజు వీరభద్రావతారం తాల్చేశారు"
     "నిజంగా?" అని కనుబొమ్మ లెగరవేసుకుంటూ, తల వూపుతూ అడిగాడు అప్పలనరసింహరాజు.  మహారాజు, దివాన్జీయెడల ప్రాతికూల్యం చూపించలేడని అతని నమ్మకం.  అంచేత యిది వినేటప్పటికి అతనికి చాలాచాలా ఆశ్చర్యం కలిగింది.
     "ఆవుగ్రరూపం చూసి నేనే జంకిపోయాను"
     "జవాబేమయినా --- "
     "కిమన్నాస్తి.  అసలు కన్నెత్తి చూడకలిగితేనా"
     "అలాగేం?"
     "ఈజన్మలో పోదు దివాన్జీగారికి ఆ వుదుటు"
     "తమకలా తోచింది"
     "తోచడమేమిటి, మరొకరయితే యీ పాటికి వుద్యోగం వదులుకుని --- "
     "అంతపని కాదు లెండి ఈయన వల్ల"
     "నిజమే, కాని, కొన్నాళ్ళపాటు మొగం చూపించలేరు"
     "ఐతే, యిందుకే సంతోషిద్దాం ఇప్పటికి"
     ఇంతలో చల్లా జగ్గప్పవచ్చి పిలవగా సేనాధిపతి "సెలవు" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.  అప్పలనరసింహరాజు శంకరప్ప దగ్గిరికి బయలుదేరాడు.
అప్పటికి జాము పొద్దుంది.
     పెద్దాపుర ప్పట్నం అంతా కోటలో వుంది.
     కోట అంతా సభాభవనంలో వుంది.
     సభ అంతా లక్ష్మీ సరస్వతీ లాస్యం చేస్తున్నారు.
     ఒకవిధంగా, క్షణాలు యుగాలూ, మరోవిధంగా యుగాలు క్షణాలూ అయిపోతున్నాయి.
     సముద్రతీరాన లాగ, ఒకవైపున తరంగకల్లోలమూ వినబడుతోంది, మరోవైపున గాభీర్యమూ విరాజమానం అవుతోంది.
     ఈస్ధితిలో, సభలో వున్నవారి కందరికీ యెవరికీ వారికే గుబగుబలాడిపోయింది మనస్సు.
     ఉత్తరక్షణంలో చల్లా జగ్గప్ప ద్వారంలో అడుగుపెట్టాడు, గంభీరంగా చూస్తూ.
     అతగాణ్ణి చూసి చోపుదారులు బరాబరులు చేశారు.
     ఆసందట్లో వేత్రహస్తులు ప్రవేశించారు.
     అప్పుడు జరీవస్త్రాలూ, కాశ్మీర దుశ్శాలువలూ, సింహతలాటం మురుగులూ, భుజబందులూ, కెంపులకంఠమాలా, మకరకుండలాలూ, బంగారపు గోవతాడూ, రవ్వల వుంగరాలూ ధరించి, నడికట్టున కందనోలి కటారితో, అపరమన్మథుడయిపోయిన తంగిరాల శంకరప్ప చెయ్యి పట్టుకుని, రెండుపక్కలా గుబ్బెతలు వింజామరలు వీస్తుండగా, శ్వేతచ్ఛత్రం వహించి మరొకతె అడుగుల్లో అడుగులు వేసుకుంటూ అనుసరిస్తూ వుండగా, వాళ్ళ వెనక, సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తి లాగ భాసిస్తూ మహారాజు విజయం చేశాడు.
     వెంటనే సభ్యులందరూ వుబ్బెత్తుగా లేచి నుంచున్నారు.
     ఈ అడావుడిలో, దంతపుబలమూ, దంతప్పనిచేసిన చదరంగం బల్లా పట్టుకుని విరిబోణీ, రత్నఖచితమైన చంద్రహాసం పట్టుకుని రంగనాయికా వచ్చారు.
     తరవాత, షరా బనుసరిస్తుండగా సేనాధిపతి వచ్చాడు.
     అప్పటికప్పుడే మహారాజు శంకరప్పతో సింహాసనం అలంకరించాడు.
     ఆసన్నివేశం, సూర్యచంద్రు లిద్దరూ ఒక్కమాటే - ఒక్కచోటే వుదయించినట్టుంది.
     సభ అంతటా విలక్షణతేజ స్సావరించినట్టూ అయింది.
     దాంతో, సోత్సాహులై సభ్యులందరూ కూచోగా, వుద్రిక్తులై వందిమాగధు లొక్క గడియసేపు కైవారాలు చేసి వోసరిల్లారు.
     "ఏమి, లెక్క తేలిందా?" అని అడిగాడు మహారాజు.
     "చిత్తం, తేలింది మహాప్రభూ! అయితే, వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం అంతటా వరాసగా నూరుసంవత్సరాలు పండినధాన్యం అయినా చాలదు" అంటూ షరాబు కాగితం మహారాజు కందించాడు.
     "అయ్యో!" అని చకితుడై పోయాడు మహారాజు.
     శంకరప్ప యేమీ యెరగనట్టు చల్లా మొగం వంచుకున్నాడు.
     విజయరామరాజు "నేను మనవి చేసుకున్నాను కాదూ?" అన్నట్టు అప్పలనరసింహరాజు కేసి చూశాడు.
     శాస్త్రీ, యాజూలూ విజయగర్వం ప్రకటించుకున్నారు.
     తరవాత, వొక్కక్షణం ఆలోచించి మహారాజు అందుకున్నాడు.
     "శంకరప్పగారూ!"
     "చిత్తం మహాప్రభూ!"
     "వడ్లగింజలతో కూడా నన్నోడించేశారు తమరు"
     "తమ రంతమాట సెలవిప్పించడం --- "
     "ఇదేమంత మాటా? ఆటలో తమరెంతవారో, మాటలో అయినా నేనంతవాణ్ణి కాలేకపోయాను.  అయితే వత్సవాయి వారిలో నేటివరకూ ఆడితప్పినవారు లేరు; కనక తమరు కోరిన ధాన్యానికి బదులు మారాజ్యమే సమర్పించుకుంటున్నాను స్వీకరించండి"
     ఇది విని, సభ్యులు స్తబ్ధులయి పోయారు.
     "ధర్మమా జగత్ప్రభూ?" అంటూ మోడ్పుకేలితో నమ్రుడైనాడు శంకరప్ప.
     "ఏమీ, యెందుకు కాదూ?"
     "నేను పుట్టినవూరే తూర్పూ పడమరా యెరగనే, నా సంసారం నిర్వహించుకోడమే నాకు చేతకాదే, నేనీ విశాల రాజ్యం యేమి చేసుకోనూ?"
     "తమరది యేమయినా చేసుకోండి.  నేను మాట అనేశాను.  అది జరిగితీరవలసిందే"
     "మమ్మేలినవారి మాట వరహాలమూటే, అది చెలామణీ అయి పోవలసిందే.  అయితే, తమరు చెల్లించవలసింది నాకు దయచేసిన మాటే కాని మరోమాట కాదు మహాప్రభూ!"
     "నేను మాట మార్చలేదే?"
     "మార్పించారు జగత్ప్రభూ!"
     ఉలిక్కిపడి "నిజమా?" అన్నట్టు అప్పలనరసింహరాజు కేసి చూశాడు మహారాజు.
     "అవు" నన్నట్టు మొదట మహారాజుకి మందహాసం అందించి, అప్పలనరసింహరాజు, తరవాత శంకరప్ప కేసిచూసి "సెలవిప్పించండి" అన్నాడు.
     "జగత్ప్రభువులు నాకు వాగ్దానం చేసింది రాజ్యంలో వుండుకున్నది యేదయినా సరే అనే కాని, రాజ్యానికి రాజ్యమేకా" దన్నాడు శంకరప్ప.
     అదివిని మహారాజు విభ్రాంతుడైనాడు.
     "అదీ సంగతి.  శంకరప్పగారు సర్వతోముఖ ప్రజ్ఞావంతులు. ఇక వారిదగ్గిర చాతుర్యానికీ, ఔచిత్యానికీ కొదవ యెలా వుంటుందీ?" అని మహారాజుతో విన్నవించి, అప్పలనరసింహరాజు, శంకరప్పని చూసి "కనక తమ వాంఛితార్థం యేమిటో సెలవిప్పించండి" అన్నాడు.
     వెంటనే శంకరప్ప "ఒక బ్రాహ్మణ కుటుంబం సుఖంగా జీవించడానికి చాలినంత వృత్తి దయచేస్తే నాకదే మహామేరువు జగత్ప్రభూ!" అన్నాడు.
     రాజబంధువులూ రాజపురుషులూ తేరుకున్నారు.
     అప్పలనరసింహరాజూ, విజయరామరాజూ అదికూడా గుర్తించి చకితులైనారు.
     సభ్యులు ఆ చివరనుంచి ఈచివరికి విసిరేసినట్టయారు.
     శాస్త్రీ యాజులూ నిరుత్సాహ పడిపోయారు.
     మహారాజు సభ అంతా కలయచూశాడు.  అందరి యింగితమూ గుర్తించాడు.
     శంకరప్ప వేసినయెత్తు కూడా గమనించి "శంకరప్పగారూ!" అంటూ మెల్లిగా అందుకున్నాడు.
     "నేను అనేక కళలలోనూ, అనేక శాస్త్రాలలోనూ ఆరితేరిన అనేకమందిని సందర్శించి, వారి వైదుష్యం గ్రహించి ఆనందించి వున్నాను;  కాని, తమలాగా నాకు పారవశ్యం కలిగించిన వారులేరు.  తమ వైదుష్యం సర్వతోముఖంగా వుంది.  తమ సాన్నిధ్యం నా కనేకవిధాల వుత్తేజనం కలిగిస్తోంది"
     శంకరప్ప నమ్రుడైనాడు.
     "మరి ప్రకృతం.  ఒక పనివాడొక సంవత్సరం క్రిందట యీబలమూ, యీబల్లా తయారు చేసుకువచ్చాడు.  ఇంతటి పనివాడితనం నేనిదివరకెప్పుడూ చూడలేదు.  యోచించగా యివి తమకోసమే నిర్దేశించబడ్డవా అనిపిస్తోంది, కనక తమరివి వుపయోగించండి"
     శంకరప్ప అవి అందుకుని, కళ్ళకద్దుకున్నాడు.
     "మరిన్నీ, చదరంగం బుద్ధిబలానికి సంబంధించినదే అయినా, అందులో యుద్ధతంత్రం అంతా నిగూఢంగా వుంది.  ఆ ఆటలో నిపుణులైనవారు సేనాధిపత్యాని కర్హులు.  సేనాధిపతికి చంద్రహాసం ప్రధానవస్తువు కనకనూ, నల్లచెరువు దగ్గిర పందిని పొడిచి నప్పుడు తమరు కనపరచిన ధైర్యసాహసాలూ, శూరత్వమూ తమ అర్హతను వెల్లడించాయి కనకనూ, తమరు యీ చంద్రహాసం కూడా వినియోగించండి"
     శంకరప్ప అదికూడా అందుకుని కళ్ళ కద్దుకున్నాడు.
     తరవాత వొక్కక్షణం వూరుకుని "శంకరప్పగారూ!" అని సంబోధించాడు మహారాజు.
     "చిత్తం మహాప్రభూ!"
     "తమ కోరిక తీర్చలేకపోయాను"
     తమ "రలా ,సెలవిప్పించవద్దు, నేను వడ్లగింజల కోరిక వుపసంహరించుకున్నాను మహాప్రభూ.  వృత్తి మాత్రమే --- "
     "అదెంత పెద్దదో యిదంత చిన్నది.  రెండూ నా శక్తికి అతీతాలే.  కాగా, నేను తమ కోరిక తీర్చలేకపోవడమే మిగిలింది. ఇక మధ్యేమార్గం తొక్కక తప్పదు.  మా రాజ్యంలో తుని అని ఒక గ్రామం వుండడమూ, ఇలాంటి వైషమ్యం యేర్పడ్డప్పుడు, మహామహులనుకూడా వొడ్డెక్కించడానికి, దాన్ని పురస్కరించుకుని వొక ధర్మసూత్రం యేర్పడి వుండడమూ తమరు వినే వుంటారు.  దాన్నిపట్టి తమరు మొదట కోరిన వడ్లగింజలూ కాక, తరవాత కోరిన వృత్తీకాక, నేను తమకి సర్వలక్షణసంపన్న మైన వొక సర్వాగ్రహారం సమర్పించుకుంటున్నాను"
     శంకరప్ప, మొదట నమ్రుడై అంజలి బంధంతో ఆమాట అందుకుని, తరవాత "ఏలినవారి నిర్ణయం, మహౌదార్య లక్ష్యంగానే కాక శాస్త్రసమ్మతంగా కూడా వుంది.  ఏమంటే?  క్షత్రియకుమారునికి విశాల సామ్రాజ్యం యెలాంటిదో, బ్రాహ్మణకుమారునికి సర్వాగ్రహారం అలాంటిది.  కనక మహాప్రసాదం మహాప్రభూ!" అంటూ చాలా ఆనందించాడు.
     దీనిమీద అప్పలనరసింహరా జేదో అందా మని లేవబోతూ వుండగా, మహారాజు ఇంగితం కనిపెట్టి, షరాబు లేచి నుంచున్నాడు.
     "ఏలినవారు, శంకరప్పగారికి ఆందోళికాది పరివారం యేర్పాటు చేయించారు.  వారికోసం మన పట్నంలో వొక దివ్యభవంతి కూడా నిర్దేశించి సర్వసిద్ధంగా వుంపించారు."
     సభ వుత్సాహతరంగితం అయిపోయింది.
     "మరిన్నీ, యేలినవారికి శంకరప్పగారి దర్శనం కావడానికి హేతుభూతురాలు పెద్దమ్మగారు, కనక ఆమెకి నూటపదహారు రూపాయల బహుమానమూ, సాలీనా నాలుగు మలక పుట్ల ధాన్యం బరాతమూ యేర్పాటయింది."
     ఇది విని "ధన్యుణ్ణి" అంటూ చేతులు యెగరవేసుకుంటూ వుచ్చైస్వరంతో పలికాడు శంకరప్ప.
     "పెద్దమ్మగారి ద్వారా యేర్పడిన హేతువు కార్యరూపం తాల్చడానికి సాధనభూతులు కొంపెల్ల రామశాస్త్రిగారూ, చిలుకూరి వెంకప్ప యాజులుగారూనూ.  కనక, వారికిద్దరికీ, చెరొక నూటపదహారు రూపాయలూ బహుమానించారు ఏలినవారు"
     శాస్త్రీ, యాజులూ లేచి నమ్రులైనారు.
     శంకరప్ప వారికేసి తిరిగి వంగి నమస్కరించాడు.
     మహారాజు శంకరప్ప కేసి చూశాడు.
     వెంటనే శంకరప్ప "ఒక్కమనవి" అన్నాడు.
     "సెలవిప్పించండి"
     "ఈనా అభ్యుదయానికి శ్రీదాట్ల అప్పలనరసింహరాజు బహద్దరు వారూ, శ్రీ భీమవరపుకోట నాన్నగారూ ---- "
     మాట సగంలో అందుకుని, మహారాజు "మేమే వారూ, వారే మేమూనూ.  ఇదంతా వారి యేర్పాటే. తమ వుద్దేశం యింకా యేమిటీ?" అని అడిగాడు.
     "అంతే అంతే, మరేమీలేదు మహాప్రభూ! శంకరప్ప సర్వాంగీణంగా సత్కరించబడ్డాడు జగత్ప్రభూ!" అని, శంకరప్ప, మాటిమాటికీ వారిని అంజలిబంధంతో నిర్దేశిస్తూ చంటిపిల్లాడి లాగ ఆనందపారవశ్యం అనుభవించి, ఒక్క గడియసేపు నిరర్గళవాగ్ధాటితో తన ప్రస్తావచాతుర్యంకూడా చూపించి, అందర్నీ సంతోషవిహ్వలులను చేశాడు.
శంకరప్ప అలాగ వూరుకున్నాడు.
     అంతే.
     వెంటనే సమ్మోహనాస్త్రం యొక్క పుంఖధ్వని లాగ యిలా వుపాంగం వినవచ్చింది.
     దాన్నుజ్జీవింపచేస్తూ మద్దెలగాడు చాటువేశాడు.
     అవ్యవధానంగానే తాళాలు గర్జించాయి.
     కన్నుమూసి తెరిచాటప్పటికి, యెగిరివచ్చి, అలివేణి, "సా" అంటూ పతాకహస్తంతో నృత్యం ప్రారంభించింది.
     సభ్యులలో, అలివేణి నృత్యం అనేకమాట్లు చూసిన్నీ, వోహో అని ప్రశంసించిన్నీ తృప్తి యెరగనివారు కొందరు.
     "నాటికి మళ్ళీ నేడు" అంటూ చారెడేసి కళ్ళు చేసుకున్న వారు కొందరు.
     "అది మన కళ్ళబడుతుందా?" అని తపస్సు చేస్తున్న వారు మరి కొందరు.
     మొత్తానికి వారందరూ కళ్ళప్పగించి వూరుకున్నారు.
     అంతటితో వూరుకోక "చెల్లాయి యివాళ వొళ్ళు మరచిపోతుంది" అనుకున్నాడు శాస్త్రి.
     "అగ్రహారీకు లైన శంకరప్పగారి వైభవాలకు మొదలు" అనుకున్నాడు యాజులు.
     ఎడమచేతి తర్జనితో లలాటం తుడుచుకుని, అంజలిబంధంతో అలివేణి నమ్రురా లయింది.
     పరవశులై వుండిపోయిన సభ్యులు, ఒక్క క్షణానికి గాని నృత్యం అయిపోయిన సంగతి గుర్తించలేకపోయారు.
     తలయెత్తి ఆబగాచూసింది;  గాని శంకరప్ప మెప్పుచూపు లతో లజ్జితఅయి, అలివేణి మొగం వంచేసుకుంది.
     ఆమె మొగం ప్రఫుల్లపద్మం అయి వుండడం గుర్తించి, రంగనాయిక, శాస్త్రికేసి సాకూతంగా చూసింది.
     శాస్త్రి రంగనాయిక కేసి చూసి, వొక్కమాటు రెప్పలల్లార్చి మొగం పక్కకి తిప్పుకున్నాడు.
     యాజులు తల పంకించుకున్నాడు.
     "ఎదటకూచుని మహావిద్వాంసుడు చూస్తున్నా డన్న ఉత్సాహంతో, అలివేణి, యివాళ వొళ్ళుమరిచి పోయింది" అన్నాడు విజయరామరాజు, జనాంతికంగా.
     "అదీ సంగతి.  కోట్లిచ్చినా కళాశీలి కలాంటి ఆవేశంకలగదు మరి" అన్నాడు అప్పలనరసింహరాజున్నూ అలాగే, జనాంతికంగా.
     ఇది యిలా జరుగుతూ వుండగా చల్లా జగ్గప్ప మహారాజు దృష్టిపథానికి వచ్చాడు, మెల్లిగా.
     వెంటనే "జగ్గప్పా!" అని పిలిచాడు మహారాజు.
     "చిత్తం మహాప్రభూ?" అంటూ జగ్గప్ప మరింత ముందుకి వచ్చాడు.
     "పొద్దున్న యేమన్నారూ శంకరప్పగారూ!"
     "ఏనుగెక్కేగాని గుర్రం యెక్కి వేం చెయ్యమన్నారు మహాప్రభూ!"
     "ఏంచేశావు మరి?"
     "మొగసాలలో యేనుగు సిద్ధంగా వుంది మహాప్రభూ!" ఇలా అని జగ్గప్ప సింహద్వారం కేసి చూశాడు.
     ద్వారంలో, తొండం పైకెత్తుకుని భద్రగజం ఘీంకారం చేసింది, శంఖం వురుముతున్నట్టు.
     దగ్గిర వుండి మహారాజు శంకరప్పని గజారోహణం చేయించాడు.
     వెంటనే వింజామర చేత పుచ్చుకుని, అలివేణి కూడా యేనుగెక్కేసింది.